Sunday, December 22, 2024

ప్రియాంకకు గొప్ప ఉపకారం చేసిన యోగి ఆదిత్యనాథ్

ప్రియాంకాగాంధీ వద్రా ఉత్తరప్రదేశ్ పోలీసులపైన వాగ్దాడి చేశారు. తర్జని చూపిస్తూ పోలీసు అధికారులతో ‘‘దమ్ములుంటే నన్ను తాకండి, మీ సంగతి తేలుస్తా’’ అంటూ హుంకరించిన ప్రియాంకను చూసినవారికి ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీ గుర్తువచ్చి ఉంటారు.  ఆత్యయిక పరిస్థితి వికటించి 1977లో ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మోరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా జనతా ప్రభుత్వం ఏర్పడింది. అందులో హోంమంత్రిగా చౌధురీ చరణ్ సింగ్ ఉన్నారు. ఆయనకు తెలియకుండానే అధికారులు ఇందిరాగాంధీని అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఇందిర నివాసానికి పోలీసులు వెడుతున్నప్పుడు చౌధురీ సాహెబ్ కు తెలిసింది. అధికారుల అత్యుత్సాహం వల్ల ఆయన బదనాం అయ్యారు.

తిహార్ జైలుకు ఇందిరాగాంధీని తరలిస్తున్న పోలీసు వ్యాన్ ను ఒక్క నిమిషం ఆపుచేయవలసిందిగా ఆమె కోరారు. పోలీసులు వ్యాన్ ఆపుచేశారు. ఆమె వ్యాన్ దిగి అక్కడే ఉన్న ఒక కల్వర్టు పైన కూర్చున్నారు. మీడియాకు కబురు పెట్టారు. అప్పుడు పీవీ నరసింహారావు మీడియా మిత్రులందరికీ ఫోన్ చేశారు. ‘‘ఇందిరాగాంధీ అరెస్టయినప్పుడు మేమంతా అనేక ఏర్పాట్లు చేశాం. పబ్లిసిటీ బాగా వచ్చింది,’’ అని చెప్పేవారు. కల్వర్టుపైన కూర్చున్న ఇందిరాగాంధీ విలేఖరులతో మాట్లాడారు. అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. అరెస్టు వారెంటు లేకుండా తనను అరెస్టు చేయించారనీ, దీని వెనుక హోంమంత్రి చౌధురీ చరణ్ సింగ్ ఉన్నారనీ ఆమె ఆరోపించారు. పశ్చిమ యూపీలో మకుటం లేని మహారాజు చరణ్ సింగ్.

నాడు ఇందిర ప్రచారానికి చరణ్ సింగ్ అవకాశం ఇచ్చినట్టే ఇప్పుడు తూర్పు యూపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ ఇందిరమ్మ మనుమరాలికి పెద్ద అవకాశం ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ కానీ సల్మాన్ ఖుర్షీద్ కానీ చేయలేని పని యోగి ఆదిత్యనాథ్ చేశారు. మామూలుగా నెహ్రూ మునిమనుమరాలనీ, ఇందిర మనుమరాలనీ, రాజీవ్ తనయ అనీ ఇంతవరకూ గౌరవం ఇచ్చినవారు. ఇక మీదట ప్రియాంకను ఒక పోరాట యోధురాలుగా, సాహసవంతురాలైన రాజకీయవేత్తగా చూస్తారు. లఖింపూర్ కి వెళ్ళడానికి యూపీ పోలీసులు అనుమతిస్తే  ఒక రోజు హడావిడితో కథ ముగిసేది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా వచ్చేవారు. ప్రియాంక, అఖిలేష్, చరణ్ సింగ్ మనుమడు అందరూ కారు దూసుకొని వెళ్ళడం వల్ల మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేవారు. ఆ రోజున టీవీ చానళ్ళూ, మరుసటి రోజు వార్తాపత్రికలూ హడావిడి చేసేవి. ఆ తర్వాత మరో ఘటన ఏదో జరిగేది. దాని వెంట పడేవారు.

అంత తేలికగా ముగిసే కథను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త మలుపు తిరిగి పొడిగించారు. ప్రియాంకను లఖింపూర్ వెళ్ళకుండా ఆపుచేయాలనీ, ఒక గెస్ట్ హౌస్ లో నిర్బంధించాలనీ ఆదేశించారు. నిర్బంధించే సమయంలో ప్రియాంక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతమంతి పోలీసులను ఎదిరించి ఒక ఆడకూతురు ధైర్యంగా మాట్లాడటాన్నీ, పోట్లాడటాన్నీ సామాన్య ప్రజలు తెగమెచ్చుకున్నారు. రెండు సంవత్సరాల కింద పార్టీ ప్రదాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించి యూపీ వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ప్రియాంకను ‘టూరిస్టు పొలిటీషియన్’ అంటూ ఇదే యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు దిల్లీ నుంచి వచ్చి, బాధితులను పరామర్శించి మళ్ళీ దిల్లీకి వెళ్ళిపోతారనీ, సీరియస్ పోలిటీషియన్ కాదనే అపప్రధ ఉండేది. ఈ దెబ్బతో అదంతా పోయింది. ఇప్పుడు మంచి ఫైటర్ గా పేరు వచ్చింది.

అంత మాత్రాన రేపు యూపీలో జరిగే ఎన్నికలలో ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సంపాదిస్తుందా? సంపాదించలేకపోవచ్చు. ఇదే విధంగా పోరుబాటలో ప్రియాంక కనీసం యూపీ ఎన్నికలయ్యేవరకైనా సాగుతారా? సాగకపోవచ్చు. తిరిగి దిల్లీ వెళ్లిపోయి, అన్న రాహుల్ తో కలిసి ఛత్తీస్ గఢ్ లో అసమ్మతి పొగ రాజేయవచ్చు. పంజాబ్ లో చేసిన రాజకీయాన్నే ఛత్తస్ గఢ్ లోనూ, అనంతరం రాజస్థాన్ లోనూ చేయవచ్చు. కానీ టూరిస్టు పోలిటీషిన్ అనే ముద్ర చెరిగిపోవడానికీ, సిరియస్ పోలిటీషియన్ అనే ముద్ర పడటానికి యోగి ఆదిత్యనాథ్ చేసిన మహోపకారం ప్రియాంక మరువలేనిది.

దిల్లీ నుంచి అమిత్ షా నో, ప్రధాని నరేంద్రమోదీనో యోగీకి ఫోన్ చేసి చివాట్లు పెట్టి ఉంటారు. అందుకనే రాహుల్ గాంధీని లఖింపూర్ వెళ్ళడానికి అనుమతించారు. రాహుల్ చెల్లెలి దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకొని లఖింపూర్ వెళ్ళారు. ప్రియాంక ఇమేజ్ పెరగడానికి ఆమెను ద్వేషించే యోగి ఆదిత్యనాథ్ దోహదం చేయడం ఇందలి విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles