Saturday, November 23, 2024

క్యూబాలో కొత్త శకం

రౌల్ కాస్ట్రో

మార్క్సిస్ట్, లెనినిస్ట్, సోషలిస్ట్ రాజ్యంగా మిగిలివున్న అతి కొన్ని దేశాలలో క్యూబా ఒకటి. ఈ కమ్యూనిస్ట్ దేశం 6 దశాబ్దాల పైనుంచి క్యాస్ట్రోల పాలనలో ఉంది. మరికొన్ని రోజులలో ఆ శకం ముగియనుంది. కొత్త శకం ఆరంభం కానుంది. ఫెడెల్ క్యాస్ట్రో ప్రపంచ రాజకీయాలలో సుప్రసిద్ధుడు. ఆయన తర్వాత తమ్ముడు రౌల్ క్యాస్ట్రో అధికారంలోకి వచ్చారు.

రౌల్ క్యాస్ట్రో రాజీనామా

క్యూబా కమ్యూనిస్ట్ పార్టీలో అత్యున్నత స్థానమైన ప్రథమ కార్యదర్శ పదవికి రాజీనామా చేయనున్నట్లు రౌల్ క్యాస్ట్రో ప్రకటించారు. క్యూబాలో అధ్యక్షుడు కన్నా, కమ్యూనిస్ట్ పార్టీ ప్రథమ కార్యదర్శికే అధికారాలు ఎక్కువగా ఉంటాయి. రౌల్ ఆ పగ్గాలను వదిలివేస్తున్న క్రమంలో అధికారమార్పిడి జరుగనుంది. ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు మిగుయల్ డియాన్ కానెల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అధికారికంగా వారసుడి పేరును ఇంకా ప్రకటించకపోయినప్పటికీ డియాన్ కానెల్ నూతన తరానికి ప్రతినిధి అని రౌల్ గతంలో అనేకసార్లు చెప్పారు.

కొత్త శకానికి శ్రీకారం

మొత్తంమీద క్యాస్ట్రో శకం ముగిసి  కొత్త శకం మొదలు కానుంది. ఈ సందర్భంగా క్యాస్ట్రో శకాన్ని ఒకసారి తలచుకుందాం. క్యూబా కూడా అనేక దేశాల వలె, అనేక ఆక్రమణలకు,యుద్ధాలకు, పోరాటాలకు,అణచివేతలకు, సంస్కృతులకు నెలవైన భూమి. అది సుదీర్ఘమైన చరిత్ర. దాన్ని అలా ఉంచగా, గత ఆరు పదుల కాలం పైనుంచీ, క్యూబా అంటే ఫెడెల్ క్యాస్ట్రో, ఫెడెల్ క్యాస్ట్రో అంటే క్యూబా. అంతటి అనుబంధం అది. ప్రస్తుతం రౌల్ క్యాస్ట్రో ప్రథమ పదవిలో ఉన్నప్పటికీ, ఫెడెల్ క్యాస్ట్రో స్థానం అద్వితీయమైంది. ఆయన పేరెన్నిక కన్న రాజకీయ నాయకుడు, విప్లవకారుడు. 1959 నుంచి 2008 వరకూ క్యూబాను పరిపాలించాడు. సాయుధ పోరాటం చేసి,  క్యూబా నియంత బాటిస్టాను అధికారం నుంచి దించేశాడు. పశ్చిమార్ధ భూగోళంలోనే, మొట్టమొదటి సామ్యవాద దేశాన్ని ఫెడెల్ క్యాస్ట్రో ఏర్పరచాడు.

అమెరికాకు బద్ధవ్యతిరేకి

ఆయన అమెరికాకు బద్ధ వ్యతిరేకంగా వ్యవహరించాడు.అతన్ని అంతం చేయడానికి అమెరికా అనంత విధాలుగా ప్రయత్నం చేసింది. కానీ, విఫలమైంది. క్యూబా అభివృద్ధిలో, విస్తరణలో అనేక దేశాల భాగస్వామ్యం ఉంది.అందులో కొందరి పెత్తనం కూడా చాలాకాలం సాగింది. ఫెడెల్ అధికారంలోకి రాగానే ముందుగా వారి పెత్తనాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేశారు. అందులో ప్రథమం అమెరికా. మిగిలిన విదేశీయులు, స్వదేశీయుల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్య వల్ల ముఖ్యంగా అమెరికాతో దౌత్య, వ్యాపార సంబంధాలన్నీ దెబ్బతిన్నాయి.

సోవియెట్ యూనియన్ తో వ్యూహాత్మకమైత్రి

ఆ క్రమంలో, వ్యూహాత్మకంగా, సోవియట్ యూనియన్ కు దగ్గరై, వారి సహాయ, సహకారాలను పొంది, క్యూబా అభివృద్ధికి, పటిష్ఠ పాలనకు క్యాస్ట్రో పునాదులు వేశారు. అమెరికా – రష్యా (సోవియట్ యూనియన్ ) ఆధిపత్య పోరులో భాగంగా, క్యూబా ప్రభుత్వానికి రష్యా ఆర్ధిక, సైనిక సహాయాలను పెద్దఎత్తున అందజేసింది. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికా మొదలైన దేశాలలోని విప్లవోద్యమాలకు క్యాస్ట్రో ప్రభుత్వం విరివిగా సహకారాన్ని అందించింది. అలీనోద్యమ నేతగానూ ఫెడెల్ క్యాస్ట్రో పేరుకెక్కారు.1991 లో సోవియట్ యూనియన్ పతనమైనా,  సామ్యవాద పంథాకే క్యాస్ట్రో అంకితమై క్యూబాను నడిపారు. అతని పాలనలో విద్య, ఆరోగ్యం బాగా అభివృద్ధి చెందింది.

మానవాభివృద్దిలో ముందంజ

మానవాభివృద్ధి కలిగిన దేశాలలోనూ క్యూబా ఉన్నత స్థానంలో నిలిచివుంది.రష్యా తర్వాత, చైనా కూడా క్యూబాతో నిలిచింది. చైనా ఆయిల్ ను సరఫరా చేస్తోంది. వెనుజులా కూడా అండగా ఉంటోంది. సోషలిస్ట్ విధానాలకు కట్టుబడిన క్యూబాలో ప్రభుత్వమే ఆర్ధిక రంగాన్ని ప్రధానంగా నియంత్రిస్తోంది.1981 తో పోల్చుకుంటే తదనంతర కాలంలో, ప్రైవేట్ రంగం విస్తరణ బాగా పెరిగింది. అయినప్పటికీ, ఇప్పటికీ ప్రభుత్వ రంగానిదే పైచేయిగా ఉంది.పర్యాటక రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది.

పదవి నుంచి దిగిపోయిన ఫెడెల్

క్యూబాను 50 ఏళ్ళ పాటు పాలించి, పాలనలో తన ముద్ర వేసుకున్న ఫెడెల్ క్యాస్ట్రో 2008లో పదవి నుంచి దిగిపోయి తమ్ముడు రౌల్ క్యాస్ట్రో కు బాధ్యతలను అప్పగించి, వారసత్వాన్ని చాటిచెప్పారు.2016లో ఫెడెల్ మరణించారు. 2008 నుంచి రౌల్ క్యాస్ట్రో పరిపాలనలో క్యూబా నడుస్తోంది. రౌల్ క్యాస్ట్రో కూడా విప్లవ వీరుడే. ఉద్యమ కాలంలో గెరిల్లా కమాండర్ గా వ్యవహరించారు. అన్నకు కుడి భుజంగా ఉన్న రౌల్ నూటికి నూరు శాతం సామ్యవాది. రౌల్ తన పాలనలో సంస్కరణలు చేపట్టారు. సంస్కరణల ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. 2008లో రౌల్ తన పాలన ప్రారంభంలోనే మొదలు పెట్టిన సంస్కరణలలో వ్యవసాయ రంగం కూడా ముఖ్యమైంది.

వ్యవసాయరంగంలో సంస్కరణలు

నాణ్యమైన ఆహార ఉత్పత్తి లక్ష్యంగా వ్యవసాయ రాగంలో ఆరంభమైన సంస్కరణలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. వ్యవసాయ క్షేత్రాల విస్తరణ, ఉత్పత్తి ఆధునీకరణ మొదలైనవి ప్రధానమైన పరిణామాలు.రెండు కరెన్సీల విధానం 2016లో తొలగిపోయింది. ప్రస్తుతం ఒకటే కరెన్సీ (పెసో ) చెల్లుబాటులో ఉంది. 85% ప్రజలకు గృహ వసతి ఉండడం కూడా విశేషమైన ప్రగతి. అక్షరాస్యతలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. అన్ని విభాగాల్లోనూ 99 శాతం అక్షరాస్యత సాధించి క్యూబా ఆదర్శంగా నిలుస్తోంది. స్పెయిన్ దేశం నుంచి వలస వచ్చి, క్యూబా స్వతంత్ర్యతలో,అభివృద్ధిలో, పరిపాలనలో, సంస్కరణలో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న క్యాస్ట్రో శకం మరికొద్ది కాలంలోనే ముగియనుంది.

రౌల్ స్థానంలో డియాన్ కానెల్?

త్వరలో క్యాస్ట్రో స్థానంలోకి రాబోతున్న డియాన్ కానెల్ ప్రస్తుత దేశాధ్యక్షుడు. వీరి కుటుంబం కూడా ఎప్పటి నుంచో క్యూబా చరిత్రలో భాగస్వామ్యమై, కీర్తి తెచ్చుకున్నదే. కానెల్ ముత్తాత రామన్ కానెల్ కూడా చరిత్ర ప్రసిద్ధుడే. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ‘క్యూబా కమ్యూనిస్ట్’ పార్టీతో డియాన్ కానెల్ కొనసాగుతున్నారు.క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే ఉంది. వేరే పార్టీలు ఏమీ లేవు.కొత్త తరంతో, సరికొత్త సారథ్యంలో క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ, దేశ పాలన ఎలా ఉండబోతాయో కాలమే చెబుతుంది.90-ఏళ్ళ రౌల్ క్యాస్ట్రో ఇప్పటికీ చాలా చురుకుగా ఉన్నారు.దేశం కోసం, సామ్యవాదం కోసం తన  కృషి మునుపటి కంటే మిన్నగానే  సాగుతుందని చెబుతున్న రౌల్ క్యాస్ట్రో నైతికబలం, ఆత్మబలం ఎంతో ఆదర్శప్రాయం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles