“చనుదెంచి అమ్మహీజనపతి జలమపే
క్షించి, అచ్చో విశ్రమించి, చూచి,
తత్కూపమున విలసత్కూల ఘనవల్లి
యన్నిష్టసఖి నూదియున్న దాని,
గురుకుచ యుగముపై పరువడి దొరగెడు
కన్నీరు పూరించు చున్నదాని,
తన సమీపంబునకు జనుల ఆగమనంబు
పన్నుగా కోరుచు నున్నదాని,”
“వరుణదేవుతోడ కరమల్గి జలనివా
సంబు విడిచి భూస్థలంబు వలని
కరగుదేర నున్న వరుణేంద్రు దేవియ
పోనిదాని దేవయాని గనియె”
–నన్నయ భట్టారకుడు
రాక్షసరాజైన వృషపర్వుని ముద్దుల కూతురు శర్మిష్ఠ.
కచుడు దేవలోకంలోని తన నివాసానికి వెళ్లిపోయిన తర్వాత, ఒకనాడు, రాకుమార్తె శర్మిష్ఠ వేలాదిమంది కన్యకలతోనూ, వృషపర్వుని ఆచార్యుడైన శుక్రుని పుత్రిక దేవయాని తోనూ కలసి ఉద్యానవనానికి వెళుతుంది.
Also read: వ ర్ష సం ధ్య
వనంలో గల ఒక సరస్సు గట్టున తమ తమ వస్త్రాలను పెట్టి, కన్యకామణులందరూ కొలనిలో జలక్రీడలు గావిస్తారు. జలక్రీడలు చేస్తున్న సమయంలో సుడిగాలి రేగి, ఆ గాలికి కట్టుబట్టలన్నీ ఎగరిపోయి చెల్లాచెదురై పరస్పరం కలసిపోతాయి. సరస్సు నుండి ఆ కన్నెలందరూ సంభ్రమంతో ఒకరినొకరు త్రోసుకొంటూ బయిటకు వచ్చి చేతికందిన వస్త్రాలను ధరిస్తారు. ఒకరి బట్టలొకరికి తారుమారై పోతాయి. దేవయాని వస్త్రాలు శర్మిష్ఠ ధరిస్తుంది. చిట్టచివరగా దేవయాని ధరించడానికి శర్మిష్ఠ వస్త్రాలే మిగులుతాయి. అవి కట్టుకోవడానికి దేవయాని నిరాకరించి, ఏవగింపుతో ఇట్లా అంటుంది:
“లోకోత్తర చరితుండగు
నా కావ్యు తనూజ; నీకు నారాధిత; నే
ప్రాకట భూసుర కన్యక
నీకట్టిన మైల కట్ట నేర్తునె చెపుమా?”
“లోకోత్తర చరితుడైన కావ్యు (శుక్రుని) కుమార్తెను. నీవు ఆరాధించ తగిన దాన్ని. ప్రసిద్ధ భూసుర కన్యను. నీవు ధరించిన మలిన వస్త్రాన్ని నేను కట్టుకోగలనా?”
అందుకు జవాబుగా శర్మిష్ఠ,
“మా అయ్యను విడిచి పెట్టకుండా మీ అయ్య సేవిస్తూ, ఆశీర్వదిస్తూ, ప్రియవచనాలు పలుకుతూ వుంటాడు. నీ గొప్పదనం నా వద్ద చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా?”
“నా కట్టిన పుట్టంబు నీకుం కట్టంగాదు గాకేమి?” అంటూ శర్మిష్ఠ గర్వంతో తూలనాడి దేవయానిని కోపంతో అక్కడ వున్న ఒక నూతిలోకి త్రోసివేసి, తన సమస్త పరివారంతో నిజ నివాసానికి వెళ్లి పోతుంది. నూతిలో పడిన దేవయాని చేసేది లేక, నూతిలోని పూతీగను పట్టుకుని వ్రేలాడుతూ తనను రక్షించి, బయిటకు లాగే ఆపద్బాంధవుని కోసం ఎదురుతెన్నులు చూస్తుంది.
Also read: మహాభారతం – తృతీయాశ్వాసం – వ్యాసుని జననం
కొంత సమయం తర్వాత, నహుషుని కుమారుడు, పల్వురు శాత్రవ రాజులను పరాజితులను గావించిన వాడు, జగదేకవీరుడైన యయాతి మహారాజు, మృగయావినోదియై, అదే అరణ్యవాటికలో కలయతిరిగి, మిక్కిలి అలసిపోయిన వాడై, ఎక్కుపెట్టిన విల్లుతో, దేవయాని అంధకూపంలో పడి తీగకు వ్రేలాడుతున్న (నూతి) గట్టు వద్దకు విచ్చేస్తాడు.
నేటి పద్యంతో అనుబంధం (పద్యతాత్పర్యం):
“నూతి గట్టుకు చనుదెంచి, జలాన్ని అపేక్షించి, ఆ మహీజనపతి యయాతి, అక్కడే విశ్రమించి, ఆ నూతిలోనికి (తత్కూపమున) తొంగి చూస్తాడు. ఆ నూతిలో,”
“విలసత్ కూల ఘనవల్లిని (ప్రకాశిస్తూ వ్రేలాడుతున్న పెద్ద తీగను), అదే తన పాలిట ఇష్టసఖిగా (చెలికత్తెగా) పట్టుకొని వున్న దాన్ని, గురకుచ యుగమును (ఘనమైన తన చనుకట్టులను) క్రమం తప్పక తన కన్నీటితో పూరిస్తున్న దాన్ని, సమీపానికి తన్ను రక్షించగల వారెవరైనా ఉన్నారా అని అట్టి జనుల ఆగమనాన్ని మిక్కిలి కోరుతున్నదాన్ని, నిజ నాథుడైన వరుణదేవునిపై కడుంగడు కోపించి, తన జలనివాసాన్ని వీడి, భూస్థలం వైపుకు రావడానికి సిద్ధంగా వున్న వరుణదేవుని దేవేరి వంటి దేవయానిని యయాతి కనుగొన్నాడు.
Also read: లోక బాంధవా!
నేట పద్య ప్రాధాన్యత
నూతిలో పడిన దేవయానిని యయాతి చూడడం దీవయాని జీవితంలో కీలకఘట్టం. కీలకం గనుక, ఈ సీసపద్యాన్ని, మనోహరంగా, “సర్వ ప్రాసమయంగా” ఆదికవి నన్నయ మలుచుకొన్నాడు.
ఈ పద్యంలో మొదట యయాతి వర్ణన చూద్దాం. యయాతి అక్కడకు రావడం, వచ్చి జలం అపేక్షించడం. నీరు త్రాగేముందు, అలసట తీర్చుకోవడం, మనకీ వర్ణనలో దృశ్యమానమౌతాయి. ఈ దృశ్యమానం కావడం కూడా రమణీయమైన వృత్యనుప్రాసలతో చేయబడుతుంది. చూడండి:
“చనుదెంచి,
జలమపేక్షించి,
అచ్చో విశ్రమించి”
ఇప్పుడు యయాతి నూతిలోనికి తొంగిచూస్తాడు. ఇక్కడ సైతం “దేవయాని” శబ్దంతో మమేకమయ్యే ప్రాసలను చూస్తాం. All sounds that rhyme with the sound “దేవయాని”;
(“తత్కూపమున చూచి”)
“విలసత్కూల ఘనవల్లి యను ఇష్టసఖి నూదియున్న దాని”
“గురుకుచ యుగముపై పరువడి దొరగెడు కన్నీరు పూరించు చున్నదాని”
“తన సమీపమునకు జనుల ఆగమనంబు పన్నుగా గోరుచు నున్నదాని”
“వరుణదేవు తోడ కరమల్గి జలనివాసంబు విడిచి భూస్థలంబు వలని కరుగుదేరనున్న వరుణేంద్రు దేవియ పోని (పోలిన) దాని”
“దేవయాని”
“గనియె”
ఈ పద్యం ఒక మనోజ్ఞ దృశ్యాన్ని, ఆ దృశ్యంలోని “ఏకవిన్యాసాన్ని” సూచించే “చిత్రలేఖనం” వలె ఉన్నదని విమర్శకులు భావిస్తారు. ఈ చిత్రంలో, దేవయాని స్వరూపం కన్న ఆమె అనుభవించే దుఃఖావేశమే, అధికతరంగా చిత్రీకరించబడి, పఠితకు రసానుభూతిని కలిగిస్తుంది.
Also read: ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – కచ దేవయాని ఘట్టం – శుక్రాచార్యుడు పునురుజ్జీవితుడు కావడం
నూతి వద్దకు యయాతి ఎక్కుపెట్టిన వింటితో రావడంలో చమత్కారం వున్నది. మృగయావినోది యైన రాజు చేతిలో ఎక్కు పెట్టిన ధనువు వుండడం స్వభావోక్తి. ఒక మృగం బదులు మృగనేత్రి యైన కాంతను, చేత మన్మధ ధనువును పోలిన ధనువుతో ఒక రసికరాజు రాకను ఊహించడం వ్యంగ్యోక్తి.
స్నేహితురాలైన శర్మిష్ఠచే, ఇష్టసఖులైన వేయిమంది కన్యకలచే వదలిపెట్టబడి, అనాథగా మిగిలిన దేవయానికి “విలసత్ కూల ఘనవల్లి”యే చిట్టచివరి జీవనాధారమై పోయిన నిజమైన ఇష్టసఖిగా నన్నయ భావించడం కూడా మనోహరమైన కవిత్వాలంకారం.
నూతిలో వున్న వారి ప్రతిబింబం నీటిలో పడుతుంది. అనగా వరుణదేవుడు తన ప్రేయసిని తన జలస్థావరంలో దాచుకున్నాడన్న మాట. నూతిలోని వారు నూతి వెలుపలికి వచ్చినప్పుడు నీటిలోని ప్రతిబింబం మాయమై పోతుంది. దేవయాని నూతినుండి గట్టుకు రావడం, దేవయాని తన ప్రియుడైన వరుణదేవుని జలస్థలాన్ని వీడి భూపాలకుడైన యయాతి కోసం భూస్థలానికి వస్తున్నదనే ఉత్ప్రేక్షాలంకారాన్ని చాటి చెబుతున్నది.
Also read: ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం
దేవయాని కూపంలో అనాథయై పడివుండడం, కచుని వియోగంచే ఆమెలో కలిగిన నిస్పృహకు, ఆమె జీవితంలో తొంగి చూసిన అగాధపు టంధకారానికీ ప్రతీక.
భూస్థలానికి రావాలని కోరుకోవడం, ప్రస్తుత దుస్థితినుండి బయటపడి, వాస్తవిక జగత్తులోకి రావాలనే దేవయాని కోరికకు ప్రతీక.
కచునిపై తన విఫలప్రేమ గతించిన గాథయై, దేవయానిలో పొడమి , పుష్పిస్తున్న జీవన విజిగీషకు యీ ఘట్టం సంకేతం.
సీసపద్యాన్ని బహుభంగుల్లో నడిపి, పాఠకలోకాన్ని ఆద్యంతం మెప్పించగలిగే నన్నయ మహాకవి చేతిలో మైనంముద్ద వలె ఒదిగిపోయిన నేటి పద్యం అద్భుతమైన ఆ మహామహుని పద్యశిల్పాల్లో ఒకటి.
Also read: భారతీయ సాహిత్యంలో ప్రశ్న-జవాబు ప్రక్రియ వైశిష్ట్యం
నివర్తి మోహన్ కుమార్