Sunday, December 22, 2024

రామకృష్ణ మిషన్ సేవా వికాసం!

వోలేటి దివాకర్

అంతర్జాతీయ ఆధ్యాత్మిక, మానవ వికాస సంస్థ రామకృష్ణ మఠానికి అనుబంధంగా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవా రంగాల్లో పనిచేస్తున్న రామకృష్ణ మిషన్ తన సేవా వృక్షాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇటీవల రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రంలో మఠం, మిషన్ ప్రధాన కార్యదర్శి స్వామి సువీరానంద 2022-23 వార్షిక నివేదికను ప్రకటించారు. ఈనివేదిక మిషన్ సేవా తత్పరతకు అద్దం పడుతుంది.

రామకృష్ణ పరమహంస

2022-23లో దేశంలోని 224 రామకృష్ణ మిషన్ కేంద్రాల ద్వారా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సహాయ, పునరావాసం, సాహిత్య ప్రచురణలకు రూ. 1171 కోట్ల నిధులను వెచ్చించినట్లు స్వామీ సువీరానంద వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్లోని జెల్పాయగురి జిల్లా సాహూడంగి హాట్, గుజరాత్ లోని భుజ్, తమిళనాడులోని చెంగం, తెలంగాణాలోని యాదాద్రి భువనగిరిలో కొత్త రామకృష్ణ మఠం కేంద్రాలను ప్రారంభించారు. బంగ్లాదేశ్ లోని బాలియాటీలో రామకృష్ణుల మందిరానికి సంప్రోక్షణ జరిగింది. అమెరికాలోని చికాగోలో హోమ్ ఆఫ్ హార్మొనీ అనే కొత్త యూనిట్ ను ప్రారంభించారు. ఇప్పటికే 24 దేశాల్లో 96 రామకృష్ణ మఠం, మిషన్ కేంద్రాలు నిర్వహిస్తుండటం అభినందనీయం.

పురస్కారాలు… ప్రశంసలు

మిషన్ సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు, ప్రశంసలు లభించాయి. మిషన్ సేవలను గుర్తించి కోల్కత్తా మహాత్మాగాంధీ సంగ్రహాలయం మహాత్మాగాంధీ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసింది. మైసూరు రామకృష్ణ ఆశ్రమం చేస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం అమృతమహోత్సవం పురస్కారాన్ని ప్రదానం చేసింది. మిషన్ నిర్వహిస్తున్న విద్యాసంస్థలు కూడా విద్యారంగంలో గీటురాళ్లుగా నిలుస్తున్నాయి. కోల్కత్తాలోని రహారాలో వివేకానంద సెంటినరీ కళాశాల, కోయంబత్తూరులోని మారుతీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్, ఆర్ట్స్ కళాశాలకు నేషనల్ ఎ సెస్మెంట్, అక్రిడేషన్ కౌన్సిల్(నేక్) ఎ డబుల్ ప్లస్, ఎ ప్లస్ గ్రేడ్లను ప్రకటించడం విశేషం. నరేంద్రపూర్ లోని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయంలో చదివిన విద్యార్థి పదోతరగతి పరీక్షల్లో పశ్చిమబెంగాల్లోనే టాపర్ గా నిలిచాడు.

స్వామీ వివేకానంద

కేంద్ర విద్యాశాఖ మల్టాలోని రామకృష్ణ మిషన్ పాఠశాలకు జిల్లాస్థాయి స్వచ్ఛ విద్యాలయం పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్ రామకృష్ణ మిషన్ కోల్కత్తా,కోయంబత్తూరులో నిర్వహిస్తున్న వివేకానంద సెంటినరీ కళాశాల, విద్యామందిరం, రెసిడెన్షియల్ కళాశాల, ఆర్ట్స్, సైన్స్ కళాశాలలకు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు, ప్రత్యేక గుర్తింపునిచ్చింది.  బేలూరులోని నరేంద్రపూర్ కేంద్రాన్ని సందర్శించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ రీసెర్చ్ ప్రతినిధులు ఉత్తమ సేంద్రీయ వ్యవసాయ కేంద్రంగా గుర్తించారు. నరేంద్రపూర్లోని అంధబాలుర అకాడమీ నిర్వహిస్తున్న బ్రెయిలీ ప్రెస్ దివ్యాంగుల సాధికారత అవార్డును సాధించింది.  ఈ పురస్కారాలు మిషన్ సేవా వికాసానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles