Thursday, November 7, 2024

నిన్న – నేడు – రేపు

చూడు ఆమె అతని భుజంపై వ్రాలి వున్నది

నిన్న నా బుజంపై వ్రాలింది

రేపు మరొకడి బుజంపై వ్రాలుతుంది!

చూశావా! ఆమె అతడి ప్రక్కన కూర్చుని ఉన్నది

నిన్న నా ప్రక్కన కూర్చున్నది

రేపు మరొకడి ప్రక్కన కూర్చుంటుంది!

చూస్తున్నావా! అమె అతని కలశంలోని పానీయం రుచి చూస్తున్నది

నిన్న నా కలశంలో రుచి చూచింది

రేపు మరొకడి పాత్రలో పాలు పంచుకుంటుంది!

చూశావా! ఆమె అతనివైపు చూస్తున్నది

ప్రేమ పూరిత నయనాలతో

నిన్న అదే ప్రేమతో నన్ను వీక్షించింది

రేపు అలానే మరొకడి వైపు చూస్తుంది!

ఆలకించు ఆమె అతని చెవిలో పాడే ప్రేమగీతాలను

నిన్న ఆ ప్రేమగీతాలనే ఊదింది నా చెవిలో

రేపు వినిపిస్తుంది వాటినే మరొకడి చెవిలో!

చూడు! ఆమె అతడిని కౌగిలించుకోవడం

నిన్న అలాగే కౌగిలించుకొంది నన్ను

రేపు వ్రాలుతుంది మరొకడి చేతుల్లో!

ఎవరో ఈ వింత వనిత?

ఆమే జీవితం!

ఆంగ్ల మూలం: ఖలీల్ జీబ్రాన్

అనువాదం: ఎల్. మాలకొండయ్య

ప్రాపంచిక వ్యామోహాలకు మానవులెంత దాసోహ మౌతారో, వారు కోరుకొనే భోగభాగ్యాలెంత క్షణికమైనవో, చంచలమైనవో, యుగ యుగాలుగా వేదాంతులు మనకు బోధిస్తూనే వున్నారు. చంచలమైన సిరి సంపదలకు, క్షణభంగురమైన జీవితానికీ,  విలాసవతియైన ఒక యువతిని ప్రతీకగా చేసుకొని ఖలీల్ జిబ్రాన్ రచించిన నేటి  కవిత ఎంతో ఆసక్తికరం.

Also read: చెఱువు

మానవాళి సదా స్మరించదగిన అనేక జీవనసత్యాలను రసరమ్యమైన తన రచనల ద్వారా ఆవిష్కరించిన వాడు ఖలీల్ జిబ్రాన్. ఆయన లెబనాన్ దేశస్థుడు.

మహాకవి, చిత్రకారుడు, మార్మికుడు (మిస్టిక్), వేదాంతి, స్వేచ్ఛాప్రియుడు, విశ్వమానవుడు, ఖలీల్ జీబ్రాన్. ప్రాఫెట్ గ్రంధంలోని ఆల్ ముస్తఫా పాత్ర  వర్ణన రచయిత జిబ్రాన్ కు సైతం అక్షరాలా వర్తిస్తుంది:

“Al Mustafa,

the chosen and the beloved,

a dawn unto his own day”

(Prophet/Kahlil Jibran).

దీనికి కాళోజీ తెలుగుసేత చూడండి:

“అతని పేరు ఆల్ ముస్తఫ

ఎన్నికైన మిన్న అతడు

అందరి ప్రేమకు పాత్రుడు

తానుండిన కాలానికి 

తానే ఉషస్సైన వాడు.”

(జీవనగీత/కాళోజీ).

క్రొత్తలో తన రచనలను అరబిక్ భాషలో సాగించినా, తర్వాత ఆంగ్లాన్నే తన మాధ్యమంగా జీబ్రాన్ ఎన్నుకున్నాడు. దాదాపు వంద ఏండ్ల నాటి ఆయన రచనలు పలు ప్రపంచభాషల్లోకి అనువదింప బడినవి. నేటికీ అనువదింప బడుతూనే వున్నవి. ఆధునిక మానవ సమాజాన్ని అమితంగా ప్రభావితం చేసిన కొద్దిమంది రచయితల్లో జిబ్రాన్ కూడా ఒకడు.

“ప్రాఫెట్ ” అనే మకుటంతో వెలువడ్డ జిబ్రాన్ పుస్తకం కాపీలు మిలియన్ల కొద్ది దేశదేశాల్లో అమ్ముడు పోయినవి. అనేక పునర్ముద్రణలకు నోచుకుంటూ, ఇప్పటికీ అమ్ముడు పోతూనే వున్నవి.

Also read: కృపజూడు భారతీ

ప్రముఖ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ తన ఆత్మకథలో ఇట్లా అన్నాడు: “నా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన విషయాలు మూడు. మొదటిది తరగని జ్ఞానతృష్ణ. రెండవది పీడిత మానవాళిపై అచంచలమైన జాలి. స్త్రీజాతిపై ప్రేమ”.

బహుశా ఇదే దృక్పథం జీబ్రాన్ లోనూ వుండవచ్చు. ప్రాఫెట్  లోని ఆల్ ముస్తఫా పాత్ర నోట, నిసర్గ  సుందరమైన భాషలో జీబ్రాన్ వెల్లడిస్తూ పోయే జీవన సత్యాలు, విశ్వజనీనములు, సర్వకాలీనములు.

“ప్రాఫెట్” పుస్తకం తొలి సారి నల్లని కాలికో బైండ్ అట్టతో వెలువడింది. బైబిల్ గ్రంధం ఒకప్పుడు నల్లని కాలికో బైండింగ్ కలిగి వుండేది. బైబిల్ తరహాలోనే నల్లని అట్టతో  వెలువడ్డ “ప్రాఫెట్” పుస్తకాన్ని,  ఆ పుస్తకంలో గల మానవతా కోణాన్ని, సత్యసౌందర్యాలను, మరీమరీ పఠించి ఆనందా శ్చర్యాల్లో మునిగిపోయిన  పాశ్చాత్య లోకం, ఈ పుస్తకాన్ని  బ్లాక్ బైబిల్ గా అభివర్ణింప సాగింది. అనగా బైబిల్ తో సమానంగా ఈ పుస్తకాన్ని ఆ నాటి సమాజం ఆదరించిందన్న మాట. “ప్రాఫెట్” కీర్తితో పాటు దాని రచయిత జీబ్రాన్ యశస్సు కూడా  ఆచంద్ర తారార్కమై భూతలాన స్థిరపడి పోయింది.

కవి అన్నవాడికి ప్రతిభతో పాటు వ్యుత్పత్తి (శిక్షణ) వుండి తీరాలని మహాకవి శేషేంద్ర అంటారు. ఒక్క డీ హెచ్ లారెన్స్ వంటి అద్వితీయ ప్రతిభావంతులకు మాత్రమే ఈ సూత్రం వర్తించదని ఆయన అన్నాడు. అట్టి అఖండ ప్రతిభావంతుల కోవకు జిబ్రాన్ కూడా చెందుతాడు.

యతి, ప్రాస, ఛందస్సు అనే నియమాలకు అతీతమైనది సున్నితమైన ఖలీల్ జీబ్రాన్ రచనాశైలి. నిసర్గ సుందర ధారతో పారే అందమైన సెలయేరు వంటిది జీబ్రాన్ రచన.

కాళోజీ మొదలుకొని సినారే వరకూ, జిబ్రాన్ రచనలను తెలిగించిన వారిని, వ్రేళ్ళమీద లెక్కించవచ్చు. ఎల్ మాలకొండయ్య గారు కూడా  విశిష్ఠమైన ఆ జాబితాలో చేరుతారు.

“నిన్న నేడు రేపు” అనే నేటి అనువాదకవిత మాలకొండయ్య గారి “న్యాయానికి నోరు” అనే సంకలనం నుండి స్వీకరించినది. ఛందోనియమాలు లేని సరళమైన అనువాదమిది. జీబ్రాన్ అనుభూతికి, రచనా సారళ్యానికి, మూలంలో జిబ్రాన్ వ్యక్తీకరించిన భావనలకు  సన్నిహితమైనదీ అనువాదం.

మాలకొండయ్య గారు ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా వివిధ పదవుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారు.  బహుభాషావేత్త యైన మాలకొండయ్య గారికి కవిత్వం ప్రవృత్తి.

Also read: శాంతి యాత్ర

ఈ సంకలనానికి ముందుమాట వ్రాసిన వారు ప్రముఖ మేధావి, పాత్రికేయుడు, తెలుగునాట ఒకానొకప్పటి  పత్రికా సంపాదకుల్లో అగ్రగణ్యునిగా పేరు పొందిన వాడు, నార్ల వెంకటేశ్వరరావు గారు. మాలకొండయ్య గారి సంకలనానికి నార్లవారి ముందుమాట లోని  కొన్ని పంక్తులను స్మరిద్దాం:

“ఖలీల్ జీబ్రాన్ మిస్టిక్ కవి. తనకు సమకాలికులుగా చెప్పదగు ప్రాచ్యకవులలో ఆయన ఇక్బాల్, టాగోర్ ల కోవకు చెందినవాడు.”

“యుగధర్మానికి భిన్నంగా వెళ్ళి, మిస్టిక్ కవిత్వాన్ని వ్రాసినా, జిబ్రాన్ స్పష్టతను, సారళ్యాన్ని, పుష్కలంగా సాధించాడు. జాతీయ ధర్మాన్ని ఆయన నిష్ఠతో పరిపాలించాడు. ఆయన లెబనాన్ లో జన్మించాడు. అది ఎంత చిన్న దేశమో, అంత ప్రాచీన దేశం. అది ప్రాచీనతకే కాదు, ప్రకృతి సౌందర్యానికీ, పేరొందిన దేశం. ఒకే ఒక సారి ఒక పగలులో సగం మాత్రమే ఆ దేశంలో నేను గడపడం తటస్థించింది. ఆ కొద్ది గంటల్లో బేరూట్ ను సందర్శించాను. బిబ్లోస్ లోకి తొంగి చూచాను. ఇటు చూసినా, అటు చూసినా, ఎటు చూసినా పచ్చని కొండలు. నీలి కడలి. ఆ పరిసరాల్లో దిశాచక్రాన్ని దాటి అనంతంలోకి మన దృక్కులు దూసుకొని పోతుంటాయి. అందువల్లనే కావచ్చు, లెబనాన్ లో ప్రవక్తలు పెక్కుమంది జన్మించారు. మిస్టిక్ దృక్పథానికి ప్రోది చేశారు.”

“జిబ్రాన్ ప్రవక్త కాక పోవచ్చును కానీ, ఆయన నిశ్చయంగా మిస్టిక్. అయితే, పాత ధోరణి లోని మిస్టిక్ కాడు. మతానికీ ఆయన విరోధి కాడు. అయితే మతం గీసే గీతలోపల ఆయన నిలువలేక పోయాడు. మతం పెట్టే విధి నిషేధాలకు ఆయన తల వంచలేక పోయాడు. అందువల్ల ఆయన సిరియన్ క్రిస్టియన్ చర్చికి దూరంగా జరిగిపోయాడు. ఆదిలో ఆయన పారిస్ లో స్థిరపడాలని అనుకొన్నాడు. కానీ, అక్కడైనా ఎక్కువకాలం పాటు నివసించలేక, తన జీవితకాలంలో చివరి రెండు దశాబ్దాలను అమెరికాలో గడిపాడు.”

Also read: నా తెలంగాణా

“జిబ్రాన్ మొత్తం జీవితకాలం పట్టుమని అయిదు దశాబ్దాలైనా కాదు. అయినా ప్రపంచం మొత్తంమీదనే గణుతింపదగు ఒక మహాకవి ప్రతిపత్తిని ఆయన సాధింపగలిగాడు. ఆయనకు నోబేల్ బహుమానం వచ్చి వుండక పోవచ్చు గానీ మహాకవి ప్రతిపత్తికి ఆ బహుమానమే ఒక గీటురాయి కాదు.”

“ఆదిలో జిబ్రాన్ అరబిక్ భాషలో వ్రాశాడు. తర్వాత ఇంగ్లీషులో రచనలు చేశాడు. ఈ విషయంలో సైతం ఆయన ఇక్బాల్ ను, టాగోర్ ను, జ్ఞాపకానికి తెస్తాడు. అన్నట్లు, ఇక్బాల్ కవి మాత్రమే. చిత్రకారుడు కాదు. వృద్ధాప్యంలో టాగోర్ చిత్రరచనను ప్రారంభించి, ఆ కళలో సైతం విఖ్యాతిని సముపార్జించు కొన్నాడు. ఆది నుండి జిబ్రాన్ చిత్రకారుడు. ఆయన కవితలలో వలె ఆయన చిత్రాలలో సయితం మిస్టిసిజం తొణికిస లాడుతూ వుంటుంది.”

“జిబ్రాన్ రచనల అనువాదాలు ఆయన జీవితకాలంలోనే ఇరవై భాషలలో వెలువడినవి. తెలుగులోకి జిబ్రాన్ ను తెచ్చిన వారిలో శ్రీ మాలకొండయ్య బహుశా రెండవవారు. లేదా మూడవవారు.”

“తన కళ్ళ ముందు ఏవో దృశ్యాలు గిరగిరా తిరిగి పోతున్నప్పుడు, తన హృదంతరం లోపల ఏవో ప్రేరణలు కళపెళ ఉడుకుతున్నప్పుడు, వాటిని వ్యక్తీకరించడానికి కావలసిన భాష తనంత తానుగా పెల్లుబికి వస్తుంది. ఇది మౌలిక రచనలో గల సౌలభ్యం. ఈ సౌలభ్యం అనువాదాలలో రాదు. అందువల్ల మౌలిక రచనలను చేయడం కంటే అనువాదాలు చేయడం కష్టతరం.”

“జిబ్రాన్ రచనలలో మానవతకే ప్రాధాన్యమిస్తున్న రచనలను మాలకొండయ్య గారు ఎన్నుకున్నారు. సరళమైన భాషలో, సున్నితంగా, సుందరంగా అనువదించారు.”

నేటి పరిచయ ఖండికలో జీవితానికి పర్యాయపదంగా ఒక స్త్రీని జిబ్రాన్ ఎందుకు ఎన్నుకున్నాడు?

హైందవేతిహాసంలో అదితియే  లోకైక జనని. క్రైస్తవ విశ్వాసంలో ఈవ్ మానవకోటికే పితామహి. భగవంతుడు తినవద్దని నిషేధించిన ఫలాన్నే ఈవ్ భుజిస్తుంది. దానితో విపరీతమైన పరిణామాలు సృష్టిలో సంభవిస్తాయి.  అమాయకమైన లోకం కపటము, మోసము, నేర్చుకొని చెడిపోతుంది.

 జీవన సంసారానికి మహిళయే ఆధారశిల. “సంసారం, ప్రేమ సుధాపూరం, నవజీవన తీరం” అని ఒకనాటి సినీకవి భావించినాడు. మరొకవైపు, “సంసారం సాగరం దుఃఖం! తస్మాత్ జాగ్రత!” అంటూ  సనాతనులు  యుగ యుగాలుగా మానవాళిని హెచ్చరిస్తూనే వున్నారు.

Also read: ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం

సంసారానికి ఆనందసేతువు, దుఃఖహేతువు కూడా మహిళయే. సౌందర్యానికి అవధీ, సౌందర్యం వల్ల బాధితురాలు సైతం మహిళయే. స్తన్యమిచ్చే తల్లి, ప్రేమను పంచే పత్నీ మహిళయే. పురుషుణ్ణి బాగుపరచేదీ, చెడగొట్టేదీ మహిళయే. భూతల సృష్టిలో ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించే మహిళామణినే  “జీవితా”నికి ప్రతీకగా ఖలీల్ జిబ్రాన్ నేటి ఖండిక లో స్వీకరించడంలో, నిస్సందేహంగా గంభీరమైన అర్థాలు దాగి వున్నాయి.

నేటి కవితాఖండిక మకుటం: “నిన్న నేడు రేపు”. ఇదే పేరుతో దశాబ్దాల క్రిందట ఒక హాలీవుడ్ సినిమా విడుదలైంది. దాని పేరు” Yesterday, today and tomorrow. ఇందులో నాయికగా ఇటాలియన్ అభినేత్రి సోఫియా లారెన్ అద్వితీయ నటన ప్రదర్శించింది. ఆ చలనచిత్రంలో నిన్నటి కథలోని మహిళ, నేటి కథలోని మహిళ, రేపటి కథలోని మహిళ కూడా, ఒకరే. ఒకత్తెయే  పునఃపునః జీవించి మగవారిని తన అందచందాలతో సెడ్యూజ్ చేయడం ఈ సినిమా ఇతివృత్తం.

అమెరికాలో వున్న బోస్టన్ నగరం ఖలీల్ జిబ్రాన్ చివరి ఆవాసం. కృతజ్ఞతా పూర్వకంగా ఆ నగరవాసులు జిబ్రాన్ ను స్మరించుకున్నారు. బోస్టన్ లో శీతల వృక్షచ్ఛాయల్లో, పచ్చికల మధ్యా, జిబ్రాన్  స్మారక ష్థలమున్నది. అందమైన గ్రానెట్ రాయితో చేసిన దీర్ఘచతురస్రాకారపు అరుగు ఆ స్మారకస్థలిలో వున్నది. ఆ అరుగే జిబ్రాన్ జ్ఞాపక చిహ్నం.

ఆ అరుగుకొక పార్శ్వాన జిబ్రాన్ కొటేషన్ ఒకటి ఉన్నది:

IT WAS IN MY HEART TO HELP A LITTLE BECAUSE I WAS HELPED MUCH.

అదే అరుగు పైభాగాన బోస్టన్ నగరం జిబ్రాన్ తో తనకు గల బాంధవ్యాన్ని ఇట్లా స్మరించింది:

“Kahlil Gibran, a native of Besharri, Lebanon, found literary and artistic sustenance in the Denison Settlement House, the Boston Public Schools and the Boston Public Library. A grateful city acknowledges the greater harmony among men and strengthened universality of spirit given by Kahlil Gibran to the people of the world in return”

 నా స్నేహితులొకరు ఇటీవలే  తన కూతురితో సహా ఆ స్మారక స్థలాన్ని దర్శించి, ఇరువురూ ఆ సమాధి వద్ద తీయించుకున్న ఫోటో  నాకు పంపినారు. ఫోటో క్రింద ఈ వాక్యం వున్నది: “జిబ్రాన్ ను, డాస్టవిస్కిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలతో!”.

అత్యంత నిరాడంబరమైన స్మారక స్థలం.

పిజ్జాలు, షాపింగ్ మాళ్ళు, ఔటింగ్లు, పబ్బులు, ఫాస్ట్ లైఫ్, హైదరాబాదు ఆధునిక సంస్కృతికి పర్యాయ పదంగా మారిపోతున్న నేటి రోజుల్లోనూ

“జీవితపు చేతగానితనపు వానాకాలపు బురద మధ్య

 వాడకుండా నిలిచిన పువ్వుల గుత్తిలాగ” జంటనగరాల గతనాళ్ళ ఆనవాళ్ళు ఇంకా కొన్ని అట్లే వున్నాయి.

ఆ  అలవాట్లలో ఒకటి “పుస్తకాలపై ప్రేమ”. ముఖ్యంగా “పాత పుస్తకాలపై మక్కువ”.

ప్రతి రవివారం నిర్మానుష్యమై పోయే భాగ్యనగరపు అబిడ్స్ కూడలి కొక ప్రత్యేకత ఉన్నది.

ప్రతి ఆదివారం ఈ అబిడ్స్ కూడలి నలువైపులా పేవ్ మెంట్లపై పాతపుస్తకాలు దారికి నలువైపులా పరుస్తారు. వాటి విక్రేతలు, వాటిని కొనుగోలు చేయడానికై వచ్చే మానవ సమూహం, కమనీయమైన ఈ దృశ్యంం ప్రతి రవివారం అబిడ్స్ కూడలికి శోభను సంతరిస్తుంది. ఢిల్లీలోని అజ్మల్ ఖాన్ రోడ్డు కూడలిలో, ముంబయి ఫ్లోరా ఫౌంటెన్ వద్దా, బెంగళూరు లోని బ్రిగేడ్ రోడ్డు వద్దా, పాతపుస్తకాలు లభిస్తాయి గానీ, హైదరాబాద్ ఆదివారం నాటి పాతపుస్తకాల విక్రయ శోభయే వేరు.

 క్రొత్త పుస్తకాలు కొనడంలో కలగని అనుభూతి ఈ పాత పుస్తకాలు ఖరీదు చెయ్యడంలో, ఖరీదు చేయకపోయినా కనీసం చనిన నాళుల వాసనలు పీలుస్తూ, ఆ పాత పుస్తకాల కాలికో అట్టలను, వాటిలోని దళసరి పేజీలను, ఆ పేజీలలోని పాతకాలపు ప్రింటును, పుస్తకాలపై పాత యజమానుల సంతకాలను, పేజీల నడుమ వారు దాచుకున్న జ్ఞాపకాల చిహ్నాలను తడిమి చూడడంలో వున్నది.

అబిడ్స్ కూడలిలో పావురాన్ని ఎగురవేస్తూ, ఎగురవేస్తూ, పావురంతో సహా, కాంస్య విగ్రహం రూపంలో స్థాణువై పోయిన జవహర్ లాల్ నెహ్రూ సైతం ఈ తతంగమంతా చూస్తూ చిరునవ్వులు చిందుతూనే వుంటాడు. ప్రపంచ పుస్తక ప్రేమికుల్లో నెహ్రూజీ కూడా ఒకడు. ఆయన ఆలోచనాపరిధి విస్తృతం. ఆయన రచనాశైలి అనితర సాధ్యం. న్యూఢిల్లీ లోని అయన అధికార నివాసం “తీన్ మూర్తి భవన్”  ఇప్పుడది ఆయన స్మారకమందిరం. ఆ నివాసంలో ఆయన సేకరించిన పుస్తకాలు అసంఖ్యాకమైనవి.

అబిడ్స్ కూడలిలోనే ఒకనాటి సంధ్యావేళ నార్ల వెంకటేశ్వరరావు గారిని చూసినాను. ఆజానుబాహువు. అప్పటికే  వృద్ధుడు. కంటి చూపు మందగించింది.  కూతురి చేతిలో చేయివేసి మెల్లగా అడుగులు వేస్తూ, ఒక చోట ఆగి, నేలపై పరిచిన పుస్తకాలను ఏరుకుంటూ, ఒక్కొక్కటి, శ్రద్ధగా పరికిస్తున్నారాయన.

నార్లవారి మేధ, పాండితీ ప్రతిభ, నిరంతర జ్ఞానాన్వేషణ, ఎంత ప్రసిద్ధమైనవో,  వేలకొలదిగా ఆయన సేకరించిన విలువైన పుస్తకాలు,   అవి భద్రపరచబడిన నార్లవారి వ్యక్తిగత గ్రంథాలయం కూడా ఎంతో ప్రసిద్ధి పొందినవి. నార్లవారి ఇంటిని దర్శించిన ప్రముఖ చిత్రకారుడు, తత్వవేత్త, సూర్యదేవర సంజీవదేవ్ గారీ గ్రంధాలయాన్ని గూర్చి ఇట్లా అన్నారు: “నార్లవారి ఇంట గ్రంథాలయం వున్నదని చెప్పడం కరెక్టు కాదు. ఒక పెద్ద గ్రంధాలయంలో నార్లవారి ఇల్లు వున్నదని చెప్పడమే సరియైనది.”

జిబ్రాన్ కవితను, దాని రమణీయానువాదంతో బాటు,, పండిట్ నెహ్రూను, సోఫియా లారెన్ ను, నార్లవారితో సహా స్మరించి, కృతార్థత గడించిన అనుభూతితో మనస్సు పరవశిస్తున్నది.

Also read: మనుచరిత్ర అవతారిక – కృష్ణరాయల పరిచయం

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles