వోలేటి దివాకర్
ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రం రాజమహేద్రవరం కార్పొరేషన్ ఎన్నికలకు అధికార వైస్సార్సీపీ సన్నద్ధం అవుతోంది. వచ్చే ఆగస్టులో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇటీవలే వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ రెండు రోజుల పాటు వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు.
టిక్కెట్ దక్కాలంటే షరతులు వర్తిస్తాయి!
ముందు ప్రజలలో తిరగాలి. డివిజన్ లో గ్రూపులు కట్టకుండా అందరూ కలిసి పని చేయాలి. తర్వాత డివిజన్ల వారీగా జరిపే సర్వేలో ఎవరికి ఫేవర్ గా వస్తే వారికి డివిజన్ ఇన్ఛార్జ్ పదవి దక్కుతుంది. అంటే కార్పొరేటర్ సీటు అన్నమాట. ఒకవేళ ఇన్చార్జి పదవి రానట్లయితే దాన్ని సమానంగా గల నామినేటెడ్ పదవి ఇస్తారు. నేనే సీనియర్ నీ, నాకు అందరూ పని చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. అందరితో కలిసి పని చేయాలనీ, అందరూ గడపగడపకు కార్యక్రమంలో చురుగ్గా తిరగాలనీ సూచించారు.
‘మన కార్యకర్తలు ఎవరు భయపడనక్కరలేదు. గడప గడపకు తిరిగి మనమేం చేశాం. సంక్షేమ కార్యక్రమాలు చెప్పి, వారికి ఏం కావాలో అడిగి వారికి వాటిని అమలు చేస్తామని హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాను,’ అని భరోసా ఇచ్చారు.
కోఆర్డినేటర్ ఎవరో?
పదవి కోల్పోయిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ కోఆర్డినేటర్ శ్రీఘాకోళపు శివరామ సుభ్రమణ్యం తొలిరోజు సమావేశాలకు డుమ్మాకొట్టారు. మలిరోజు పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పై చర్చ జరిగినట్లు సమాచారం. తనకు వచ్చే ఎన్నికల్లో సీటుపై భరోసా ఇస్తే కోఆర్డినేటర్ పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపినట్టు సమాచారం.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా రాజమహేంద్రవరంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఈనేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అధికార పార్టీ నగర కోఆర్డినేటర్ ను కూడా నియమించుకోలేని నిస్తేజంలో ఉండటం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
గత ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తరువాత ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణంను రాజమహేంద్రవరం కోఆర్డినేటర్గా నియమించారు. ఎంపి మార్గాని భరత్ రామ్, జక్కంపూడి రాజా వర్గాల మధ్య ఆధిపత్యపోరు నేపథ్యంలో శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంను అనూహ్యంగా తప్పించి , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు గత ఏడాదిలో పార్టీ కోఆర్డినేటర్గా బాధ్యతలు కట్టబెట్టారు . కొద్దిరోజుల పాటు హడావుడి చేసిన ఆకుల ఆతరువాత నుంచి దాదాపు అదృశ్యమయ్యారు . అప్పటి నుంచి పార్టీ నాయకులు ఎవరికి వారే కోఆర్డినేటర్ పాత్ర పోషిస్తున్నారు . ఒక వైపు నందెపు శ్రీనివాస్ , మరోవై పు రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి నగరంలో పార్టీకి నాయకత్వం వహించే ప్రయత్నాలు చేస్తున్నారు .
ఈనే పథ్యంలో నగర కోఆర్డినేటర్ నియామకం కొత్త నాయకత్వానికి మరింత సవాల్ గా మారుతుంది . 2024 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవ కాశాలూ ఉన్నాయి. ఈలోగానైనా కొత్త ఆర్డినేటర్గా నియమితులైన ఎంపిలు మిధున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ నగర కోఆర్డినేటర్ ను నియమించడంలో విజయం సాధిస్తారా అన్నది వేచిచూడాలి . లేని పక్షంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని నడిపించే నాయకుడు కరవు అవుతాడు.