- 37 ఏళ్ళలో వరుసగా రెండు విడతల ప్రమాణం చేసిన తొలి ముఖ్యమంత్రి
- ఉపముఖ్యమంత్రులుగా ఒక వెనుకబడినకులాలనేత, ఒక బ్రాహ్మణ నేత
యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 37 సంవత్సరాలలో ప్రప్రథమంగా ఒకే వ్యక్తి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం శుక్రవారంనాడే జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనాయకులూ, బాలీవుడ్ నటీనటులూ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైనారు.
యోగి ఆదిత్యనాథ్ తో పాటు 52 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. యోగికి ఇద్దరు ఉపనాయకులు ఉంటారు. ఒకరు ఇటీవల ఎన్నికలలో పరాజయం చవిచూసిన మాజీ ఉఫముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. ఈయన వెనుకబడిన కులాల అగ్రనాయకుడు. ఇదివరకు ఉపముఖ్యమంత్రిగా ఉండిన దినేశ్ శర్మ కూడా ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన స్థానంలో ప్రముఖ బ్రాహ్మణ నేత బ్రజేష్ పాఠక్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
సినీ ప్రముఖులు అక్షయ్ కుమార్, కంగనారావత్, బోనీ కపూర్ లో ఈ వేడకకు హాజరైనారు. ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన కశ్మీర్ ఫైల్స్ చిత్ర ప్రముఖులను కూడా అటల్ బిహారీ స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకరా మహోత్సవానికి ఆహ్వానించారు. ‘నయే భారత్ కా నయా యూపీ(నవభారతంలో సరికొత్త యూపీ) అనే నినాదాలు మిన్నుముట్టాయి. వేలాదిమంది ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
బీజేపీ ఫిబ్రవరి-మార్చి ఎన్నికలలో మొత్తం 403 స్థానాలలో 255 స్థానాలను, 41.29 శాతం ఓట్లనూ గెలుచుకొని అధికారం నిలబెట్టుకున్నది. తన పార్టీని విజయపథంలో నడిపించిన యోగి ఆదిత్యనాథ్ కడచిన 37 సంవత్సరాలలో అయిదేళ్ళ పదవీకాలం పూర్తి చేసి రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి ముఖ్యమంత్రి.