ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఖరారు
ఆరు స్థానాలకు జరగనున్న ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కల్యాణచక్రవర్తికి, చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా రఘునాథరెడ్డికి అవకాశం కల్పించారు. వీరితో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇంఛార్జి దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, హిందూపురం వైసీపీ నేత మహ్మద్ ఇక్బాల్, విజయవాడకు చెందిన కరీమున్నీసాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసినట్లు పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఖాళీ కానున్న స్థానాలు:
పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీలలో గుండుమాల తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వీర వెంకన్న చౌదరి, షేక్ మహ్మద్ ఇక్బాల్ ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇదివరకే మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల మరణించడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది.
ఎన్నికల నిర్వహణ:
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో మార్చి 29న ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదీ చదవండి: పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తున్న ఎన్నికలు