సంపద సృష్టిద్దాం – 08
నా విద్యార్థిమిత్రుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి. నాలుగేళ్ల ఇంజనీరింగ్ సకాలంలో పూర్తి చేశాడు. నాలుగో ఏడాదిలోనే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్లు తిరగకుండానే తన బృందంలో ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల విదేశంలో కొద్ది నెలలు పనిచేసే అవకాశం వచ్చింది. అటునుంచి వచ్చాక తన స్థాయి అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. ఇద్దరి జీతంతో ఎంతో సంతోషంగా ఉండాల్సిన యువకుడి జీవితంలోకి అసంతృప్తి అనే భూతం మెల్లగా చొరబడి మనిషిని ఆక్రమించేసింది. మొదట్లో కొలీగ్స్ మీద చిర్రుబుర్రులాడడం, క్రమంగా కుటుంబ సభ్యుల మీద విసుక్కోవడం, ఆపైన తన మనసుకు నచ్చకపోతే చాలు.. అపరిచితులపైన కూడా కేకలు వేయడం మొదలుపెట్టాడు. జీవితం పట్ల విసుగు ప్రదర్శించేవాడు. మూడు నెలలు తిరక్కుండానే అతని సంబంధ బాంధవ్యాలన్నీ పూర్తిగా పెళుసుబారిపోయాయి. అందరూ పలకరించడం కూడా మానేశారు. ఆరు నెలలు తిరక్కుండానే చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది.
Also read: ఇస్తుంటే తీసుకుంటాం..
ఏది ఆలోచిస్తే అదే దొరుకుతుంది
తన జీవితం ఇలా మారడానికి కారణం అర్థం చేసుకోలేకపోయాడు. నన్ను కలిశాడు. సాంతం విన్నాక చెప్పిన మాట విని తట్టుకోలేకపోయాడు. దీనికంతటికీ కారణం అతనేనంటే పూర్తిగా నమ్మలేకపోయాడు. చదువుకునే రోజుల్లో ఉండే అంతులేని ఆత్మవిశ్వాసంతో కూడిన ఆశావాదంవల్ల తనకు సాధ్యం కావనుకున్న అందలాలు సాధించాడు. కాని, క్రమంగా హృదయంలో చేరిన ఒక చిన్న భావన – తనకు సంతోషం లేదనే భావన – తనను నిలువునా దహించివేసింది. తన ఆలోచనలు నెగటివ్ గా మారాక, అతని చుట్టూ క్రమంగా ఒక నెగటివ్ వాతావరణాన్ని వైఫైలాగా సృష్టించుకున్నాడు. మనుషుల మీద అరవడంతో అక్కడ సైకిల్ పూర్తయింది. తిరిగి మనుషులందరూ అతని వ్యక్తితాన్ని కించపరుస్తూ మాట్లాడడంతో పూర్తిగా నిరాశావాదంలో కూరుకుపోయాడు. దీనికి విరుగుడు ఆకర్షణ సిద్ధాంతంలో ఉందని నేను చెప్తే చాలారోజులు విశ్వసించలేదు. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే మాటను జీర్ణించుకోలేక పోయాడు. కాని, నేను ఇచ్చిన ఒకట్రెండు పుస్తకాలు చదివి నెమ్మదిగా రియలైజ్ అయ్యాడు. అలా మూడు నెలలు ఉద్యోగం లేకుండా గడిపిన తర్వాత, చుట్టాలు బంధువుల సూటిపోటి మాటలు భరించలేక ఇక నేనేం చెయ్యాలి అని శరణు కోరినప్పుడు, నీకు లేనిదాని మీద కంటే ఉన్నదాని మీద పూర్తి ఫోకస్ పెట్టు అని చెప్పాను. అర్థమైనట్టే ఉంది. కాని కాలేదని చేతులెత్తేశాడు. అప్పుడు చెప్పిందే గ్రాటిట్యూడ్ టెక్నిక్. రోజంతా కుదిరినప్పుడల్లా పదేపదే ఈ మాటలు చెప్పమని కోరాను. “నా జీవితంలో ఉన్న అద్భుతమైన సంబంధ బాంధవ్యాలకు విశ్వానికి కృతజ్ఞత. నాకు విజయవంతమైన కెరియర్ ను అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ప్రస్తుతం నా జీవితంలో నేను అనుభవిస్తున్న ప్రతి అంశాన్ని నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత”. ఈ వాక్యాలను పదేపదే మననం చేయడమే కాకుండా, విచారపడే బదులు, దుఃఖపడే బదులు, భేదపడే బదులు, నిరాశపడే బదులు తనకున్న వాటికి కృతజ్ఞత మనసులో అనుభూతి చెందడాన్ని చాలా ప్రయత్నపూర్వకంగా చేసేవాడు. నెగటివ్ ఆలోచనలు నెమ్మదిగా చొరబడేవి. వాటిని నియంత్రించుకుని, వాటి స్థానంలో సానుకూల వాక్యాలను మనసులో పదేపదే మననం చేసుకోవడం ద్వారా తనచుట్టూ దట్టంగా అలుముకున్న నెగటివ్ వాతావరణాన్ని నెమ్మదిగా బద్దలు కొట్టడం మొదలుపెట్టాడు.
Also read: మనీ పర్స్ చూశారా!
అడుగు – నమ్ము – పొందు
ఆరు వారాలు తిరగకుండానే నా విద్యార్థిమిత్రుడికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. కొత్త పని ప్రదేశంలో కొలీగ్స్ అందరూ ఇతని వ్యక్తిత్వాన్ని చూసి ముచ్చట పడడం మొదలు పెట్టారు. నెమ్మదిగా భార్యాపిల్లలతో రిలేషన్షిప్ చక్కదిద్దుకున్నాడు. మునుపటి మనిషి కాలగలిగాడు. ఓప్రా విన్ఫ్రే తన పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించిన ఈ మాటలను మనం తెలుసుకోవాలి.. “నీకున్నదానికి నిరంతరం ధన్యుడిగా ఉండు – మరింత సమకూరుతుంది. నీకు లేనిదాని గురించి చింతిస్తూ కూర్చుంటే ఉన్నది కూడా తరిగిపోయి, ఏమీ లేకుండా మిగులుతాం”. మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు మనమీద మనకు ఆత్మన్యూనత ఏర్పడుతుంది. కోటీశ్వరులకు సైతం ఆర్థిక సమస్యలు వస్తూ పోతుంటాయని ఆ క్షణం మర్చిపోతాం. మన డబ్బులేమి పైన దృష్టి పెడతాం. మరిన్ని సమస్యలను కొని తెచ్చుకుంటాం. ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా, మన కనీస అవసరాలు తీర్చబడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని, ఉన్నదానిపైనే మన ఫోకస్ పెట్టగలగాలి. సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఇప్పుడు ఒక కీలక ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో ప్రయత్నించండి. మీ ఫీలింగ్స్ మిమ్నల్ని కంట్రోల్ చేస్తున్నాయా? లేదంటే మీరే మీ ఫీలింగ్స్ ను అదుపులో ఉంచగలుగుతున్నారా? మన భావోద్వేగాలు మన అదుపులోనే ఉండాలి. మన సుప్తచేతనను మన అధీనంలోనే ఉంచుకోవాలి. దానికి చాలా ప్రయత్న పూర్వక కృషి చేయాలి. ప్రతిరోజు నిరంతర సాధన చేయడం ద్వారా దీనిని మనం సాధించగలం. అందుకు తోడ్పడే సానుకూల వాక్యాలు లేదా పాజిటివ్ అఫర్మేషన్లను మనం సిద్ధం చేసుకోవాలి. అదే విశ్వ రహస్యం.
Also read: ఈజీమనీకి స్వాగతం!
తప్పక చేయండి: మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీ ప్రస్తుత పరిస్థితులు ఏవైనా, ఎన్ని ఉన్నా వాటి జాబితాను తయారుచేయండి. ఆ జాబితా ఎంత పొడుగున్నా ఫరవాలేదు. కాని, అందులో రాసిన ప్రతి వాక్యానికి ప్రత్యామ్నాయంగా మీకున్నవాటికి కృతజ్ఞతలు రాస్తూ, ఆ జాబితాను పూర్వపక్షం చేయండి.
Also read: ఆకర్షణ సిద్ధాంతమా!
–దుప్పల రవికుమార్