నిన్న పున్నమి
రాత్రంతా వెన్నెల్లో వేగి పోయాను
నిద్రలేని కళ్ళు నిండు చూలాల్లా నీరసంగా ఉన్నాయి
అద్దంలో మొహం చూశాను
అరె ……….. రెండు చంద్రుళ్ళు
ఏమిటిది?
వెన్నెల పూవులో పడుకోవడం నా కలవాటే
కాని ఇలా లేదు ఎప్పుడు
హో …. తెలిసింది.
రాత్రంతా నా రాణి గురించి ఆలోచిస్తున్నాను కదూ
ఈర్ష్య కొద్దీ రేరాజు నా కళ్ళ నిండా నిండాలని ప్రయత్నించినా
నా కనుపాప మధ్యలోనే ఉన్న నా రాణి ప్రభావానికి లోబడి
మిగిలిన చోటే సరిపెట్టుకున్నాడు
రాత్రితోపాటు రేరాజు పోయినా
నా రాణి నన్నొదిలి పోలేదు
పోతే నా రాణి ఎలా అవుతుంది
నేడు అమావాశ్య
చుట్టూ చిక్కటి చీకటి
కళ్ళు కనిపించడం లేదు
అందరూ నన్ను గుడ్డివాడంటున్నారు
నా కళ్ళలోని మశూచి పువ్వులు కనిపిస్తాయి వీళ్ళకు
వెన్నెల పువ్వులు కనిపించ వెందుకనో
కళ్ళులేకుండా నేను చూసేవి వీళ్ళకు కనిపించవు
హు ..గుడ్డివాళ్ళు
ఒకనాడు బాధ మండి చెప్పాను అప్పటికీ
నా మశూచి పువ్వుల వెనుక దాగిన రాసపూల గురించి
విన్నవాడు పిచ్చిగా నవ్వాడు
నాకు పిచ్చంటూ
పైగా ఆ వైజ్ఞాని అంటాడు
కనుపాప మధ్యలొ ఉండేది
రాసపువ్వు కాదు, శూన్యం అని.
Also read: దేవా
Also read: స్వేచ్ఛ
Also read: మానవ హక్కులు
Also read: బంధం
Also read: ప్రమిద