Sunday, December 22, 2024

బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో యువతకు ప్రాధాన్యం

నరేంద్రమోదీ, మోహన్ భగవత్

త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రక్షాళనా పర్వానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తాజాగా కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు జరిగాయి. కేంద్ర కేబినెట్ కమిటీల్లోనూ  మార్పులు చేశారు. మంత్రివర్గ విస్తరణ అనూహ్యమైన పంథాలో నడిచింది. పలువురు సీనియర్లను పక్కన పెట్టారు.  వారిని పార్టీ వ్యవహారాల్లో సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న చేపట్టిన మంత్రివర్గ ప్రక్షాళనలో యువతకు ప్రాధాన్యతను పెంచారు. పార్టీలోని అంతర్గత వ్యవహారలపైన ప్రధాని నరేంద్రమోదీ దృష్టి పెంచిన నేపథ్యంలో  మొన్న ఆదివారం నాడు పార్టీ జాతీయ కార్యదర్శులతో సమావేశమయ్యారు. దీనికి కాస్త ముందుగా  జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనూ సమాలోచనలు జరిపారు. ఇటీవల మంత్రి పదవులు వదులుకున్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్,  ప్రకాశ్ జావడేకర్, సదానంద గౌడ, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వంటివారిని పార్టీలో పదవుల్లోకి తీసుకోనున్నారని సమాచారం. రవిశంకర్ ప్రసాద్ ను తమిళనాడు గవర్నర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బిజెపి విధానం మిగిలిన పార్టీల వలె కాదు. అన్ని విషయాల్లో నిర్ణయాధికారం కేవలం ప్రధాని, పార్టీ అధ్యక్షుల చేతుల్లో ఉండదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్ ) ఆలోచననలను, అభిప్రాయాలను, సలహాలను గౌరవిస్తూ పాటించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగానూ అది కీలకం.

Also read: విశాఖ ఉక్కు: రాజకీయనేతల వైఫల్యం

బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ఆత్మవిమర్శ, యువతకు ప్రాధాన్యం

గత కాలపు నాయకుల కంటే భిన్నంగా నరేంద్రమోదీ ప్రభ, ప్రతిష్ఠ ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థకు అతీతంగా పెరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో అత్యంత శక్తివంతమైన సంఘ్ సేవకులను విస్మరించి ప్రస్థానం చేయడం కుదిరేపని కాదు.  ఆర్ ఎస్ ఎస్ కూడా స్వీయ సమీక్ష చేసుకొని, ప్రక్షాళన జరుపుతూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగా నిన్నటి వరకూ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ మాధవ్ ను మళ్ళీ వెనక్కు పిలిపించుకుంది. జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా దేశ వ్యాప్తంగా సంఘ్ ను బలోపేతం చేసే పనిలో ఆయన నిమగ్నం కానున్నారు. ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ హొసబేలెను నియమించారు. మోహన్ భగవత్ అధినాయకత్వంలోనే ఉంటూ,యువరక్తాన్ని నింపుకుంటూ సంఘ్ పరివార్ ను బలోపేతం చేయాలనుకుంటున్నారు. వచ్చే 2025 సంవత్సరానికి సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. శతజయంతి వేళకు పలు లక్ష్యాలను పెట్టుకొని సంఘ్ ముందుకు వెళ్తోంది. ప్రధానంగా విస్తరణపై దృష్టి ఎక్కువ పెట్టింది. దేశంలోని అన్ని గ్రామాలలో సంఘ్ పరివారకులు ఉండాలన్నది ముఖ్యమైన లక్ష్యం. ఇప్పటి వరకూ పట్టణాలు, నగరాలకు ఎక్కువగా పరిమితమైంది. వారు అనుకున్నట్లుగా గ్రామాల్లోనూ సంఘ్ పరివార్ పెరిగితే అది రాజకీయంగా బిజెపికి కూడా కలిసి వచ్చే అంశం. వీటితో పాటు మత మార్పిడులను అడ్డుకోవాలనీ, తద్వారా హిందుత్వ శక్తిని ద్విగుణీకృతం చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఆర్ ఎస్ ఎస్ శక్తి ఎంత పెరిగితే  బిజెపికి అంత లాభం. వివిధ రాష్ట్రాల్లో 2022లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకం. అందునా, ఉత్తరప్రదేశ్ ఇంకా కీలకం. గుజరాత్ కూడా అంతే. ఈశాన్య రాష్ట్రాలపైన ప్రత్యేక శ్రద్ధను పెడుతున్నారు. వీటి తర్వాత వచ్చే సార్వత్ర ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి  ఇప్పటి నుంచే కసరత్తులు, మరమ్మత్తులు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చూస్తే  ఇప్పటి వరకూ ఉత్తరాదిలో బిజెపి తిరుగులేని శక్తిగానే ఉంది. రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల్లో పార్టీ ఇంకా బలపడాల్సి వుంది.

Also read: అల్లకల్లోలం దిశగా ఆఫ్ఘానిస్థాన్

దక్షిణాదిలో దిగదుడుపే

దక్షిణాది రాష్ట్రాలు, ఒరిస్సా కలుపుకొని మొత్తం ఆరు రాష్ట్రాలు ఉన్నాయి. వీటిల్లో కర్ణాటక ఒక్కచోట మాత్రమే 25మంది లోక్ సభ సభ్యులతో అత్యంత బలంగా ఉంది. ఒరిస్సాలోని 21స్థానాల్లో 8మంది సభ్యులతో మూడోవంతు మెజారిటీని 2019 ఎన్నికల్లో కైవసం చేసుకుంది. ఒరిస్సాలో పార్టీ ఇంకా ఎదగాల్సి ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రం. దానిని పక్కన పెడితే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలో దృష్టిని మరింత పెంచాల్సి వుంది. తెలుగురాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే  తెలంగాణ కొంచెం పర్వాలేదు. అక్కడ నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. వై ఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్తగా ‘వై ఎస్ ఆర్ టీ పీ’ ఏర్పడింది. ఫైర్ బ్రాండ్ గా కాస్త జనాకర్షణ కలిగిన రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వచ్చాయి. నిన్నటి వరకూ ప్రధానమైన పోటీ టీ ఆర్ ఎస్ – బిజెపి మధ్యే ఉండేది. రేపటి ఎన్నికల్లో మిగిలిన రెండు పార్టీలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిజెపికి తమిళనాడులో ఒకే ఒక లోక్ సభ అభ్యర్థి ఉన్నారు. ద్రవిడ పార్టీల నడుమ అక్కడ పార్టీని బలోపేతం చేయడం అంత తేలికైన పనికాదు. కేరళ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి దయనీయంగానే ఉంది. రెండు రాష్ట్రాల్లో ఒక్క లోక్ సభ సభ్యుడు లేరు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ పై బిజెపి ప్రభుత్వం సీతకన్ను వేసిందనే విమర్శలు సర్వత్రా ఉన్నాయి. నిజం చెప్పాలంటే  1983 నుంచి సుమారు ఈ నలభై ఏళ్ళల్లో పార్టీలో ఎటువంటి ప్రగతి లేదనే చెప్పాలి. పార్టీకి కార్యకర్తలు మూల స్థంభాల వంటివారు. ఈ నలబై ఏళ్ళల్లో వారిని ఉత్తేజితులను చేయడంలో బిజెపి విఫలమైంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు కేడర్ పై ప్రత్యేక శ్రద్ధను చూపించాయి. చిన్నగా ప్రస్థానం ప్రారంభించిన అనేకమంది నాయకులు ఆయా పార్టీలో విభిన్న స్థాయిల్లో ఎదిగారు. బిజెపిలో కొద్దిమందికి మాత్రమే ఉజ్వల ప్రగతి లభించింది. ప్రస్తుతం  కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ  వై ఎస్ ఆర్ సీపీ, తెలుగుదేశం రెండింటికీ బలమైన కేడర్ ఉంది. నిన్నటి ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించిన వైసీపీ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో బిజెపి ఎదగాలంటే  సమూలమైన మార్పులు జరగాలి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేఎన్నికల్లో అధికారం మాదేనని ప్రచారం చేసుకుంటే సరిపోదు. క్షేత్ర వాస్తవికతలను అంచనా వేసుకొని ముందుకు సాగాలి. రెండు తెలుగు రాష్ట్రాలు విభజన పరమైన అంశాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా విషయాల్లో ఎటువంటి పరిష్కారం లేదు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచుతున్నాయి.

Also read: వైఎస్ ఆర్ టీపీ ఆవిర్భావం

ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ మొండిచెయ్యి

ఈ నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోగా, అడుగడుగునా గండాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. బిజెపి ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరిస్తే  ప్రజల్లో ఆ పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అటకెక్కింది. 2014 ఎన్నికల సమయంలో సాక్షాత్తు నరేంద్రమోదీ ఈ అంశంలో మాట ఇచ్చారు. తర్వాత మాట మారింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం  ఆశించిన స్థాయిలో ఊతం ఇవ్వలేదు. కొత్త పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు వచ్చిన సందర్భాలు కూడా లేవు. పారిశ్రామిక ప్రగతికి తోడు నిలవక పోగా  విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసే పనిలో కేంద్రం ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాలు,  ప్రజావ్యతిరేకతలను బిజెపి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర బిజెపి ఈ ఉద్యమాలకు దూరంగా నిల్చొని చోద్యం చూస్తోంది. ఇలా దక్షిణాదిలో కర్ణాటక తప్ప అన్నిచోట్ల పరిస్థితులు ఒకేరకంగా ఉన్నాయి. ఇటువంటి ఎన్నో అంశాలు చుట్టుముట్టి ఉండగా, దక్షిణాదిలో బిజెపి ఎలా ఎదుగుతుందనే ప్రశ్నలు ప్రజాక్షేత్రం నుంచే వస్తున్నాయి. కరోనా కష్టాలు, నిరుద్యోగం, ఉపాధిలేమి, అధికధరలు, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కొన్ని సామాజిక వర్గాల పెత్తనం మొదలైనవి బిజెపికి ఎదురుదెబ్బ తీసే అంశాలు.సుదీర్ఘకాలంలో పాలనలో ఉండడం వల్ల వచ్చే ప్రజావ్యతిరేకత/అసంతృప్తి ( యాంటీ ఇన్ కమ్ బెన్సీ ) అదనంగా ఎదుర్కోవాల్సిన మరో కోణం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో పాలనలో, అభివృద్ధిలో,సంక్షేమంలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో మెరుగైన ఫలితాలను సాధించపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత తేలిక కాదు. మోదీ గ్రాఫ్ తగ్గుముఖం పట్టిందనే ప్రచారం జరుగుతున్న వేళ, తమను తాము మళ్ళీ మరొకసారి నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ప్రజావిశ్వాసాన్ని మరింతగా పొందాల్సిన అవసరం ఉంది.  ప్రస్తుతం పార్టీలో ఉన్న క్యాడర్ ను తృప్తి పరచడం, కొత్తగా వచ్చేవారికి ఆకర్షణను కలిపించడంలో చేపట్టబోయే చర్యలు చాలా కీలకం. ప్రస్తుత క్యాడర్ వేరే పార్టీల్లోకి ఉడాయించకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. నేడు  బిజెపి – ఆర్ ఎస్ ఎస్ కలిసి వేసే ప్రతి అడుగూ రేపటి గెలుపు ఓటములకు కీలక భూమిక కానుంది.

Also read: మంత్రమండలి విస్తరణ ఎన్నికల కోసమే!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles