- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం
- ఈ నెల 28 నుంచి సర్వీసులు
- 7 కోట్లతో నైట్ లాండింగ్ సిస్టమ్
- 18 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఫైరింజన్లు
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (మార్చి 25) ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో జ్యోతి వెలిగించిన సీఎం జగన్ ప్రత్యేక తపాలా స్టాంప్ ను ఆవిష్కరించారు. టెర్మినల్ భవంతి సమీపంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విమానాశ్రయం ప్రత్యేకతలు:
ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు ప్రారంభించనుంది. సుమారు వెయ్యి ఎకరాల్లో 153 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్టును నిర్మించినట్లు అధికారులు తెలిపారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ సంవత్సరం జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేశారు. 7 కోట్ల రూపాయలతో నైట్ లాండింగ్ సిస్టమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 కోట్ల రూపాయలతో అమెరికా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు.
Also Read: ఏపీలో మూగ జీవాలకు అంబులెన్స్ సేవలు
గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మూడు భాగాలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి విభాగంలో ప్రతిపాదిత ఆప్రాన్ లో ఎనిమిది విమానాలు నిలిపేందుకు అవకాశం ఉంటుంది. మరమ్మతులకు గురైన విమానాలను పార్కింగ్ చేసేందుకు ఐసోలేషన్ ఆప్రాన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో మూడు విమానాలను పార్కింగ్ చేయవచ్చు భవిష్యత్ లో విమానాల రాకపోకలు పెరిగితే వాటి రద్దీని తట్టుకునేందుకు ప్యూచర్ అప్రాన్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: తిరుపతిలో సెగలు రేపుతున్న ఉపఎన్నిక