‘శతం మానం భవతి’ ఆశీర్వాదాన్ని అధికంగా అందిపుచ్చుకొని 102 ఏళ్ళు పరిపూర్ణంగా ఈ భూమిపై నడయాడిన విశేష జన్మ వారిది. రాజకీయాలు కూడా ఆరోగ్యంగానే చేశారు. షుగర్, బిపి వంటివి ఆ శరీరాన్ని అంటలేదు. ఆయనను తాకే ధైర్యం ఏ వ్యాధీ చెయ్యలేదు. స్వతంత్ర, కాంగ్రెస్, తెలుగుదేశం మూడు పార్టీల్లోనూ స్వతంత్రంగానే మెలిగారు. సాత్వికుడు, వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు.
హైదరాబాద్ లో తన కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం యడ్లపాటి వెంకటరావు కన్నుమూశారు. తెనాలి సమీపంలోని బోడుపాడులో 1919లో జన్మించిన వెంకటరావు 1967లోనూ, 1978లోనూ ఎంఎల్ఏ గా గెలుపొందారు. 1978-80 మధ్య కాలంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. 1983లో నందమూరి తారక రామారావు ఆహ్వానం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు. అందులోనే చివరి శ్వాస వరకూ ఉన్నారు. 1995లో గుంటూరు జిల్లా పరిషత్తు అధ్యక్షుడుగానూ, 1998లో రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికైనారు. సంగం డెయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడైన యడ్లపాటి వెంకటరావుకు వ్యవసాయం, పాడిపరిశ్రమం అంటే విపరీతమైన ఇష్టం.
ఆచార్య ఎన్ జి రంగాగారి ప్రేరణతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఆయన పేరు నిలబెట్టిన నేత. సాత్వికుడే కానీ తన అభిప్రాయాలను, అభ్యంతరాలను నిక్కచ్చిగా వెల్లడించేవారు. మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నిద్రలేవడం మొదలు నడక, నడత, ఆహారం, వ్యవహారం, విరామం, విశ్రాంతి వరకూ అన్నింటా ఆ క్రమశిక్షణ కొట్టొచ్చినట్టు కనిపించేది.
తాతముత్తాతల నుంచి వచ్చిన జన్యుపరమైన (genetic) లక్షణాలు,స్వయం క్రమశిక్షణ, యోగం అన్నీ ఆయనకు కలిసి వచ్చాయి.తెల్లని శరీరంతో,
తెల్లని వస్త్రాల్లో,అంతకంటే తెల్లని చిరునవ్వుతో నూరేళ్లకు పైగా జీవించి, నవ్వుతూ తనువు చాలించిన యోగపురుషుడు.
ఇటువంటివారి జీవనశైలిని నేటి తరం నాయకులు కొందరైనా ఆచరిస్తే రాజకీయాలు, సమాజం, దేశం ఆరోగ్యంగా మనగలుగుతాయి.