వోలేటి దివాకర్
సమాచారశాఖ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్‌సిపి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి మంగళవారం నిర్వహించిన సమావేశం విలేఖర్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవలే రామచంద్రపురం నుంచి రూరల్‌కు దిగుమతైన వేణు తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ విందు పేరిట విలేఖర్లను ఆహ్వానించారు. అలాగే దానికి గంట ముందు రాజా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేణు ఆత్మీయ విందు ఉందన్న విషయాన్ని తెలుసుకుని తన సమావేశాన్ని కూడా అక్కడికి మార్చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అంతకు ముందురోజు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో ‘రా కదిలిరా’ సభలో రాజమహేంద్రవరం ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్, జక్కంపూడి రాజా, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, మంత్రులు తానేటి వనిత, వేణు తదితరులపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు వేణు, రాజా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ విందుకు విలేఖర్లు పోటెత్తారు. ఒక గదిలో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో కూర్చునేందుకు కూడా ఖాళీ లేక చాలామంది విలేఖర్లు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. లోపల ఉన్నవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం 12గంటలకు సమావేశం ప్రారంభించాల్సి ఉండగా… సమాచారశాఖ మంత్రిగా ఉన్న తనకు టీవీల్లో లైవ్ ఎప్పుడొస్తుందో తెలుసంటూ సమావేశాన్ని గంట ఆలస్యంగా ప్రారంభించారు.
ఆయన పేరెత్తకుండా జాగ్రత్త పడ్డారు!
చంద్రబాబు ఉమ్మడిగా వైసిపి ప్రజాప్రతినిధులందరిపైనా ఆరోపణలు గుప్పించగా, వేణు, రాజా తమపైనా…హోంమంత్రి, అనపర్తి, గోపాలపురం చేసిన ఆరోపణలపైనే స్పందించారు. విలేఖర్ల సమావేశం మొత్తం రాజమహేంద్రం సిటీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ఎంపి మార్గాని భరత్ రామ్ పేరెత్తకుండా జాగ్రత్తపడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
ఈవిషయాన్ని ముందుగానే భరత్ గ్రహించినట్టున్నారు. అందుకే ఆయన వారి సమావేశానికి గంట ముందే విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి, చంద్రబాబు ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు. ఉమ్మడి శత్రువుపై వైసిపి నాయకులు కూడా ఉమ్మడిగా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్లేవన్న వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. విడిగా విలేఖర్ల సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా వైసిపిలో వర్గవిభేదాలు ఉన్నాయన్న విషయం మరోసారి ప్రజలకు, ప్రత్యర్థి వర్గాలకు తెలిసిపోయినట్టయ్యింది.