- వయస్సుతో నిమిత్తం లేకుండా గుండెపోటు మరణాలు
- బ్రెయిన్ స్ట్రోక్ కూడా వేధిస్తోంది
ప్రతి రోజూ గుండెలు పిండే వార్తలు వింటున్నాం. వయసుకు, రంగానికి, ప్రాంతానికి సంబంధం లేకుండా ఎందరో గుండెపోటుతో ఉన్నపళంగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు. బకాసురుడికి అన్నం లాగా ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అని ప్రతి ఒక్కరూ వణికిపోయే పరిస్థితులు వచ్చేశాయి. గుండెపోటుకు తోడు బ్రెయిన్ స్ట్రోక్ కూడా శరవేగంగా విశ్వవ్యాప్తమవుతోంది. మామూలుగా బీపీని సైలెంట్ కిల్లర్ అంటుంటారు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం సాధారణం, అవసరం కూడా. పిల్లలు,యువతకు గుండెపోటు అనే మాట ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తోంది. ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా క్రమశిక్షణతో జీవించినవారు కూడా ఎందరో గుండెపోటుకు గురయ్యారు. ఆకాశం, గాలి, నీరు, మట్టి పంచభూతాలన్నీ కాలుష్య కాసారంగా మారిపోయాయి. ఆ ప్రభావంతో వాతావరణం, ఆహారం, శరీరం, మనసు అన్నీ మలినమైపోతున్నాయి, అనారోగ్యాన్ని అందిస్తున్నాయి. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్ల మన చుట్టూ ఉండే మంచి వాతావరణాన్ని, గొప్ప ప్రకృతిని మనమే పాడుచేసుకున్నాం. నేడు ఆ తప్పులకు మూల్యం చెల్లిస్తున్నాం. గుండెపోటును తగ్గించుకోడానికి వైద్యులు అనేక సూచనలు చేస్తూనే ఉన్నారు. అతి తిళ్ళు, ఒత్తిళ్లతో పాటు అతి వ్యాయామం కూడా కొంప ముంచుతోంది. మనకంటి ఎదురుగానే ఎందరో ప్రముఖులు నేలకు ఒరిగిపోయారు. 12 ఏళ్ళ బాలుడు, ఆరేళ్ళ పసిపిల్లవాడు గుండెపోటుతో ప్రాణాలు వదిలిన దుర్ఘటనలు ఈమధ్యనే వార్తలుగా చక్కర్లు కొట్టాయి. ఇన్నింట నడుమ గుండెను దిటవుగా ఉంచుకోడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి.
Also read: స్వాతిముత్యం ఒక ఆణిముత్యం
మానసిక ఆరోగ్యం ముఖ్యం
అన్నింటి కంటే ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. దానిని పదిలంగా నిలిపేది మన ఆలోచనా విధానం. అందంగా మలచుకోడానికి అద్భుతమైన మార్గాలు మన చెంతనే ఉన్నాయి. యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ఓంకారం, ప్రాణాయామం, ధ్యానం, సంగీత సాహిత్యాలు, చతుషష్టికళలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవడం మన చేతుల్లో, మన చేతలలోనే ఉంది. మిత వ్యాయామం, సరిపడా నడక, సమతుల్య ఆహారం, సక్రమమైన నిద్ర,సరియైన విశ్రాంతి ఇవన్నీ దివ్య మంత్రాలు. వీటిని ఆచరించడమే తరువాయి. అట్లే ఆహారం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. సరియైన బరువును నిలుపుకోడానికి దీని పాత్ర ఎనలేనిదని వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. గుండెను ఆరోగ్యవంతంగా నిలిపే ఆహార పదార్ధాల గురించి విచారిస్తే మన ఎదురుగా కనిపించే వాటిల్లో పెరుగు, గింజపప్పులు, చిక్కుళ్ళు, చేపలు, పాలకూర గురించి ఆహార నిపుణులు, వైద్యులు ప్రధానంగా చెబుతున్నారు. శరీరంలోని జీవ రసాయనక చర్యలను సక్రమంగా నిలుపుకోవడంలో, సమతుల్యతను సాధించడంలో గుండెపోటును అరికట్టడంలో వీటి పాత్ర ముఖ్యమైనదని తెలుస్తున్న నేపథ్యంలో మన ఆహార విధానాన్ని తదనుగుణంగా మలుచుకోవడమే శరణ్యం.
Also read: స్త్రీపురుషుల సమానత్వాన్నిస్వాగతిద్దాం
క్రమశిక్షణ, సాధన అవసరం
రక్తప్రసరణ,ఆక్సిజన్ అతి ముఖ్యమైనవి. గుండె ఆగిపోవడన్నే మరణానికి నిర్వచనంగా చెబుతారు. ఆ గుండె ఆగకుండా స్పందనలు, ప్రతిస్పందనలు సక్రమంగా సాగేలా చూసుకోవడం మన పనే. సరే! మానవశక్తికి, ఊహకు మించి వచ్చి పడేవాటిని మనం ఏమీ చేయలేం. “వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు ” అన్న మాట ఎట్లాగూ ఉంది. ఈ నానుడిని అట్లుంచగా స్వీయ క్రమశిక్షణ, స్వీయ సాధన అత్యంత అవసరం. గుండెను, మెదడును, మనసునుదిటవుగా, ఆరోగ్యంగా ఉంచే పనిలో పడిపోదాం.
Also read: గోదావరి – కావేరి అనుసంధానం అయ్యేనా?