వోలేటి దివాకర్
రామకృష్ణ, వివేకానంద బోధనలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి ఉత్తరాంధ్ర రామకృష్ణ – వివేకానంద భావ ప్రచార పరిషత్ 4 వ భక్త సమ్మేళన వేడుకలు ఈనెల 23,24,25 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి రామకృష్ణ మఠం స్వామి వినిశ్చలానందజీ చెప్పారు. ఈ సభలు కరోనా వలన మూడేళ్ళుగా నిర్వహించలేదని ఆయన తెలిపారు. ఈ మూడు రోజుల సదస్సులో స్వామీజీలు, శారదా మఠం మాతాజీలు , ప్రముఖ వక్తలు పాల్గొని నవచైతన్యానికి మార్గదర్శనం చేస్తారు. స్వామి వేద విద్యారణ్యజీ, స్వామి రఘు వీరానందజీ, స్వామి ప్రజ్ఞానందజీ లతో కల్సి మంగళవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్వామి వినిశ్చలానందజీ మాట్లాడుతూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే ఈ మూడు రోజుల భక్త సమ్మేళనంలో భాగంగా తొలిరోజు 23వ తేదీన యువజన సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు మూడువేలమంది పాల్గొనే ఈ సదస్సు సందర్బంగా నామమాత్ర ఫీజుగా 300 రూపాయలను నిర్ణయించామని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం, మొత్తం అందరికీ ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.
తొలి రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శోభాయాత్ర, పతాకావిష్కరణ, స్వదేశీ మంత్ర పఠనంతో ప్రారంభమయ్యే యువజన సదస్సుకి 18కళాశాలలకు చెందిన 1500మంది విద్యార్థులు హాజరవుతారని, వీరందరికీ ప్రవేశం ఉచితమని స్వామి వినిశ్చలానందజీ చెప్పారు. బేలూరు మఠం ఉప సర్వాధ్యక్షులు స్వామి సుహితానంద మహారాజ్ ఆశీస్సులు ఇస్తారని, హైదరాబాద్ రామకృష్ణ మఠం స్వామి బోధాయనంద మహారాజ్, సిబిఐ రిటైర్డ్ జెడి డాక్టర్ లక్ష్మీనారాయణ, చెన్నై రామకృష్ణ మఠం స్వామి రఘునాయకానంద మహారాజ్ పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారని ఆయన చెప్పారు. తరువాత 24,25 తేదీల్లో జరిగే భక్త సమ్మేళనంలో ప్రవచన విరించి సామవేదం షణ్ముఖ శర్మ, డాక్టర్ గరికపాటి నరసింహారావు, దేశంలోని వివిధ ప్రాంతాల స్వామీజీలు పాల్గొని ప్రసంగాలు చేస్తారని వివరించారు.
40 శాతం డిస్కౌంట్ తో పుస్తకాలు
రామకృష్ణ మఠం ప్రచురించిన పలు రకాల పుస్తకాల ప్రదర్శన ఏర్పాటుచేసి, 40శాతం డిస్కౌంట్ తో విక్రయించనున్నట్లు స్వామి వినిశ్చలానందజీ చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.