సెమీస్ లో ముంబయికి కర్నాటక సవాల్
ఇటు పృథ్వీ షా- అటు దేవదత్ పడిక్కల్
జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ గ్రూపు లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ వరకూ ముంబై,కర్నాటక యువఆటగాళ్లు పరుగుల హోరు, సెంచరీల జోరుతో మోత మోగిస్తున్నారు. కర్నాటక యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు బాదడం ద్వారా తనజట్టును సెమీస్ కు చేర్చితే మరోవైపు..ముంబై కెప్టెన్ కమ్ యువఆటగాడు పృథ్వీ షా భారీ స్కోర్లతో తన జట్టును సైతం సెమీస్ కు తీసుకెళ్లాడు. లీగ్ దశలో పుదుచ్చేరీ పై 227 పరుగులు, ఢిల్లీ పైన 105 పరుగులు సాధించిన పృథ్వీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రపై కేవలం 123 బాల్స్ లోనే 185 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. పృథ్వీ 29 బాల్స్ లోనే 50 పరుగులు సాధించడంతో పాటు సహ ఓపెనర్ యశస్వీతో కలసి మొదటి వికెట్ కు 238 పరుగుల భాగస్వామ్యంతో విజయం ఖాయం చేశాడు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన సౌరాష్ట్ర్ర 5వికెట్లకు 284 పరుగుల స్కోరు సాధించింది. సమాధానంగా 285 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ముంబయి 41.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరింది. మొదటి 9 ఓవర్లలోనే ముంబైకి ఓపెనింగ్ జోడీ 67 పరుగుల మెరుపు భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ పృథ్వీ షా 21 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 185 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 104 బాల్స్ లో 75 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ముంబై 9 వికెట్ల అలవోక విజయంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. డిఫెండింగ్ చాంపియన్ కర్నాటకతో జరిగే పోటీలో ముంబయి తలపడనుంది. కర్నాటక తరపున నాలుగు సెంచరీల మొనగాడు దేవదత్ పడిక్కల్, ముంబయి తరపున మూడు సెంచరీల హీరో పృథ్వీ షా సెమీస్ సమరంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.
ఇదీ చదవండి: శిక్షకుల్లో మహాశిక్షకుడు రవిశాస్త్రి