ఆయనో జమీందారు. మధ్య తరగతి తండ్రి. చిన్నాన్న, మామ, అన్న, బావగారు. సామాన్య సిపాయి నుంచి మహారాజు, నౌకరు నుంచి అత్యున్నతి హోదా కలిగిన అధికారి, సేవకుడి నుంచి జమీందార్..ఇలా పలురకాల పాత్రలకు ప్రాణం పోసిన నటుడు. సహజనటనా ప్రవీణుడు. పౌరాణికి, జానపద, చారిత్రక, సాంఘికాల్లో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ధుష్ట పాత్రల్లో ఎంత కరకుగా నటించారో, సాధు పాత్రలలో అంతే కరుణను కురిపించారు. రాక్షసరాజుగా పిడుగుల్లా గర్జించినట్లే రుషులు, దశరథ, ధర్మరాజు లాంటి పాత్రలలో తేనెజల్లులు కురిపించారు. ఆయనే `ఉమ్మడి` ఆస్తి…గుమ్మడి వేంకటేశ్వరరావు. ధర్మరాజు పాత్రధారణలో ఆయన ఇలాగే ఉండేవాడే భావిస్తారు. అందుకే `ధర్మరాజే ఈ జన్మలో మా గుమ్మడి గారయ్యారు` అంటారు ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ. నిరాడంబరత, అందరితో మంచిగా ఉండాలనుకోవడం ఆయన నైజం.
అదృష్టదీపుడి ‘అర్థాంగి’
గుమ్మడి తొలిచిత్రం `అదృష్టదీపుడు` కాగా ఆయన నటనా పటిమను వెలికి తీసింది మాత్రం 27 ఏళ్ల వయసులో నటించిన `అర్థాంగి`లోని జమీందారు పాత్ర. తనకంటే దాదాపు పదేళ్లు పెద్దవారైన శాంతకుమారికి భర్తగా, మూడేళ్లు పెద్దయిన అక్కినేనికి, ఏడాది పెద్ద జగ్గయ్యకు తండ్రిగా నటించి మెప్పించడం అప్పట్లో చిత్ర పరిశ్రమలో అసక్తికరమైన చర్చ. వయస్సుకు మించి పాత్రలు రావడానికి ఆ చిత్రమే కారణమని ఆయన తరచూ చెప్పేవారు. అసలు ఆయన నటజీవితమే వయసు మళ్లిన పాత్ర పోషణతో మొదలైంది. ఆయన తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో `పేదరైతు`అనే నాటకంలో ముసలి రైతు పాత్ర ధరించారు. ఆ మొదటి ప్రదర్శనకే బహుమతి వచ్చింది. చిత్రం రంగానికి బాట వేసింది. కథానాయక పాత్రలు ధరించవలసిన రోజుల్లో ముసలిపాత్రలు, క్యారెక్టర్ పాత్రలు ధరించవలసి రావడాన్ని సానుకూలంగానే తీసుకున్నారు. `బాల్యంలో దేవుడు మొదటిసారిగా ముసలి వేషం ఎందుకు వేయించాడో కానీ తర్వాత్తర్వాత ఆ వేషాలే ఎక్కువగా వేశాను. సినిమా రంగంలో అడుగు పెట్టగానే వేషాలు రావడమే అదృష్టం. క్యారెక్టర్ యాక్టర్లో ఉండే వైవిధ్యం, ఆ పాత్రలు ధరించడంలో ఛాలెంజ్ ఆకర్షించాయి. అలా ఎన్నో రకాల పాత్రలు పోషించే అవకాశం లభించింది. ఎందరో నాయికా నాయకులకు తండ్రి, మామగారిని అయ్యాను. తొలి చిత్రం `అదృష్టదీపుడు‘లో హీరో కాకపోయినా జీవితంలో మాత్రం అదృష్టం వరించింది` అని ఆనందంగా చెప్పేవారు.
Also Read : నాటి ‘కలలరాణి’ కాంచనమాల
`నిర్మాతల బలవంతం వల్ల దుర్మార్గపు పాత్రలు పోషించినా సాధు పాత్రల పోషణలో ఆయనకు ఆయనే సాటి. ఆయన నటనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఎందరు నటీనటులున్నా గుమ్మడి లేకుండా ఆయా చిత్రాల నటీనటవర్గ జాబితా పూర్తికాదు. ఒకవేళ పూర్తయినా ఆ లోటు అలాగే ఉంటుంది`అని ఆయనతో చిత్రాలు తీసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.
విమర్శతో పాటే ఆత్మపరిశీలన
ఏదీ మనసులో దాచుకోకపోవడం, ఎంతటి ఆత్మీయుడైనా లోపాలు ఉంటే మొహం మీదే చెప్పే తత్త్వం. నచ్చిన విషయాలను పొగడినట్లే నచ్చని వాటిని తెగడేందుకు వెనుకాడేవారు కాదు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. పలనా చిత్రంలో ఇది బాగుంది, ఇది బాగాలేదు అని నిర్మొహమాటంగా విశ్లేషించేవారు. వాటిని సూచనలు, సలహాలుగా తీసుకున్న సినీ ప్రముఖులూ లేకపోలేదు. పాత్రకు తగ్గట్లు నటీనటుల ఎంపిక ఉండాలి కానీ నటులకు వీలుగా పాత్రను మార్చే పద్ధతి ఆరోగ్యకరమైనది కాదనేవారు. అందుకు ఆంథోని క్విన్ లాంటి హాలీవుడ్ నటులను ఉదహరించేవారు. తనలోని లోపాలను ఒప్పుకునే విషయంలో తప్పించుకునే వారు కాదు. ఉదాహరణకు, చిత్తూరు నాగయ్య గారు ధరించిన `పోతన` పాత్రను తాను వేయవలసింది కాదని, అందుకే ప్రేక్షకులు ఆదరించలేదని భావించారు.. నాగయ్య గారిని కలసి `అపచారం` జరిగిపోయిందని వివరణ ఇచ్చుకున్నారు. దానికి నాగయ్య `ఒక సినిమా పోయిందంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. మీ సినిమాకు కూడా ఉన్నాయి. దానిని మీరు పరాజయంగా చూడకండి. మీ స్థాయిలో మీరు చక్కగా నటించారు. భక్తిరస ప్రధాన పాత్రలకు మీరు సరిపోరని అనుకుంటున్నారు కదా మరి మన కబీరు పాత్ర (రామదాసు) ఎంత బాగుంది? మీకు ఇంకొక మాట చెబుతాను. నాకే ఆర్థిక పుష్టి ఉంటే మళ్లీ మీతో ఆ పాత్ర వేయిస్తాను` అని ఓదార్చారు. ‘అంతగొప్ప నటుడి మాటలతో పరాపజయం బాధ నుంచి కోలుకున్నాను’ అని ఒక ఇంటర్వ్యూలో గుమ్మడి చెప్పారు. అంతేకాదు..నాగయ్య గారి మాటల్లో ఎంతో ఔన్నత్యం ఉందని, ఒక కళాకారుడికి అవసర సమయంలో ఎలా ధైర్యం నూరిపోయాలో ఇంకొక కళాకారుడకి తెలుస్తుందని, అలాంటి ఉన్నతుడు నాగయ్య గారని పరవశంతో చెప్పేవారు. అయినా, భక్తి శ్రద్ధలతో కష్టపడి చేసిన `పోతన` ఆదరణకు నోచుకోలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
`ఈడుజోడు`లో గుమ్మడి ధరించిన ముసలి భర్త పాత్రను హిందీలో నిర్మితమైన చిత్రంలో (కంగన్) అశోక్ కుమార్ నటించారు. తెలుగు సినిమా చూసిన ఆయన గుమ్మడి నటనకు ముగ్ధుడై అభినందించేందుకు వెళ్లారు. షూటింగ్ విరామంలో విశ్రాంతి తీసుకుంటున్న గుమ్మడి కోసం నిరీక్షించారు. తన కోసం మహానటుడు వేచి ఉన్నారన్న సమాచారాన్ని తట్టుకోలేకపోయారు గుమ్మడి. గుమ్మడికి ఆలింగన పూర్వక అభినందనలు తెలిపిన అశోక్ కుమార్, తన సరదా కోసం ఆ చిత్రంలో నటించాలన్న కోరగా, గుమ్మడి అందులో చిన్న పాత్ర పోషించారు.
ప్రతిభకు జేజేలు
ఎవరిలో ఏ చిన్న ప్రతిభ ఉన్నా నలుగురికి చెప్పి ఆనందించే తత్త్వం. మంచి సినిమా అనిపిస్తే చూడండంటూ సూచించేవారు. మంచి పుస్తకాన్నిచదవండని ప్రోత్సహించేవారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో గురువు మాధవపెద్ది వెంకట్రామయ్య గారికి తగిన శిష్యుడనిపించుకున్నారు. అనంతర కాలంలో గొప్ప నటుడిగా నీరాజనాలు అందుకున్న ధూళిపాళ సీతరామ శాస్త్రి అద్భుతంగా నటించిన `రోషనార` నాటకాన్ని చూసి దర్శక నిర్మాత బీఏ సుబ్బారావుకు చెప్పడంతో `భీష్మ`లో దుర్యోధన పాత్రతో సినిమా రంగానికి పరిచయం చేశారు. అందులో గుమ్మడి `కర్ణుడు`గా నటించారు. ప్రముఖ రంగస్థల నటులు కె.వెంకటేశ్వరరావు, రచయిత మోదుకూరి జాన్సన్ తదితరులు సినీ రంగ ప్రవేశానికి పరోక్షంగా సహకరించారు.
మోదం-ఖేదం
`మహామంత్రి తిమ్మరుసు` చిత్రం ఆయన జీవితంలో మరో మలుపు. చిత్తూరు వి. నాగయ్య, ఎస్వీ రంగరావు లాంటి వారు ఉండగా ఆ పాత్రకు తననే ఎంపిక చేయడం (అప్పటికీ నాగయ్య తిమ్మరుసుగా `తెనాలి రామకృష్ణ` వచ్చింది) అదీ ఎన్టీఆర్ రాయల వారి పాత్ర పోషిస్తున్నా చిత్రానికి `తిమ్మరుసు` అని తన పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం తన పూర్వజన్మ సుకృతం అనేవారు గుమ్మడి. ఆచార్య సినారె అన్నట్లు `గుమ్మడి గారు నటించిన బహుముఖీన పాత్రలకు `తిమ్మరుసు` గోపుర శిఖరంలాంటిది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. ఆనాటి సభకు అనుకోని అతిథి, ప్రధాని పండిట్ జవహర్ లాల్ ఆగమనాన్ని `తీపి గుర్తు`గా, ఆ తరువాత పది రోజులకే ఆయన అస్తమించడం `చేదు జ్ఞాపకం’ గా చెప్పేవారు.
ఆర్జన కాదు… కళ ముఖ్యం
అక్షరం పొల్లు పోకుండా సంభాషణలు పలకగల అతి కొద్దిమంది నటుల్లో ముందు వరుసలో ఉంటారు గుమ్మడి. నటనకు శరీరం ఎంత సహకరించినా గాత్రశుద్ధి లేకపోతే అది రాణించ దన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆంగికవాచికాభినయాలు సమపాళ్లలో రక్తికట్టించ గలగాలని అనేవారు. అందుకు నటనలో తన గురువు మాధవపెద్డి వెంకట్రామయ్యను స్ఫూర్తిగా చెప్పేవారు. భాష, వాచకం పట్ల ఆయనకు నిబద్ధత ఉంది. తాను నటించిన ఒక చిత్రంలోని పాత్రకు అనారోగ్యం కారణంగా సంభాషణలు చెప్పలేని దశలో ఇతరులు గాత్రదానం చేయడాన్ని చిన్నతనంగా భావించారు. `అరువు గొంతుతో జనాన్ని మోసం చేయాల్సిన పనిలేదు. ఇలా నటించాల్సిన అవసరమూ లేదు` అన్న నిర్ణయంతో నటనకు స్వస్తి చెప్పారు. అందుకు ఆయన దిగులు చెందలేదు. సంపాదించిన దానితో సంతృప్తి చెంది విశ్రాంతి జీవితాన్ని ఆనందంగా గడిపారు. నటనకు స్వస్తి చెప్పాక ఎక్కువగా పుస్తకపఠనంలో నిమగ్నమయ్యారు. నిష్కల్మంగా జీవిస్తూ, సాధ్యమైతే ఇతరులకు సాయపడడంలోనే నిజమైన ప్రశాంతత, ఆనందం లభిస్తుందని చెప్పిన గుమ్మడి ఆచరించి చూపారు.
మైత్రీ… మానవ సంబంధాలు
సంపాదనకంటే మానవ సంబంధాలు, మైత్రికి ప్రాధాన్యం ఇవ్వాలని, వాటితో డబ్బుతో ముడివపెట్టకూడదనే వారు. అందుకో ఉదాహరణ…1970వ దశకంలో అగ్రనటులు నందమూరి, అక్కినేని చిన్నపాటి భేదాభిప్రాయాలు రావడం వెనక ఈయన ప్రమేమం ఉందన్న అపోహతో ఎన్టీఆర్ రెండుమూడేళ్లు గుమ్మడితో నటించలేదు. అపోహలు వీడాక, ఎన్టీఆర్ సొంతచిత్రం `దానవీరశూరకర్ణ`లో పరశురాముని పాత్ర ఇచ్చారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ పారితోషికం ఇవ్వబోతే మృదువుగా తిరస్కరించారు.`అదేమిటి`అన్న ఎన్టీఆర్ ప్రశ్నకు `వెనుకటి ఆత్మీయతానురాగాలు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందామని నటించాను. డబ్బు కోసం కాదండి` అన్న జవాబుతో ఆ మహానటుడు కరిగి నీరయ్యారట.
అలాగే ఏవైనా కార్యక్రమాలకు విరాళాలు వసూలు చేసే సమయంలో ముందుగా తమ వంతు సాయాన్ని ప్రకటించి మిగతా వారిని అడిగేవారు. హడావిడి జీవనంలో ఆచార, సంప్రదాయాలకు దూరమవుతున్నామని, పక్క వారి గురించి ఆలోచించే సావకాశం కూడా లేకుండా పోతోందని అనేవారు.
గుమ్మడి జనన మరణాల తిథి కూడా ఒకటే కావడం కాకతాళీయం. ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి)నాడు కళ్లు తెరిచిన ఆయన మాఘ ఏకాదశి (భీష్మ ఏకాదశి)నాడు కన్నుమూశారు.
Also Read : మొండిబారుతున్న ‘ఓటరాయుధం’
అభినయంలో అతిశయం, వాచకంలో ఆడంబరం ప్రధర్శించడమే మహానటన అనుకునే కాలంలోనూ సహజత్వాన్ని అంటిపెట్టుకొన్న ఆయనకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రత్యేక పుట ఉంది.
`మనసేమో పచ్చలమడి
మాటేమో రవ్వల సడి
మారని సౌజన్యానికి
మరోపేరు మా గుమ్మడి`అని సినారె.
`పాత్రపోషణలో మంచి చెడ్డల ఉమ్మడి
నేత్ర పర్వంగా రచిస్తాడు శ్రీ గుమ్మడి
నానాటికీ తనకు తానే వరవడి
నటనలో దిద్దుకుంటున్నాడు ఒక్కుమ్మడి` అని ముళ్లపూడి అల్లిన కవితలు గుమ్మడి వ్యక్తిత్వ, నటజీవితాలకు మ(మె)చ్చుతునకలు.
(జనవరి 26 గుమ్మడి వర్ధంతి సందర్భంగా)