- కేసీఆర్ ముంబయ్ సందర్శన ఒక ముందడుగు
- కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలు చేయగలిగింది శూన్యం
- అంతిమంగా దిశానిర్దేశం చేసేది సంఖ్యబలమే
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపాలని చూస్తున్నవారంతా ఏకమవుతున్నారని అనిపిస్తోంది. ఈ ఆటలో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కేంద్రబిందువుగా కనిపిస్తున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి,శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబయి వెళ్లారు. ఉధ్ధవ్ తో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఎన్ సీ పి అధినాయకుడు శరద్ పవార్ తో కూడా సమావేశం అయ్యారు. వారందరినీ హైదరాబాద్ కు కూడా రావాలని కెసీఆర్ ఆహ్వానించారు.”ఈ చర్చలు ఆరంభం మాత్రమే. మున్ముందు పురోగతి లభిస్తుంది. దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తాం” అని ఉధ్ధవ్ ఠాక్రే అంటున్నారు.
Also read: దక్షిణాది నదుల అనుసంధానంపై చర్చ
భావస్వారూప్యత అనగానేమి?
“భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం,” అని శరద్ పవార్ -కెసీఆర్ ఉభయులు కలిసి ప్రకటించారు. ఈ ‘భావ సారూప్యత’ అనేది రాజకీయ నాయకుల నుంచి తరచుగా వినిపించే మాట. అదొక బ్రహ్మపదార్ధం. నరేంద్రమోదీని ప్రధానమంత్రి పీఠం నుంచి దింపడమే ప్రధానంగా వీరి భారసారూప్యత అని భావించాలి. మహారాష్ట్రలో ప్రస్తుతం బాగస్వామ్యులుగా అధికారంలో ఉన్న మూడు పార్టీల మధ్య సిద్ధాంత పరంగా ఎటువంటి భావసారూప్యత లేదు. అలాగే, గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో అనేక సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీల మధ్య కలయికలు జరిగాయి, విడిపోవడం కూడా జరిగింది. ఈ కాలచక్రంలో ప్రస్తుతం మరో కలయిక మొదలైంది. వీరందరిలో కెసీఆర్ మంచి జోరు మీద ఉన్నారు.మూడో ఫ్రంట్ నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర -రాష్ట్రాల మధ్య ఉండాల్సిన ‘సమాఖ్య స్ఫూర్తి’ని ప్రధాన ఆయుధంగా ఎక్కు పెడుతున్నారు. బిజెపి/నరేంద్రమోదీ వ్యతిరేకులందరినీ ఏకం చెయ్యాలని ఆయన చూస్తున్నారు. ఈ దిశగా,త్వరలో అన్ని ప్రాంతీయ,జాతీయ పార్టీల నేతలందరినీ కలుస్తానంటున్నారు.ఆ మధ్య చెన్నై వెళ్లి స్టాలిన్ ను కలిసివచ్చారు.మమతా బెనర్జీ, అఖిలేష్ తో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే అన్నట్లు ఇది ఆరంభం మాత్రమే. మార్చి 10 వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్, మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉంది. వాటిని బట్టి విపక్షాల నడక ఉంటుందని అర్ధం చేసుకోవాలి. ప్రస్తుతం వాటితో సంబంధం లేకుండానే కొంత ప్రయాణం ప్రారంభమైందని చెప్పవచ్చు. రూపుదిద్దుకొనే కొత్త కూటమికి కెసీఆర్ నాయకత్వం వహించే అవకాశాలను కొట్టి పారెయ్యలేం. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు కూడా అదే పనిచేశారు. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ‘నేషనల్ ఫ్రంట్’, చంద్రబాబు నాయకత్వంలో ‘యునైటెడ్ ఫ్రంట్’ రూపకల్పన జరిగాయి. విపి సింగ్ ప్రధానమంత్రి కావడంలో ఎన్టీఆర్, ఐకె గుజ్రాల్ ప్రధాని కావడంలో చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషించారన్న విషయం బహిరంగ రహస్యమే. అప్పుడు ఎన్టీఆర్ కు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది.గుజ్రాల్ సమయంలో నాకు కూడా ఆ అవకాశం వచ్చిందని చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. ఆ చరిత్రను గుర్తు చేసుకుంటే వారిరువురూ ‘కింగ్ మేకర్స్’ గానే మిగిలిపోయారు. వారిద్దరూ తెలుగువారు. ఇప్పుడు మరో తెలుగునేత కెసీఆర్ ఆ బాధ్యతను తలకెత్తుకున్నారు. అప్పుడు ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 42 లోక్ సభ స్థానాల బలం ఉండేది. ఇప్పుడు రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ బలం 17 స్థానాలు మాత్రమే.
Also read: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు
సంఖ్యాబలం ప్రధానం
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నా,అధికారంలోకి రావాలన్నా సంఖ్యాబలం చాలా ముఖ్యం. బిజెపిని అధికారానికి దూరం చెయ్యాలని బలంగా అనుకొనేవారిలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ మొదటి నుంచీ ముఖ్యులు. తెలంగాణతో పోల్చుకుంటే ఆ రెండు రాష్ట్రాల లోక్ సభ స్థానాలు చాలా ఎక్కువ. దేశ రాజకీయాలను శాసించడంలో ఉత్తరప్రదేశ్ పాత్ర ప్రధానమైంది. బిజెపితో హోరాహోరీగా పోరాడి పశ్చిమ బెంగాల్ లో మళ్ళీ అధికారాన్ని దక్కించుకున్న ధీరవనిత మమత. రేపటి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి అఖిలేష్ బలాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా మూడో ఫ్రంట్ నిర్మాణం దిశగా ఒక ప్రయత్నం ప్రారంభమైంది.
Also read: మోదీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం
మాటల మరాఠీ
దాని రూపురేఖలు, బలాబలాలు భవిష్యత్తులోనే అర్థమవుతాయి. కెసీఆర్ గొప్ప మాటకారి, ‘మాటల మరాఠి’ అనే పేరు ఎట్లాగూ ఉంది. వ్యూహప్రతివ్యూహాలన్నీ తెలిసినవారు.ఎన్టీఆర్, చంద్రబాబుతో పోల్చుకుంటే హిందీ,ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగలరు.కాకపోతే, మిగిలిన నాయకులకు విశ్వాసం కలిగించడంలో ఎన్టీఆర్ తో కెసీఆర్ ను పోల్చలేం. అన్నింటి కంటే ముఖ్యంగా కాంగ్రెస్ ను కలుపుకోకుండా కూటమి ఏ మేరకు విజయవంతంగా ముందుకు వెళ్తుంది? అనే ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి.అది జాతీయ స్థాయిలో రెండో పెద్ద పార్టీ. చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేకపోయినా, సీట్లు లేకపోయినా, ఓటుబ్యాంక్ ఉంది. కాంగ్రెస్ ను కలుపుకొని వెళ్లడం అనివార్యమని ఎక్కువమంది సూచిస్తున్నారు. ముఖ్యంగా శరద్ పవార్, స్టాలిన్ కాంగ్రెస్ ను దూరం చేయడానికి ఇష్టపడరనే అనుకోవాలి. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ అంత సుముఖంగా లేకపోయినా కాంగ్రెస్ విషయంలో మెత్తపడక తప్పదని రాజకీయ పండితులు అంటున్నారు. కెసీఆర్- కాంగ్రెస్ మధ్య తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ సఖ్యత లేదు. ఇటీవల రాహుల్ గాంధీపై బిజెపి నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల విషయంలో రాహుల్ కు కెసీఆర్ మద్దతుగా నిలిచారు. ఇవ్వన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం – కెసీఆర్ మధ్య మళ్ళీ ప్రేమలు మొలకెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
కింగా, కింగ్ మేకరా?
రాజకీయంగాఎప్పుడు ఏది అవసరమో అది చేసుకుంటూ పోవడం రాజకీయ నాయకులకు అభ్యాసంలో ఉన్న విద్యయే. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ, టీడీపి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘కొత్త కూటమి’లో కలుస్తారన్నది అనుమానమే. కెసీఆర్ ముందుగా తెలంగాణలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాల్సి ఉంది. బిజెపికి వ్యతిరేకంగా సాగడానికి వామపక్షాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని సీపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కలిసి ఓకే కూటమి కిందకు వస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద మూడో ఫ్రంట్ నిర్మాణం దిశగా కెసీఆర్ రూపంలో దేశ రాజకీయాల్లో సరికొత్త కాక మొదలైంది.
కెసీఆర్’కింగ్ మేకర్ అవుతారా, ‘కింగ్’ అవుతారా చూద్దాం.
Also read: సంజీవయ్య – ఒక సజీవ స్మృతి!