- హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం
- తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తి
- పక్కా ప్రణాళికలతో భేటీలు
- కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ వేగిరం
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు ప్రణాళికలకు మాత్రమే పరిమితమైన ఆమె వరుస భేటీలతో తీరికలేకుండా గడుపుతున్నారు. వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో పార్టీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోటస్ పాండ్ లో నల్గొండ అభిమానులతో సమావేశమైన షర్మిల, ఇవాళ (ఫిబ్రవరి 20) హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోని లోటస్‌పాండ్‌లో సుమారు 7వందల మంది వైఎస్ అభిమానులతో భేటీ అయ్యారు. ఇక మార్చి 2న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఇలా ఏప్రిల్ 10 వరకు అన్ని జిల్లాల నాయకులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. చివరిగా ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది.
Also Read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!
అభిమానులతో ముమ్మర భేటీలు :
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పర్యటనలు వాయిదా పడినా నిరుత్సాహపడకుండా జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో మాత్రం వరసగా భేటీలు నిర్వహిస్తూ జోష్ నింపుతున్నారు. ఓ వైపు పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతునే, తెలంగాణలోని వైఎస్‌ఆర్ అభిమానులు, వివిధ సామాజిక వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకున్న తరువాత, పార్టీ ఏర్పాటుకు ఇంకా సమయం ఉంటే చేవెళ్ల నుంచే యాత్రను మొదలు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు, లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళికను జిల్లా నేతలకు ఆమె వివరిస్తున్నట్లు సమాచారం. తనతో కలిసి నడిచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న అభిమానులు, మద్దతుదారుల నుంచి షర్మిల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంబట్టి తెలుస్తోంది.