Sunday, December 22, 2024

లక్ష్మణా, నా విల్లంబులు ఎక్కడ?

తిరుప్పావై కథలు – 13

శ్రీ కృష్ణుడిని ఊయలలో నిద్రబుచ్చుతూ, అనగా అనగారాముడనే బాలుడుండేవాడు అని యశోద కథ మొదలు పెట్టింది. కిట్టయ్య ఊఊ అన్నాడు. రాముడికి సీత అనే భార్య ఉంది. చిట్టి కిట్టయ్య ఊహూఊ అన్నాడుమళ్లీ. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లారు. ఊఊ.. అక్కడ సీతమ్మను రావణుడు అపహరించాడు అని యశోద చెప్పగానే ఆవేశంతో లక్ష్మణా ధనుస్సు ధనుస్సు ఏది ధనుస్సు ఎక్కడ అని ఆవేశంతో అరుస్తూ లేచాడట. రాముడు కృష్ణుడు ఒక్కరే అనడానికి ఇంకే ప్రమాణం కావాలి?  రామకృష్ణుల సాహసాలను కీర్తించే గోదాగోవింద గీతం 13వ పాశురం.

మథురలో పుట్టి బృందావనంలో తిరుగాడే గోపికలు కృష్ణుని కాకుండా రాముడిని తలవడం ఏమిటి? అయోధ్యలో రాముడు రాముడు అనే తప్ప నందవ్రజంలో కృష్ణుడిని గాక అన్యనామం ఎందుకు తలుస్తారు? ఈ పాశురంలో రాముడా కృష్ణుడా ఎవరుమిన్న అనే వాదం సాగుతుంది. ఆకారాలు వేరుగా ఉన్నా ఇరువురూ పరమాత్మస్వరూపాలే కదా అని నిర్ధారణకు వస్తారు.

Also read: రామదర్శనంతో దశరథుడికి యవ్వనం

గోపికలంతా వ్రతం చేయడానికి ఒక స్థలాన్ని ఎంచుకున్నారు. అక్కడికి చేరుకున్నారు. శ్రీకృష్ణావతారం ముగిసిన తరువాత రామావతార వైభవాన్ని వారు పాడుకుంటున్నారు. తమతో కలిసి రమ్మని లోపలున్న గోపికను మేలుకొలుపు పాడుతుంటే, ఆమె లేవడం లేదు.
గోపిక: అప్పుడే తెల్లారిందనడానికి ఏమిటి రుజువులు.

బయటి గోపికలు: శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు.

గోపిక: వేరే గుర్తులేమీ లేవా?

గోపికలు: పక్షులు కలకలం చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. కలకలం అంటే భాగవతులు కలిసి చెప్పుకునే అనుభవాలు, భగవద్గుణానుభవాలు.వాటిని అందరూ పంచుకుంటూ ఉంటే, నీవేమిటమ్మా ఒంటరిగానే శ్రీకృష్ణ గుణానుభవాలను అనుభవిస్తున్నావు. ఇది న్యాయమా? పోనీ శ్రీకృష్ణవిరహం వల్ల స్నానం చేయాలని ఉందా? అలా అయితే సూర్యోదయానికి పూర్వమే నీళ్లు చల్లగా ఉంటాయి. తెల్లవారితే నీళ్లు వేడెక్కుతాయి సుమా. శ్రీరాముని విడిచి ఉండలేక భరతుడు అర్థరాత్రి సరయూనదిలో స్నానం చేసేవాడట. ఇవి మంచిరోజులు. శ్రీకృష్ణుడితో మనను కలవనివ్వని పెద్దలు ఇప్పుడు కలవడానికి అనుమతించారు. నీవొక్కదానివే భగవద్గుణానుభవం చేయడం సరికాదు. దీన్ని కాపట్యం అంటారు. కాకపోతే మాతో కలిసి ఆ అనుభవాలు పొంద వచ్చుకదా అని గోద లోపలి గోపికలతో వాదిస్తున్నారు. ఒక్కరే భగవదారాధన చేయడం కాదు. గోష్టిగా సమిష్టిగా శ్రీకృష్ణుడి గుణగణాలను తలచుకోవాలని గోదమ్మ బోధిస్తున్నారు.

Also read: శివుడు ప్రత్యక్షమైతే సూదిలో దారం ఎక్కించమన్న భక్తుడు

అరక్కనై అంటే రాక్షసుడు. కాని పొల్లా అరక్కనై అనే పదం ఇక్కడ వేశారు. దుష్టుడైన రాక్షసుడట. అంటే రావణుడు. ఎందుకంటే రాక్షసులలో విభీషణుడి వంటి మంచివారూ ఉంటారు. ఈ జగమంతా ఆ భగవంతుని ఉద్యానవనమైతే, ఇందులో బకుడు, రావణుడి వంటి అధర్మపరులు పురుగు పట్టిన చిగురులట. వారిని గిల్లి పారేస్తాడట (కిళ్లిక్కళైన్దానై). 

శ్రీరాముడు రావణుడిని చంపడానికి ఎందరి సాయమో తీసుకున్నారని రామాయణంలో ఉంది. సుగ్రీవుడు, హనుమంతుడు, అగస్త్యుడు చెప్పిన ఆదిత్యహృదయం, మంత్రం సేతుబంధనం వంటి ఎన్నో సహాయాలతో జయించారంటారు. నిజానికి ఇదంతా ఒక లీల. విభీషణుడు శరణు కోరినప్పుడు, శత్రురాజు తమ్ముడిని నమ్మడం మంచిది కాదనీ, రావణునిపై యుద్ధంలో హాని కలిగిస్తాడని సుగ్రీవుని భయం. అప్పుడు మొత్తం భూమ్మీద ఉన్న రాక్షసులంతా వచ్చినా తలచుకుంటే కొనగోటితో చంపగలను నిశ్చింతగా ఉండు అంటాడు. కాని తలచుకోడు. సాధారణ మానవుడి వలె స్వయంగా ప్రయత్నించడం ద్వారా మాత్రమే విజయం సాధిస్తాడు. రావణుడి అహంకారాన్ని రాముడు ముందు సంహరిస్తాడు. ఒక సాయంత్రం యుద్ధభూమిలో రావణుడి రథాన్ని, ధనుస్సును విరిచి, సారథిని, గుర్రాల్ని చంపి, పతాకాన్ని పడగొట్టి, కిరీటం కూల్చి ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు రావణుడిని సులువుగా చంపవచ్చు. కాని వదిలేస్తాడు. వెళ్లు, అలసట తీర్చుకుని, కొత్త రథాన్ని ఆయుధాలని సమకూర్చుకుని రేపు రా, నీకు అనుమతిస్తున్నాను’’ అంటాడు. రావణుడి సర్వస్వమూ అభిమానమే. తన రాజ్యంలో  ప్రవేశించి తనను ముట్టడించి, పడగొట్టి తనకు బడలిక తీర్చుకునేందుకు అనుమతిస్తున్నాడు రాముడు. ముందు అహంకార సంహారం జరిగింది. కొంగ దంభాన్ని, రావణుడి అహంకారాన్ని అవలీలగా గిల్లి పారేస్తారు, కొనగోటితో. కృష్ణుడు కొనగోట గోవర్ధనాన్ని ఎత్తి ఏడురోజులు పట్టుకున్నాడు.

Also read: భగవంతుడిని తెలుసుకుంటే అన్ని నోములు నోచినట్టే

ఇతరులను హింసించే ప్రవృత్తికలిగినా పైకి సజ్జనుడివలెకనిపించడమే దంభం. రావణుడు అహంకారానికి ప్రతీక. ఈ రెండూ తొలగాలంటే ఆచార్యుడి ద్వారా వచ్చిన భగవన్నామకీర్తన ఒక్కటే మార్గం. శుక్రుడు జ్ఞానము, బృహస్పతి అజ్ఞానమునకు సంకేతము. పక్షులంటే ఆచార్యులు. నేత్రమంటే జ్ఞానం. నేత్ర సౌందర్యమంటే భాగవతోత్తముల స్వరూపం తెలుసుకోగలగడం, స్నానమంటే భగవద్గుణానుభవం. భగవంతుని అనుభవం అందరితో కలిసి చేయాలి. ఒంటరిగా చేయడమంటే దంభం.

ఈ పాశురంలో భక్తాంఘ్రిరేణు, శ్రీపాదరేణువు అంటే విప్రనారాయణుని మేల్కొల్పుతున్నారు. ఆయన పూలసేవలో తరించిన వాడు. పావాయ్ అంటే పతివ్రత. ఒక్క భర్తకే వశమై ఉండడం ఆవ్రతం. ఈ ఆళ్వార్ కేవలం రంగనాథుడిని తప్ప మరే దివ్యదేశ పెరుమాళ్ ని కలవని తలవని వాడు. గురుపరంపరలో శ్రీ పుండరీకాక్షాయనమః అనే నమోవాకాన్ని అనుసంధించుకోవాలి ఈ పాశురంలో. గోదమ్మ పాదాలకు శరణు.

Also read: నవరత్నభవనం అంటే నవద్వార శరీరమే

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles