————————-
(‘YESTERDAY, TODAY AND TOMORROW ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా సి. బి. చంద్ర మోహన్
50. సంచారి తత్త్వాలు
——————————–
నేను నా మిత్రునితో ఇలా అన్నాను.”ఆమె అతని భుజంమీద ఎలా వాలుతోందో చూడు! నిన్న నా భుజంమీద ఇలానే వాలింది.”
నా మిత్రుడు, ” రేపు నా భుజంమీద వాలుతుంది.” అన్నాడు.
నేను అన్నాను “అతని పక్కన దగ్గరగా ఎలా కూర్చొందో చూడు! నిన్ననే నా పక్కన దగ్గరగా కూర్చుంది!”
నా మిత్రుడు “రేపు ఆమె నాకు దగ్గరగా కూర్చుంటుంది!” అన్నాడు.
నేను “చూడు! అతని కప్పు నుండి వైన్ తాగుతోంది. నిన్ననే నా కప్పు నుండి తాగింది!” అన్నాను.
నా మిత్రుడు “రేపు నా కప్పు నుండి తాగుతుంది!” అన్నాడు.
అప్పుడు నేను అన్నాను “ఆమె అతన్ని మెరిసే కళ్ళతో ఎంత ప్రేమగా చూస్తోందో, చూశావా! నిన్ననే నన్ను అలా చూసింది!”
నా మిత్రుడు, ” రేపు నన్నలానే చూస్తుంది!” అన్నాడు.
నేను అన్నానూ, “ఆమె అతని చెవుల్లో ప్రేమ గీతాలు గుసగుసలాడుతోంది. వింటున్నావా? అవే గీతాలు నిన్న నా చెవులకు వినిపించింది.”
నా మిత్రుడు “రేపు ఆమె నా చెవుల్లో ఆ గీతాలు గుసగుసలాడుతుంది.” అన్నాడు.
నేను, “ఎందుకు! చూడు! ఆమె అతనిని ఆలింగనం చేసుకుంటోంది. నిన్ననే నన్ను ఆలింగనం చేసుకుంది.” అన్నాను.
నా మిత్రుడు అన్నాడు కదా!” రేపు నన్ను కౌగలించు కుంటుంది.”
అప్పుడు నేను అన్నాను “ఏమి వింత మనిషి!”
నా మిత్రుడు ఇలా జవాబిచ్చాడు “జీవితం లాగా ఆమె అందరు మగవారికీ వశమవుతుంది; మరణంలాగా ఆమె పురుషులందరినీ జయిస్తుంది. శాశ్వతత్వంలా ఆమె పురుషులందరినీ దగ్గరకు చేర్చుకుంటుంది!”
Also read: మార్పిడి
Also read: ప్రవక్త
Also read: మతం
Also read: ఇసుక పైన
Also read: దేహము– ఆత్మ