వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానాన్ని ఓట్లుగా మలుచుకొని అధికారం చేపట్టేందుకు ఆయన తనయ షర్మిల పార్టీ పెట్టే ప్రయత్నంలో ఆమెకు పలు సవాళ్లు స్వాగతం పలకనున్నట్లు రాజకీయ విశ్లషకులు అంచనావేస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి కేవలం రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లతోనో, అందరూ అనుకుంటున్నట్లు ఓ సామాజిక వర్గానికి చెందిన ఓట్లతోనో అధికారంలోకి రావచ్చు అనుకుంటే రాజకీయాల్లో అంతకంటే తప్పిదం ఇంకోటి ఉండదు. తెలంగాణలోని టీడీపీ, వైసీపీ, కార్యకర్తలు ఇతర పార్టీలలో కలిసిపోయారు ముఖ్యంగా వీరి చేరికలు టీఆర్ఎస్ లో భారీగానే ఉన్నాయి. ఇపుడు షర్మిల పార్టీ పెట్టడంతో ఎంతమంది బయటకు వస్తారనేదానిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడిఉంది.
Also Read: షర్మిలకు తెలంగాణలో బ్రహ్మరథం- కొండా రాఘవ రెడ్డి
మరోవైపు షర్మిల పార్టీపై అప్పుడే తెలంగాణలోని అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు కురిపిస్తున్నాయి. తెలంగాణ సాధించుకుంది తెలంగాణ బిడ్డలే రాజ్యం ఏలాలని అంతేకాని రాజన్న బిడ్డ ఏలేందుకు కాదని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి చురకలంటించారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న జగన్ తో విభేదాలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని అంతేగాని తెలంగాణలో పెడితే పార్టీకి పుట్టగతులు కూడా ఉండవని అన్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యత లేదని ప్రజలు టీఆర్ఎస్ పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని కమలాకర్ స్పష్టం చేశారు. షర్మిల పార్టీ ప్రకటన ముందు రోజు సీఎం కేసీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. పార్టీ నడపడం అంటే పాన్ షాప్ నడిపినట్లు కాదని కేసీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినా కాలగర్భంలో కలిసిపోయాయని కేసీఆర్ గుర్తుచేశారు.
Also Read: కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?
దీంతో షర్మిల పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయవేత్తగా మారితే పలు సవాళ్లను ఎదుర్కోవాల్సిరావచ్చు. ముఖ్యంగా అన్న వైఎస్ జగన్ ను విమర్శించాల్సి రావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వంతో కూడా పోరాడతామని కొండా రాఘవరెడ్డి అన్నారు. ముఖ్యంగా కృష్ణా జలాల పంపకం, పోలవరం ప్రాజెక్టు వ్యవహారాంలో షర్మిల ఎలాంటి వైఖరి అవలంబిస్తారో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ఆంద్రప్రాంత వ్యక్తి అని ముద్ర కూడా వేసే అవకాశం ఉంది.
షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడంతో రాజకీయ సమీకరణలు బాగా మారే అవశాశం ఉంది. టీఆర్ఎస్ కు ప్రభుత్వ వ్యతిరేకత బాగానే కనిపిస్తోంది. దీన్ని అధిగమించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గత శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడంతో టీఆర్ఎస్ కు కలిసివచ్చింది. కాంగ్రెస్ టీడీపీ కలిస్లే మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పాలకుల పెత్తనం వస్తుందని కేసీఆర్ ప్రచారం చేయడంద్వారా ప్రజల్ని నమ్మించగలిగారు. అప్పటికి టీఆర్ఎస్ పై ప్రజల్లో అంత వ్యతిరేకత కూడా లేకపోవడంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. కాని ప్రస్తుతం టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిపోయింది. బీజేపీ బలీయంగా మారడంతో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తామే అధికారం చేపడతామని పూర్తి ధీమాతో ఉంది. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం