- ఎన్నికల్లో పోటీపై షర్మిల క్లారిటీ
- ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు
తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం వైఎస్ షర్మిల ముమ్మర ఏర్పాట్లలో ఉన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. మొదటి నుంచి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక అభిమానం చూపుతున్న ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం జిల్లానుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Also Read: షర్మిల చరిష్మా బీజేపీని దెబ్బ తీయడానికేనా?
పాలేరు నుంచి పోటీకి షర్మిల సుముఖత:
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే ఉమ్మడి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, సన్నిహితులతో షర్మిల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసేందుకు షర్మిల ఆసక్తి చూపిస్తున్నారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. తాజాగా జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుందని షర్మిల సన్నిహితులు అంచనావేస్తున్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. ఆయన చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఉపేందర్ రెడ్డి అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.
Also Read: షర్మిల కొత్త పార్టీపై ఏప్రిల్ 9 న ప్రకటన
బహిరంగ సభపై కొవిడ్ ప్రభావం:
మరోవైపు షర్మిల పార్టీ ప్రకటనకు సంబంధించిన బహిరంగ సభకు అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభ నిర్వహణకు అనుమతిపై సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్ 9న షర్మిల ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ లోగా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే.. ఏం చేయాలన్న దానిపై షర్మిల అభిమానులు తర్జనభర్జన పడుతున్నారు.
Good articles