వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు ప్లీనరీ ఏర్పాటు చేసుకుంది. గడిచిన పన్నెండేళ్లుగా జగన్ రోడ్డుమీద నిలబడితే తండోపతండాలుగా జనం చేరడం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నదే. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగిన రెండు రోజుల ప్లీనరీలో అదే దృశ్యం పునరావృతమయింది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, వారి పరివారాలు హాజరై సభను దిగ్విజయం చేశారు. రెండు రోజుల ప్లీనరీ మొదలుకాక ముందే రాష్ట్ర ప్రజలకు ఒక విస్పష్టమైన సంకేతం పంపగా, ప్లీనరీ ముగిసేనాటికి గంపగుత్తగా ప్రతిపక్షాలన్నింటికీ చేరవలసిన సందేశం చేరిపోయింది. రానున్న రెండేళ్లలో చేయగలిగిన యాగీ ప్రణాళికను వారంతా సిద్ధం చేసుకోవలసిందే. మరో టర్మ్ రాజకీయ నిరుద్యోగం గడపడానికి మానసికంగా సిద్ధం కావలసిందే.
Also read: కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు
రెండు శిబిరాల్లోనూ ఒకే ప్రసంగాల తీరు
ప్లీనరీ మొదలుకాకముందు అక్కడ పంది మాంసం వడ్డిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం గాల్లో కొట్టుకుపోయింది. లక్షలాది మంది వైకాపా కార్యకర్తలు ప్రదర్శించిన క్రమశిక్షణ ముచ్చట గొలిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు రోజుల కార్యక్రమాన్ని నడిపించిన నిర్వాహకులు అభినందనీయులు. మూడు జిల్లా కేంద్రాలలో ఆర్టీసీ బస్సులు దొరకక ప్రయాణీకులు ఇబ్బందిపడడం వంటి సంఘటనలు పంటి కింద రాళ్లలాగా తగిలాయి. కొన్ని వారాల కిందటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఏర్పాటుచేసుకున్న మహానాడు ఇంకా ప్రజల కళ్లముందు కదలాడుతుండగానే వైకాపా ప్లీనరీ కొత్త జ్ఞాపకాలను ప్రోదిచేసింది. హంగు ఆర్భాటాల సంగతి పక్కనపెడితే రెండు ప్రధాన రాజకీయ పక్షాల మహాసభలూ దాదాపుగా ఒకే విధంగా జరగడం విషాద వాస్తవం. రాజకీయ అనుభవంలో దేశంలోనే సీనియర్ నేతగా పేరొందిన చంద్రబాబు మహాసభల ప్రసంగాలు ఎలా సాగాయో అచ్చు గుద్దినట్టుగా వైవిధ్యభరితమైన రాజకీయ పాలన అందించాలని అహరహం శ్రమిస్తున్న జగన్ మహాసభల ప్రసంగాలు కూడా అదే మాదిరిగా సాగడం విడ్డూరం. ఆత్మస్తుతి పరనింద తప్ప ప్రజలకు మరే ఇతర సందేశమూ అందలేదు. ఆయా పార్టీల కార్యకర్తలకు ఆ ప్రసంగాలు రుచిస్తాయేమో కాని ప్రజలకు మాత్రం అవి పాచివంటలే.
పాలక పక్షాన్ని దునుమాడడం ప్రతిపక్షానికి ఒక రాజకీయ అవసరం కావచ్చునేమో కాని, ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టీ తన విధివిధానాల పైన, పాలనపైన దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది. అరకొర మెజారిటీతో కనీసం ప్రతిపక్షంగా ఉండాల్సిన అర్హత కూడా కోల్పోయిన తెలుగుదేశాన్ని అదేపనిగా ఆడిపోసుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ కు అలంకారం కాబోదు. ఒక పార్టీ మరో పార్టీని నిరంతరం విమర్శించడం తప్పులేదనుకుందాం. మీడియా మీద అక్కసు ఎందుకని రెండు తెలుగు దినపత్రికలు, రెండు తెలుగు టీవీ చానెళ్లు ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వడం లేదని పదేపదే తెలియజెప్పుతుండడం తమ బలహీనతను ప్రజల ముందు బహిర్గత పరుచుకోవడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. మొదటి రోజు ప్లీనరీలో ఖాళీ కుర్చీల ఫోటోలు వేసి ఆంధ్రజ్యోతి తన క్రెడిబిలిటీని తానే దిగజార్చుకుంది. జరిగింది చెప్పడమే వార్త. ఆ వార్తను తారుమారు చేసి దానికి తన వ్యాఖ్యానాన్ని జోడించి చేసిన వార్తారచనతో ఆ పత్రిక ఇప్పటికే ప్రజలలో చాలా పలుచన అయిన సంగతి అందిరికీ తెలిసిందే. దీనికి విరుగుడుగా ఆ పార్టీ అధినేత సూచించినట్టుగా బూత్ స్థాయిలో సోషల్‌మీడియా శాఖలను బలోపేతం చేసుకోవడం ఒక పరిష్కారం కావచ్చు. అబద్దపు వార్తలను ఖండిస్తూ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు తగినంత నైతిక స్టైర్యం అందించడానికి తోడ్పడుతుంది.
Also read: మనిషి నిజనైజం పోరాడడమే!
మంచి చెడుల మిశ్రమం
ఇక పార్టీ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల విషయానికి వస్తే, గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది. తన ఇద్దరు బిడ్డలమీద తల్లికున్న మమకారం ఈ రాష్ట్రంలో తల్లులను కదిలించింది. కర్తవ్యదీక్షలో భాగంగా తన కూతురికి నైతిక మద్దతు అందించడం కోసం పార్టీ కీలక బాధ్యతలనుంచి వైదొలగుతున్నానని చెప్పిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. తమ కుటుంబాలలో బిడ్డలకు తాము అందించాల్సిన నైతిక భరోసా గురించి ఆమె ఉపన్యాసం అంతర్ముఖులను చేసిందనే చెప్పాలి.
Also read: తప్పు ఎక్కడ జరిగింది!
దీనికి పూర్తి విరుద్ధంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కోర్టులో ఈ నిర్ణయం నిలబడదని తెలిసినా మొండిగా ముందుకెళ్లడమే జగన్ స్టైల్ అని మనకు మనం చెప్పుకోవాలి. అత్యంత ప్రజాస్వామికంగా నిర్ణీత కాలవ్యవధిలో జరగవలసిన పార్టీ సంస్థాగత ఎన్నికలను ఒక్క కలంపోటుతో రద్దుచేసి నియంతృత్వాన్ని నెత్తికెత్తుకునే ఇలాంటి వినూత్న ఆలోచనలు అందించే పార్టీ కోర్ కమిటీకి, అందులోని సభ్యులకు ప్రత్యేకంగా వీరమాలలు వేసుకోవాలి.
ఆకట్టుకున్న ప్రసంగంతో విభిన్నమైన ఇమేజ్
నిత్యమూ నిరంతరమూ అధికారులతో సమీక్షలు చేసుకుంటూ, కేవలం మీట నొక్కుతూ కోట్లాది రూపాయలను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తుండడమూ, అవినీతికి ఆమడ దూరంలో వినూత్న పాలన అందించే ప్రయత్నం చేస్తున్న జగన్ తన రొటీన్ కు భిన్నంగా రెండు రోజులు చాలాసేపు భిన్నమైన హావభావాలతో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. మనసులో గత మూడేళ్లుగా ముసురుకున్న ఆలోచనలను గుదిగుచ్చి విన్నవించుకున్నారు. స్పష్టమైన గమ్యాన్ని ఎంచుకుని, దానికి నిర్దిష్టమైన మార్గాన్ని అందించి, మొత్తం కేడర్ అంతటికీ ఒక దిశానిర్దేశాన్ని అందించారు. రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీకి అధికారపు ఆనవాలు లేకుండా చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ ఆలోచనలో నియంతృత్వపు మర్రివృక్షం మొలకెత్తే విత్తు దాగి ఉందన్న సంగతి ప్రజాస్వామిక వాదులు పసిగట్టాలి.
Also read: మింగమన్నా కోపమే, కక్కమన్నా కోపమే!
తన ఉపన్యాసంలో అభివృద్ధికి సంక్షేమమే మార్గమని విస్పష్టంగా ప్రకటించారు. ధర్మాన ప్రసాదరావులాంటి సీనియర్ మంత్రులు దీనినే ఉద్ఘాటిస్తూ ప్రజా సంక్షేమంలోనే అసలు సిసలు అభివృద్ధి దాగివుందన్న ఆలోచనను పార్టీ క్యాడర్ కు అందించే ప్రయత్నం చేశారు. దీనికి మరింత విస్తృత ప్రచారం కల్పించవలసే ఉంది. కరోనా మహమ్మారి వలన ఆగిపోయిన అభివృద్ధి రథం కదలికను రానున్న రెండేళ్లలో కదపాలి. మరిన్ని ఉద్యోగాల కల్పన చేపట్టగలిగితే న్యూట్రల్ ఓటు వైకాపా వైపు మొగ్గు చూపుతుంది. జగన్మోహనరెడ్డి పాలనలో ఆలోచనలకు ఆచరణకు మధ్య పెద్ద అఖాతం ఉండదని తన వ్యవహార శైలి ఇప్పటికే నిరూపించింది. ఇప్పుడు ప్లీనరీలో తీర్మానించిన ‘సర్వ జన సాధికారత’ వైపు దృఢంగా అడుగులు పడినప్పుడు ఆయన ఆలోచనలకు ప్రజామోదం తప్పక లభిస్తుంది.
Also read: సైన్యం చేసిన హత్యలకు శిక్షల్లేవా?
-దుప్పల రవికుమార్
మొబైల్: 9989265444