- ఎస్ఈసీపై నిప్పులు చెరుగుతున్న వైసీపీ నేతలు
- నిమ్మగడ్డకు పిచ్చిముదిరందన్న అంబటి
- చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం మధ్యనే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.
నిమ్మగడ్డపై మండిపడ్డ సజ్జల :
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజకీయ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన పరిథి దాటి లేని అధికారాలను ఉపయోగించి తమను తప్పించాలని చూస్తున్నారని ఆక్షేపించారు. నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎస్ఈసీ స్థానంలో ఉన్న నిమ్మగడ్డ విచక్షణతో వ్యవహరించాలని సజ్జల సూచించారు.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం, ఎన్నికల సంఘం “ఢీ” అంటే “ఢీ”
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్:
ఎంపీ విజయసాయిరెడ్డిపై నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేయడంపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిమ్మగడ్డ చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అధికారులపై, మంత్రులపై చర్యలు తీసుకుంటున్న నిమగడ్డ మెనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
అంబటి షాకింగ్ కామెంట్స్:
ఇదీ చదవండి: పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తున్న ఎన్నికలు
ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారశైలిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో చంద్రబాబుని నియమించాలని గవర్నర్ కి లేఖ రాసినా అశ్చర్యపోనక్కరలేదని అన్నారు. నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిందని అంబటి చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతోంది.