ఎన్ని సినిమాలలో నటించాం.. ఎన్నిపాత్రలు పోషించామన్నది కాదు. చిత్రపరిశ్రమలోని దిగువ శ్రేణి కళాకారులకు ఏం చేశామనేది ముఖ్యం’ అన్నదని ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకరరెడ్డి భావన. ఆ తపనకు ప్రతిరూపమే హైదరాబాద్ లోని నేటి `డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి`.ఈ కాలనీ కోసం తన పదెకరాలను భూమిని ఉచితంగా ఇచ్చేశారు. భాగ్యనగరంలో సినిమా పరిశ్రమ కాళ్లూనేందుకు అగ్రనటులు, అగ్ర నిర్మాతలు స్టూడియోలు నిర్మించగా, ప్రభాకరరెడ్డి చిన్నకళాకారుల సంక్షేమంపై దృష్టి పెట్టారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా కౌసల్య దంపతులకు 1935 అక్టోబర్ 8న తుంగతుర్తిలో జన్మించిన ప్రభాకరరెడ్డి సొంతూరులోనే ప్రాథమిక విద్య, హైదరాబాద్ లోని సీటీ కాలేజీలో ఇంటర్మీడియట్, ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు
సినీ రంగప్రవేశం
గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన చివరకు మగిలేది (1960)తో చిత్రరంగ ప్రవేశం. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారా యణరావు ఆ చిత్ర నిర్మాతలలో ఒకరు కావడం గమనార్హం. సుమారు మూడున్నర దశబ్దాలకుపైగా నట జీవితంలో 500కు పైగా సినిమాల్లో నటించారు. అదే జిల్లా నుంచి చిత్రపరిశ్రమకు వచ్చిన టీఎల్ కాంతారావు తరువాత అంత పేరు పొందిన నటుడు ప్రభాకరరెడ్డి.
కథకుడిగా….
ప్రభాకరరెడ్డి అభిరుచి గల కథకుడు, నిర్మాత కూడా. పండంటి కాపురం, గాంధీపుట్టిన దేశం, నాకూ స్వాతంత్ర్యం వచ్చింది, పచ్చనిసంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, కార్తీకదీపం లాంటి తదితర 21 చిత్రాలకు కథలు అందించారు. వాటి ఆధారంగా నిర్మితమైన చిత్రాలకు ఎక్కువగా లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించారు. ఆయన ప్రతిభను గుర్తించడంలో ముందుండే వారని చెబుతారు.గీత రచయితగా పేరు తెచ్చుకున్న ఎం. గోపి అందుకు ఉదాహరణ. ఒక ప్రసిద్ధ గీతకర్త ’పండండి కాపురం` సినిమాకు సకాలంలో రచన అందచేయలేదట.అదే సమయంలో కార్యాలయంలోనే సహాయుడిగా ఉండే యువకుడు తరచూ గీతాలు రాయ డాన్ని సన్నిహితులు గుర్తు చేయడంతో పాట (మనసే కవ్వించకే నన్నిలా. ..) రాయించారు.గోపిఅనంతర కాలంలో ఆయన మంచి కవిగా గుర్తింపుపొందారు.
పురస్కారాలు
`యువతరం కదిలింది`(1980),`పల్లె పిలిచింది` చిత్రాలకు (1981) ఉత్తమ నటుడుగా నంది పురస్కారం, `చిన్నకోడలు (1990)లో చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం,` గాంధీపుట్టిన దేశం, గృహప్రవేశం` చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారాలు అందుకున్నారు.
మంచి వైద్యుడు…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననే మూస ప్రకటనలకు ఆయన అతీతులు, వైద్యం చదివిన తరువాతే నటుడయ్యారు. నటవృత్తిలో ఉంటూనే వైధ్యం కొనసాగించారు.ఆయన తొలిచిత్రంలోనే వైద్యుడి పాత్ర ధరించడం కాకతాళీయమే. అందులో మానసిక వైద్యుడిగా నటించిన ఆయన తరువాతి చిత్రాలలో ప్రతి నాయకుడిగా, గుణచిత్ర నటుడిగా చేశారు.ఈయన కాలంలో (1960, 70 దశకాలలో) కైకాల సత్యనారా యణ, త్యాగరాజు, ప్రభాకరరెడ్డిని ప్రతినాయకత్రయంగా చెప్పుకునే వారు. ప్రభాకరరెడ్డి 1997 నబంబర్ 26న 62వ యేట కన్నుమూశారు.
( నవంబర్ 25 ప్రభాకరరెడ్డి వర్ధంతి)