Thursday, November 21, 2024

వైఎస్ ఆర్ టీపీ ఆవిర్భావం

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వం తెలంగాణలోనూ సుస్థాపన దిశగా గమనం ఆరంభమైంది. తద్వారా, రెండు తెలుగు రాష్ట్రాల్లో వై ఎస్ స్మృతి కేతనాల రెపరెపలు మొదలయ్యాయి. తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జయకేతనం ఎగురవేశారు. తనయ షర్మిల ఆ  దిశగా అడుగులు మొదలు పెట్టారు.”వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ” గా నామకరణం చేసి, ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.

Also read: మంత్రమండలి విస్తరణ ఎన్నికల కోసమే!

ధీరవనిత

తండ్రి పుట్టినరోజు నాడే పార్టీని ఆరంభించి, వైఎస్ అభిమానుల హృదయాలను చూరగొట్టే సెంటిమెంట్ వ్యూహాన్ని ఎంచుకున్నారు. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న ఒక యువ మహిళా నాయకురాలు ఇలా సొంతంగా పార్టీని స్థాపించడం తెలుగునాట ఇదే మొట్ట మొదటి సన్నివేశం. గతంలో ఒకరిద్దరు మహిళలు స్థాపించినా, ఇంతటి బలగం ఉన్ననేతలు కారు. పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయినవారే. రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ రంగంలోకి దిగిన షర్మిలను ధీరవనితగా అభివర్ణించాలి. గతంలో జగనన్నకు నీడగా పాదయాత్ర చేశారు,గళం విప్పి తోడుగా నిలిచారు. నేడు అన్నను వీడి సొంతకాళ్ళపై నిలబడడానికి ‘రాజన్న’బాట పట్టారు. పార్టీని ఈరోజు స్థాపించినప్పటికీ, గత కొన్ని నెలల నుంచే అధికార టీ ఆర్ ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని, విమర్శనా బాణాలు గుప్పిస్తూ తన వైఖరిని తేటతెల్లం చేస్తూ వచ్చారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని ఇంతకు మునుపే  స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లోనే రానున్నాయి. దానికి  రెండు సంవత్సరాల సమయం ఉంది. ఈలోపు పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ‘పాదయాత్ర’ వ్యూహాన్ని ఎంచుకున్నారు. అది విజయ యాత్రగా మారాలన్నది ఆమె సంకల్పం.

షర్మిల తల్లి విజయమ్మతో…

ఏమిటి ఆమె బలం, బలగం?

అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతగా చరిత్ర సృష్టించిన వై ఎస్ రాజశేఖరరెడ్డి అభిమానగణం ఆమెకు తొలిబలం. తన సామాజిక వర్గం మరో బలం. ఆర్ధిక పరిపుష్టి ఇంకో బలం. భర్త అనిల్ కుమార్ కు క్రిష్టియన్ వర్గాల్లో కొంత ఆకర్షణ ఉంది. అది కూడా కలిసొచ్చే అంశం. దీనికి మించి వై ఎస్ ను  అభిమానించే వారిలో క్రిష్టియన్లు,దళితులు, ముస్లింలు ఎక్కువగానే ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువమంది బ్రాహ్మణులు వై ఎస్ అభిమానులే.కానీ,వారి వైఖరి తెలంగాణలో భిన్నంగా ఉంటుంది. రెడ్లు,దళితులు, క్రిష్టియన్లు,ముస్లింలు ప్రధానంగా వై ఎస్ అభిమానులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అభిమానించే వాళ్లందరూ వైఎస్ కు కూడా అభిమానులే. రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో  తెలంగాణలో కాంగ్రెస్ అభిమానుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. పార్టీ కూడా దెబ్బతిన్నది. తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైపోయింది. బలమైన తెలంగాణ సెంటిమెంట్ తో టీ ఆర్ ఎస్ పార్టీ అగ్రస్థానంలో రెపరెపలాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. గతంలో కంటే బిజెపి బలం కూడా పెరిగింది. చతికిలబడిన కాంగ్రెస్ ను పైకి లేపడానికి రేవంత్ రెడ్డి వంటి ఫైర్ బ్రాండ్ కు అధిష్టానం తాజాగా పగ్గాలు అప్పజెప్పింది. తెలంగాణలో నేడు ఫైర్ బ్రాండ్ల సంఖ్య పెరిగింది. బిజెపిలో సంజయ్, కాంగ్రెస్ లో రేవంత్ ఫైర్ బ్రాండ్లుగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. బిజెపిలోకి ఈ మధ్యనే ఈటెల రాజేందర్ కూడా చేరారు. ఆయన కూడా మాటల ఈటెలు బాగానే వేస్తారు. షర్మిలమ్మ కూడా ఫైర్ బ్రాండ్ గానే కనిపిస్తున్నారు.

ప్రసంగిస్తున్న విజయమ్మ

ఎటు చూస్తే అటు ఫైర్ బ్రాండ్

 అధికార టీ ఆర్ ఎస్ పార్టీలో కె సి ఆర్, కె టి ఆర్ మొదలు చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. ఇందరు ఫైర్ బ్రాండ్ల మధ్య షర్నిల తన బ్రాండ్ ను ఎట్లా ఉన్నత స్థానంలో నిలబెడతారో చూడాలి. తెలంగాణలోని ముస్లిం వర్గం ప్రస్తుతానికి టీ ఆర్ ఎస్ కు అనుకూలంగానే ఉంది. ఏడేళ్ల నుంచి అధికారంలో ఉన్న టీ ఆర్ ఎస్ కు సహజంగానే అసమ్మతులు కూడా బాగానే ఉంటాయి. వాళ్ళల్లో కొందరు వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీలోకి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ ఆర్ ఎస్ తర్వాత బలంగా ఉన్న రెండవ పార్టీ బిజెపి. కాంగ్రెస్ ఇంకా బలహీనంగానే ఉంది. బిజెపి ఇంకా బలపడాల్సి వుంది. వీటన్నిటిని బేరీజు వేసుకొని,రాజకీయ శూన్యత ఉందని భావించి షర్మిల తెలంగాణను కార్యక్షేత్రంగా ఎంచుకొని పార్టీని స్థాపించారు.

Also read: విశాఖ ఉక్కు దక్కదా?

సరైన సమయంలో సరైన నిర్ణయం

ఆమె సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. పార్టీని సంస్థాగతంగా క్షేత్ర స్థాయి నుంచి నిర్మాణం చేసుకొని, అభివృద్ధి చేయడం ఆమె ముందున్న పెద్ద సవాల్. షర్మిల దంపతుల మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. పుట్టి పెరగడం హైదరాబాద్ లో సాగిన నేపథ్యంలో తెలంగాణను తమ గడ్డగా ఆమె అభివర్ణిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మేరకు దానిని స్వాగతిస్తారన్నది ఎన్నికల ముందు తలపెట్టిన పాదయాత్ర సమయంలోనే కొంత తేలిపోతుంది. వెనుకబడిన వర్గాలను ఆకర్షించడం కొత్త పార్టీకి అత్యంత కీలకం. సుదీర్ఘకాలం పాలనలో ఉన్న అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత, పార్టీలో అంతర్గతంగా ఉండే వైషమ్యాలు, వై ఎస్ అభిమానగణం,బలమైన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడం తమకు కలిసి వచ్చే అంశాలుగా ఆమె భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమం….పార్టీ ప్రధాన సిద్ధాంతాలుగా రూపకల్పన చేశారు.ప్రధానంగా అధికార పార్టీని ఎండగడుతూ, రాజన్న సెంటిమెంట్ ను రాజిల్ల జేస్తూ ముందుకు దుమకాలనే కృతనిశ్చయం,అత్యంత ఆత్మవిశ్వాసంలో షర్మిల ఉన్నారు.పార్టీ గెలుపుఓటములపై ఇప్పుడే సంపూర్ణమైన భాష్యం చెప్పడం భావ్యం కాదు. ఈరోజు జరిగింది నామకరణ మహోత్సవం మాత్రమే. కాకపోతే అన్నప్రాసన ముందే జరిగింది. రేపటి ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టేంత బలం సంగతి ఎట్లా ఉన్నా, కొన్ని ఓట్లు,కొన్ని సీట్లను చీల్చడంలో వై ఎస్ ఆర్ టీ పీ కొంతమేరకు విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. రాజన్న రాజ్యం స్థాపన అన్నది కాలంలోనే తెలుతుంది.

Also read: భారత్ మెడకు తాలిబాన్ ఉచ్చు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles