తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. కాకపోతే, లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ కూడా కరోనాబారిన పడ్డారు. జనసేన నేత పవన్ కల్యాణ్ చికిత్స తీసుకుంటున్నారు. దిల్లీలో ఆరు రోజులపాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
యథావిధిగా ఎన్నికల ర్యాలీలూ, వివాహాలూ
ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల్లో రద్దీ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోవడంపై న్యాయస్థానాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. లాక్ డౌన్ విధించే పరిస్థితులు రాకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా ఉధృతి పెరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత, ప్రధాని సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ల కొరత, రెమ్ డిసివర్ మెడిసిన్ కొరతపై అనేక రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఇప్పటికే పలు వినతులు వెళ్లాయి.
నానా అవస్థలు పడుతున్న రోగులు
అస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకక రోగులు నానా అవస్థలుపడుతున్నారు. అదను కోసం వేచి చూసే ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను దోచేస్తున్నాయి. ప్రధాని సమావేశం సందర్భంగా ఈ అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని, ఆక్సిజన్ సరఫరా చేసే ట్యాంకర్ల రవాణాకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. గత సమావేశంలో చెప్పినట్లుగానే, టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్, వ్యాక్సినేషన్ ప్రక్రియలను మరింత వేగవంతం చెయ్యాలని ఆయన సూచించారు.గడచిన 24 గంటల్లో 2లక్షల 73వేల కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇది రికార్డు.1600మంది మరణించారు కూడా.లాక్ డౌన్ సడలించిన కాలం నుంచి ప్రజలు విచ్చలవిడిగా తిరిగిన ఫలితమే ఈ ఉధృతి.వ్యాక్సినేషన్ ఉత్పత్తి, పంపిణీ కూడా ప్రణాళికా బద్ధంగా జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సినేషన్ సర్వనివారిణి కాకపోయినా, వైరస్ సోకడం వల్ల వచ్చే ఇబ్బందులను, మరణాల ఉధృతిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.కొంత మేరకైనా ఉపశమనాన్ని ఇచ్చే వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఇప్పటికైనా దృష్టి పెంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఉధృతి చూస్తుంటే, భయానకంగానే ఉంది.
భయం కాదు, జాగ్రత్త అవసరం
కేవలం భయపడి ఒత్తిడి తెచ్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సమగ్ర కార్యాచరణకు పూనుకోవడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. త్వరలో, “ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్” ను నడపనున్నట్లు రైల్వే శాఖ ఆదివారం నాడు తెలిపింది. ఇది మంచి అడుగే. దీనిద్వారా, మెడికల్ ఆక్సిజన్ ఎక్కడ అవసరమైతే అక్కడికి సరఫరా చేయడానికి మార్గం సుగమమవుతుంది. ఇది ఇలా ఉండగా, కరోనా చికిత్సలో కీలకమైన రెమ్ డెసివిర్ ఎగుమతులను కేంద్రం నిషేధించింది. ఈ నిషేధం అమలులో ఉండగానే, దొంగ మార్గాల్లో విదేశాలకు తరలిస్తున్నారని, మన దేశంలో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, అధిక ధరలకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారనే వార్తలు కలవరపెడుతున్నాయి.
రెండో అతి పెద్ద జనాభా
139 కోట్ల పైగా జనాభాతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో వున్న భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో వేగం పెరిగితే, అరికట్టడం ఆషామాషీ కాదు. అత్యధిక జనాభా కలిగి, కరోనా వైరస్ కు జన్మక్షేత్రమైన చైనాలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, దేశ అభివృద్ధి మళ్ళీ వేగవంతమైందనే వార్తలు వస్తున్నాయి. కరోనాను అరికట్టడంలోనూ, అభివృద్ధిని అందుకోవడంలోనూ వారు ఏఏ మార్గాలను ఎంచుకున్నారో, తెలుసుకొని,వాటిని మనం కూడా ఆచరించడం ముఖ్యమైన చర్య. మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విజృంభణ ఎక్కువగా ఉంది. గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కూడా సున్నితమైన రాష్ట్రాలు.
యువత, నడివయస్సువారికి ప్రమాదమే
సెకండ్ వేవ్ లో యువత, మధ్యవయస్సువారికి కూడా సోకడం ఒక అంశమైతే, శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా ఉధృతి పెరుగుతున్న ఈ సమయంలో, చాలా రాష్ట్రాల్లో,సంపూర్ణమైన లాక్ డౌన్ కాకపోయినా, రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్ డోన్ అమలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.ఇప్పటికే అనేక రంగాలు కుదేలయ్యాయి. మళ్ళీ లాక్ డౌన్ అమలులోకి వస్తే, పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని అంచనా వేయవచ్చు. బతుకు – బతుకుతెరువు మధ్య మళ్ళీ పోరుకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితులు రావడం దురదృష్టకరం. త్వరలో, అన్నింటినీ అధిగామించాలని ఆకాంక్షిద్దాం.