- అధికార పార్టీ నేతలకు నోటీసులు
- కోర్టుకెళ్లిన జోగి రమేశ్
- వివరణ ఇచ్చుకున్న కొడాలి నాని
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం తర్వాత తలపట్టుకోవడం షరా మామూలైంది. చిన్నా పెద్దా తేడా లేదు. ఎమ్మెల్యే, మంత్రి అన్న భేదం లేదు. ఎదురుగా ఎవరున్నా విచక్షణ కోల్పోయి విరుచుకుపడటమే లక్ష్యం. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్, తాజాగా మంత్రి కొడాలి నాని ఇలా వైసీపీ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీరి వ్యాఖ్యలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్‌లపై ఏకంగా మీడియాతో మాట్లాడొద్దంటూ ఆదేశాలు ఇస్తే… వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొడాలి నానీకి షోకాజ్ నోటీసు జారీ చేసి సరిపెట్టారు.
తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు మంత్రి కొడాలి నాని. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలను నిమ్మగడ్డ అడ్డుకున్నారని మంత్రి విమర్శించారు. దీంతో నిమ్మగడ్డ మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గంటలోపే ఆయనకు షోకాజ్ నోటీసు వెళ్లింది. సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని కొడాలికి షోకాజ్ నోటీసు ఇచ్చారాయన.
Also Read: ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
షోకాజ్ నోటీసుకు కొడాలి వివరణ:
ఎస్‌ఈసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్‌పై తాను ఎలాంటి దురుద్దేశ పూరిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థల పట్ల ఎనలేని గౌరవం ఉందని అన్నారు. తొలిదశ ఎన్నికల ఫలితాలపై మాత్రమే మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కొడాలి నాని అన్నారు. తన వివరణను పరిగణలోకి తీసుకుని షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని మంత్రి కొడాలి నాని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశారు.
Also Read: రాయబారమా ? కాళ్లబేరమా?
హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేష్:
మరోవైపు పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని జోగి రమేష్‌కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఎదురుగా ఎవరు పోటీకి దిగినా వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ రమేష్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.