Friday, December 27, 2024

తాలిబాన్ కు తలొగ్గిన అగ్రరాజ్యం, కశ్మీర్ కు పొంచి ఉన్న ముప్పు

ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన తాజా ప్రకటన తెలిసిందే.మే 1 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ కల్లా ఈ తంతు ముగుస్తుంది. ఈ తంతు ముగియవచ్చేమో కానీ, అనేక తీవ్రమైన సమస్యలు ముందు ముందు ఆరంభమవుతాయి.అందులో ప్రధానమైంది ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం పెరుగుదల.దీనివల్ల, ముందుగా అమెరికా ఆధిపత్యానికి అడ్డుగోడ పడుతుంది. అగ్రరాజ్యమనే పేరుకు నూకలు చెల్లడం ప్రారంభమవుతుంది.

ఆఫ్ఘన్ ల స్వేచ్ఛకు చెల్లుచీటీ

ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు సుమారు 20 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్న ప్రజాస్వామ్యానికి,స్వేచ్ఛకు కాలం చెల్లుతుంది.మళ్ళీ తాలిబన్ల ఏలుబడిలోకి ఆ దేశం వెళ్ళిపోతుంది. ఆ దేశ వాసులకు తీవ్రమైన కష్టకాలం ఆరంభమవుతుంది. పాకిస్తాన్ రెట్టింపు ఉత్సాహంతో భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతుంది.కశ్మీర్ లో అలజడులు, అల్లకల్లోలాలు పెద్ద ఎత్తున మొదలవుతాయి. ఉగ్రవాదంపై భారతదేశం మరింతగా పోరాడాల్సి వస్తుంది.ఈ పోరులో భారత్ వంటరైపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు.వీటన్నిటికీ కారణం తాలిబన్ల రాజ్యం మళ్ళీ ఆఫ్ఘనిస్థాన్ లో ఏర్పడే పరిస్థితులను అమెరికా పరోక్షంగా కల్పించడం.

బైడెన్ తాజా నిర్ణయం

ఈ పరిస్థితులకు కారణం జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయం, పాకిస్తాన్ ఎన్నో ఏళ్ళుగా ఆడుతున్న డబుల్ గేమ్ విధానం. తాలిబన్ల బలం ఎంత పెరిగితే, పాకిస్థాన్ బలం అంత పెరుగుతుంది. మిగిలిన దేశాలకు ఎలా ఉన్నా, భారత్ కు ఈ పరిణామం కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయం.నాటో జోక్యంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అమెరికా  20ఏళ్ళనుంచి సహకారం అందిస్తోంది. అక్కడ సైనికులను  మోహరించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది.వేలాదిమంది  సైనికులను కోల్పోయింది. ఇంకా ఆఫ్ఘన్ లో సైనికులను ఉంచడం వల్ల లాభమేంటి? ఎన్నాళ్ళు ఈ ఖర్చును భరిస్తాం, ఎంతమంది సైనికులను కోల్పోతాం, అని అమెరికా ఎప్పటి నుంచో లెక్కలు వేస్తూనే ఉంది. ఎట్టకేలకు, ఇప్పటికి జో బైడెన్ ముగింపు పలికారు.ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అండదండలను విరమించుకుంటూ అమెరికా చేతులెత్తేసింది.

తాలిబాన్ చేతికి మళ్ళీ పగ్గాలు

పరోక్షంగా, తాలిబాన్ల రాజ్యం ఏర్పడడానికి ద్వారాలు తెరిచినట్లయింది. తనకు భవిష్యత్తులో తాలిబన్లతో ఇబ్బందులు ఎదురైతే, పాకిస్తాన్ సహకారాన్ని అమెరికా తప్పక తీసుకుంటుంది. డబుల్ గేమ్ అడే పాకిస్థాన్ ఎలాగూ ఆ సహకారాన్ని అందిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఈ అక్రమ సంబంధం ఎప్పటి నుంచో నడుస్తోంది.గతంలో,రష్యా కూడా అమెరికా లాగానే, 1978 నుంచి 1992 వరకూ, సుమారు పుష్కరం పైగా, ఆఫ్ఘన్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఏలుబడికి సహకారాన్ని అందించింది.వామపక్ష ప్రభుత్వానికి అండగా,లక్షమంది సైన్యాన్ని దింపింది.కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. వేలాదిమంది సైనికులను నష్టపోయింది.విసిగి వేసారి, చివరకు సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఆఫ్ఘన్ లో రష్యా (యూ ఎస్ ఎస్ ఆర్ ) అధిపత్యానికి గండి గొట్టడానికి అమెరికాకు పాకిస్తాన్ బాగా సహకారాన్ని అందించింది. పాకిస్తాన్ సహకారంతో, ఆఫ్ఘన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ముజాహిదీన్ బలగాలకు, అమెరికా ఎంతో సహాయం చేసింది.

అమెరికా పెంచిపోషించిన తాలిబాన్

ఆ విధంగా,ఉగ్రవాద గ్రూపులను అమెరికా పెంచి పోషించింది.2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా నగరాలపై జరిగిన ఉగ్రవాదుల దాడులు జరిగాయి.దానితో, అల్ – కైదా ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను అంతం చేయడానికి “ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్”  అనే పేరుతో అమెరికా పెద్ద ఎత్తున మిలిటరీ చర్యలను చేపట్టింది. ఒసామా బిన్ లాడెన్ ను తమకు అప్పగించకపోతే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని బెదిరించింది. పెద్ద ఎత్తున సైన్యాన్ని దింపింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది.ఆఫ్ఘన్ ముజాహిదిన్ నాయకులు, ఆమెరికా సైనికులు కలిసి చేసిన యుద్ధం ఫలితంగా ఆఫ్ఘన్ లో, 2002లో హమీద్ కర్జాయి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.2004లో  “ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ ఆఫ్ఘనిస్థాన్” గా,కర్జాయి అధ్యక్షుడుగా శాశ్వత ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికీ అదే ప్రభుత్వం కొనసాగుతోంది. 2001 సెప్టెంబర్ ఉగ్రవాదుల దాడులకు ప్రతిగా, బిన్ లాడెన్ ను అమెరికా అంతం చేసింది.

విభిన్న రూపాలలో విస్తరించిన ఉగ్రవాదం

అల్ కైదా చిన్నాభిన్నమైంది. కానీ, పూర్తిగా అంతమవ్వలేదు. అంతమవ్వక పోగా, ఉగ్రవాదం విభిన్న గ్రూపులుగా మరింత పెరిగింది. అల్ కైదా ప్రభావం ఇంకా మిగిలే వుందని అమెరికా గుర్తించాలి. ఈ విషయం పాకిస్తాన్ కు కూడా తెలుసు. తెలిసినా, పాకిస్తాన్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. ఈ 20ఏళ్లలో తాలిబాన్లు తమ బలాన్ని బాగా పెంచుకున్నారు. వీరికి పాకిస్తాన్ అండదండలు పూర్తిగా ఉన్నాయి. ఉగ్రవాదుల సహకారంతో, కశ్మీర్ అంశంలో భారతదేశాన్ని మరింత ఇబ్బందులకు గురిచెయ్యాలని పాకిస్తాన్ చూస్తోంది. ఈ విషయం తెలిసినప్పటికీ పాకిస్తాన్ తో ఉండే అవసరాల దృష్ట్యా,అమెరికా కూడా మౌనం వహిస్తోంది.ఆఫ్ఘన్ నుంచి సైనిక దళాల ఉపసంహరణ వల్ల, అమెరికాకు లభించే ఊరట కేవలం తాత్కాలికమైంది. సమీప భవిష్యత్తులో,ప్రపంచంలో ఇస్లామిక్ ఉగ్రవాదం ఇంకా ఎన్నో రెట్లు పెరిగే పరిస్థితులు వస్తాయని పరిశీలకులు శంకిస్తున్నారు.

భారత్ మరింత రాటు దేలాలి

దీని వల్ల అమెరికాకు కూడా ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం,ఆఫ్ఘనిస్థాన్ లో మొదలయ్యే అశాంతి భారతదేశంతోనే ఆగిపోదు.మిగిలిన దేశాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతోంది. అమెరికా – పాకిస్తాన్ ఆడే డబుల్ గేమ్ కు భారత్ కు ఇబ్బందులు పెరగడం విషాదం.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాలన్నీ కలిసి పోరాడాల్సిన సమయంలో, తాత్కాలిక స్వార్థం కోసం, ప్రపంచ అశాంతికి ఇటువంటి పరిణామాలు ద్వారాలు తెరుస్తున్నాయి.తాలిబన్లను, ఉగ్రవాదులను,పాకిస్తాన్ ను ఎదుర్కోడానికి భారతదేశం మరింతగా రాటు తేలాల్సిన తరుణం వచ్చిందని భావించాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles