వోలేటి దివాకర్
ఒకే పార్టీలోని నాయకులు రాజకీయ ప్రత్యర్థిపై పోరాటం చేయాలి. కాని రాజమహేంద్రవరంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒకే పార్టీలోని ఇద్దరు నేతలు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఫెవికాల్ తో అంటించినా వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపి మార్గాని భరత్ రామ్ కలిసి పనిచేసే అవకాశాలే కనిపించడం లేదు. ఈ ఇద్దరు నాయకులు ఈ మధ్యకాలంలో ఒకే వేదికపై కనిపించిన దాఖలాలే లేవు. పైపెచ్చు ఎపి పేపరుమిల్లు వేదికగా వారి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
Also read: రామోజీరావుకు భారతరత్న అయినా ఇవ్వండి లేదా … మార్గదర్శిలో తేడాలు తేల్చండి!
పేపరుమిల్లు వద్ద ఎంపి మార్గాని భరత్ తాను పార్టీలో చేర్చుకున్న కమ్యూనిస్టు వారసుడు ప్రవీణ్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనగా , ఆ సభకు పోటీగా మరునాడు వివిధ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన మరో సభలో ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం , జక్కంపూడి రాజా తల్లి , వై ఎస్సార్ సిపి సిజిసి సభ్యురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొనడం గమనార్హం. దీన్ని బట్టి ఎంపి భరత్ , రాజా పార్టీలో చెరోగట్టున ఉన్నట్లు స్పష్టమవుతోంది. అనివార్యంగా వారి కేడర్ కూడా చెరో దిక్కునకు చేరింది. ఇరువర్గాలు ఒకే పార్టీలో విరోధంగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది.
Also read: సత్యం రామలింగరాజుకో న్యాయం … రామోజీరావుకో న్యాయమా?!
జిల్లాల పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు రాజా అధ్యక్షుడిగా నియమితులయ్యారు . ఆ వెంటనే ఆయన స్వయంగా పార్టీలోని ప్రత్యర్థి భరత్ వద్దకు వెళ్లి చేతులు కలిపారు. ఇకపై ఇద్దరం పార్టీ కోసం కలిసి పనిచేస్తామనీ, నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషిచేస్తామనీ ప్రకటించారు. ఈ పరిణామాలు పార్టీలోని కార్యకర్తలకు సంతోషాన్ని కలిగించాయి. అయితే, మళ్లీ ఏమైందో ఎంపి, రాజా విరోధులుగా మారిపోయారు. పేపరు మిల్లు కార్మిక నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, ఫైనాన్స్ వ్యాపారి ఇన్నమూరి ప్రదీప్, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎన్వి శ్రీనివాస్ ఇటీవల భరత్ సమక్షంలో వైసిపిలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా రాజా ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ చౌదరి, ప్రదీప్ ల చేరిక రాజాకు ఇష్టం లేదన్నది పార్టీ వర్గాల సమాచారం. పేపరు మిల్లులో ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ చౌదరిపై రాజా కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మరోవై పు ప్రవీణ్ చౌదరి రాజకీయ గురువు, టిడిపి నాయకుడు గన్ని కృష్ణ కూడా ప్రవీణ్ చౌదరిపై ఫిర్యాదు చేయడం విశేషం. ఈవ్యవహారాలతో ప్రస్తుతం కార్మికులు బాధితులు మారారు.
Also read: పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?
రాజమహేంద్రవరం లాంటి నియోజకవర్గానికి కోఆర్డినేటర్ ను కూడా నియమించలేని పరిస్థితుల్లోకి పార్టీని నెట్టిన నేపథ్యంలో భరత్ అనధికార కోఆర్డినేటర్ గా పెత్తనం సాగిస్తున్నారు. రాజమహేంద్రవరంపై రాజకీయ ఆధిపత్యమే నాయకుల మధ్య విరోధాలకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీలో అంతర్గత కుమ్ములాబలను అడ్డుకోకపోతే అధికార పార్టీకి రాజమహేంద్రవరంలో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకమే.
Also read: పాదయాత్ర కలిపింది ఆ ఇద్దరినీ!