Sunday, December 22, 2024

అమ్మ అందరికీ అమ్మే…

మా యశోదమ్మ జ్ఞాపకాలు

అమ్మ అందరికీ అమ్మే…! ఇందులో ఎలాంటి అతిశయోక్తులూ లేవు… Mother’s Day సందర్భంగా మనకు జన్మనిచ్చిన మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు… మనకు బతుకునిచ్చి, పాలిచ్చి, లాలించి, పాలించి, పోషించి, ఒక జీవితాన్నిచ్చిన తల్లులందరి రుణం మనం ఎప్పటికీ, ఎన్నటికీ తీర్చుకోలేనిది…

మన జీవితంలో ‘అమ్మ’ కీ, ‘తల్లి’ కీ, అసలు అమ్మ అనే పదానికే ప్రత్యామ్నాయం అనేది లేనే లేదు… అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేనిది… తీర్చరానిది… పూడ్చలేనిది… అందుకే అమ్మ ఎప్పటికీ అమ్మే…!… అమ్మ అందరికీ అమ్మే…!

సామాజిక బాధ్యత

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఓ తల్లిగా, ఓ ఇల్లాలుగా, ఓ గొప్ప మాతృమూర్తిగా తన పిల్లలకు తన ప్రేమావాత్సల్యాలను పంచిపెట్టడమే కాకుండా బాధ్యులైన  పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలోనూ, సామాజిక బాధ్యతను వారు గుర్తెరిగి సమాజానికి  తమ వంతు సేవ చేయడంలోనూ వారికి దిశానిర్దేశనం చేసిన ఆమె ఒక చిరస్మరణీయ మాతృమూర్తిగా మా యశోదమ్మ – కీ.శే. శ్రీమతి గోరుకంటి యశోదాదేవి నిలిచిపోతారు.

తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రధాన అంతర్జాతీయస్థాయి  కార్పోరేట్  హాస్పిటల్స్ గ్రూప్  అయిన యశోద హాస్పిటల్స్ స్థాపనకు ప్రేరణగా నిలిచిన మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి  గోరుకంటి యశోదా దేవి అమ్మదనానికే ఆదర్శం. కన్నబిడ్డలు తల్లి మీద అభిమానం, ప్రేమ, గౌరవంతో ఆమెపేరు మీద స్థాపించినదే యశోద హాస్పిటల్స్.

మహిళలకు ఆదర్శం ఆమె జీవితం

గోరుకంటి యశోదా దేవి పేరులోనే కాదు, పలకరింపు, మాటలలో కూడా ఆప్యాయత, అభిమాసం, ప్రేమ  తొణికిసలాడేవి. ఆ అత్యుత్తమ మాతృమూర్తి జీవితం నేటి మహిళలకు ఒక ఆదర్శం… మార్గదర్శనం… ఆచరణీయం…

మాతృమూర్తే స్పూర్తి గా ఈరోజు యశోద హాస్సిటల్స్ 2500కు పైగా పడకలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అత్యున్నత వైద్య సంస్థగా రూపుదిద్దుకోవడానికి స్పూర్తి ప్రదాత యశోదమ్మే. ఆమె కని, పెంచి, తీర్పిదిద్దిన ఆమె కుమారుల క్రమశిక్షణ, అంకితభావం, కార్యదక్షత కారణంగా ఈరోజు ప్రైవేట్ వైద్య రంగంలోనే యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఒక అత్యున్నత సంస్థగా, భారతదేశంలోనే ప్రధాన అత్యుత్తమ హాప్పిటల్స్ గ్రూప్స్ లో ఒకటిగా నిలివింది. ఇదంతా ఆవిడ చలవే… ఆవిడ ఆశీస్సులే… యశోదమ్మ పేరు బలమే…

కన్న బిడ్డలకు మార్గనిర్దేశకత్వం చేసి పిల్లలకు ఒక మార్గదర్శిగా నిలిచిన మాతృమూర్తి యశోదమ్మ … ఒక సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు అయినప్పటికీ  పిల్లలు బాగా చదువుకోవాలన్నదే యశోదమ్మ కల. అదే ఆవిడ జీవిత లక్ష్యం. కేవలం  పిల్లల  చదువుల కోసమే ఆమె జీవితంలో కష్టపడి మార్గదర్శనం చేసి, చదివించి, వారిని ఇంత ప్రయోజకులను చేశారు.

నల్లగొండ జిల్లాలో ఒక పల్లెటూరు

నల్గొండ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు అయిన గుమ్మడివెల్లి నుండి కేవలం పిల్లల చదువుల కోసం హన్మకొండ వచ్చారు. ఆమె భర్త కీ.శే. గోరుకంటి రామచందర్ రావు గారు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలలో పని చేసినా, ఆమే పిల్లలను దగ్గరుండి చదివించారు… పెంచారు… ముందుండి నడిపించారు… ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.

ఒకవైపు వ్యవసాయం, మరోవైపు పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ, ఉన్నంతలో పిల్లలకు సర్దుబాటు చేస్తూ, మంచి స్కూళ్ళలో చదివించారు. పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోనవకుండా, క్రమశిక్షణతో పెంచి వారికి మార్గనిర్దేశం చేశారు. ఈరోజు యశోద హాస్సిటల్స్ గ్రూప్ లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పదహారువేల కుటుంబాలు పైగానే ఉపాధి పొందుతున్నాయి. దీనికి మార్గదర్శకత్వం కచ్చితంగా యశోదమ్మదే.  క్రమశిక్షణ, పట్టుదలతో ఎల్లప్పుడూ ముందుకు సాగిన ధీర వనిత యశోదమ్మ… యశోదమ్మ అనుసరించిన అతి సాధారణ జీవన శైలే ఆమె పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది, ప్రయోజకులుగా చేయడంలో తోడ్పడింది.

ఉన్నదాంట్లో సర్థుకుపోయే తత్వం, వృధా ఖర్చులకు పిల్లలను దూరంగా ఉంచడం, వారిని క్రమం తప్పకుండా రోజూ తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు, చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని వారికి పదేపదే బోధించేవారు.

పురోగతికి క్రమశిక్షణే కారణం

ఈ రోజు యశోద హాస్పిటల్స్  పురోగతిలో ఆమె తన పిల్లలకు నేర్చించిన క్రమశిక్షణే వారికి ఎంతగానో ఉపయోగపడింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండాలనే తత్వం ఆవిడ పిల్లలకు చిన్నతనం నుంచే నూరిపొసారు… చిన్నవయసులోనే పిల్లలకు కష్టపడటం, నిజాయితీగా పైకి రావాలనే స్ఫూర్తినిచ్చారు.

కష్టాలకు వెరవని ధీశాలి యశోదమ్మ …. ఒక సామాన్య మధ్య  తరగతి కుటుంబంలో పుట్టి, ఒక చిరుద్యోగి భార్యగా వరంగల్ లాంటి పట్టణంలో, భర్తకు దూరంగా కేవలం పిల్లల  చదువుల కోసం నలుగురు పిల్లలతో  జీవన యానం సాగించడం సామాన్యమైన విషయం కాదు. దీనికి ఎంతో ధైర్యం, పట్టుదల అవసరం. భర్త సంపాదనకు తోడుగా ఒంటరిగా వ్యవసాయం, పాడి చూసుకుంటూ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా పేరున్న ఒక పెద్ద కాన్వెంట్లో చదివించి ఈ స్థాయికి వారు చేరుకునేలా ఆమె తన పిల్లల్ని తీర్పిదిద్దారు. పిల్లలకు వ్యక్తిత్వం, పట్టుదలను చిన్నతనం నుంచే అలవాటు చేశారు.

అంతా భగవంతుని దయ. మన ప్రయత్నం మనం చేస్తాం అంతే. దేపుడి దయ వల్ల ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి మనకు చేతనైనంత వరకు పేదలకు సాయం చేయాలని ఆమె ఎప్పుడూ పిల్లలకు చెబుతుండేవారు. తల్లి ఆశయానికి అనుగుణంగానే ఆమె కుమారులు యశోద చారిటబుల్ పౌండేషన్ ను స్థాపించి ఈరోజున ఎందరో అనాధలకు అండదండగా నిలుస్తూ  వారి జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు.

పలకరింపే దీవన

ఆ తల్లికి ప్రేమాభిమానాలు ఎక్కువ. ఆమె పలకరింపే మనకు దీవెన. ఆవిడ నలుగురు పిల్లలలో ఇద్దరు ప్రపంచస్థాయి వైద్యులు. ఒకరు ప్రముఖ ఇంజినీరు. మరొకరు చార్టెడ్ అకౌంటెంట్. ఆ కుటుంబానికి ఆమె ఒక ప్రేరణ… ఒక నిత్య స్ఫూర్తి… ఒక దైవం… యశోద హాస్పిటల్స్ గ్రూప్ కు ఆమె ఒక ప్రేరణ… ఒక పునాది… ఒక మూలస్తంభం.

అలాగే, వేలాది కుటుంబాలకు ఆమె ఒక జీవనజ్యోతి… తమ అభ్యున్నతికి మూలకారణం మా అమ్మే అని ఆ నలుగురు కొడుకులూ ఎప్పటికీ భావిస్తారు. 1989లో ఒక చిన్న క్లినిక్ గా ప్రారంభమైన యశోద హాస్సిటల్ మూడు దశాబ్దాలకు పైగా కాలంలో పోటీపడుతూ ఒక అగ్రశ్రేణి ప్రపంచస్థాయి వైద్య సంస్థగా ఎదగడం వెనుక ఆమె దీవెనలు, సంకల్పం, ప్రోత్సాహం పుష్కలంగా ఉన్నాయి… పిల్లల  వెన్నంటే ఉండి వారిని ఆమె ఎల్లవేళలా ముందుకు నడిపించారు… ప్రోత్సహించారు… జీవితంలో నిలబెట్టారు.

అత్యున్నత వైద్యసంస్థకు ప్రేరణ

ఒక సామాన్య మహిళ తన జీవితకాలంలో … సహధర్మచారిణిగా… తల్లిగా… కుటుంబానికి పెద్ద దిక్కుగా, సంకల్పంతోనూ, శ్రమించే తత్వంతోనూ, అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ, ఓర్పు, ధైర్యం, పట్టుదలతోనూ, సామర్ద్యం…అన్నింటికి మించి స్వయంకృషే ఆలంబనగా ఒక అత్యున్నత వైద్య సంస్థకు ప్రేరణగా నిలిచిన ఒక మాతృమూర్తిగా యశోదమ్మ ఎప్పటికీ నిలిచిపో తారు.

ఎందరికో ఆదర్శమూర్తి అయిన ఆమె జీవితం ఈతరం తల్లులందరికీ ఒక జీవితపాఠం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు… మాతృమూర్తి కీ.శే. శ్రీమతి గోరుకంటి యశోదా దేవి గారి స్మృతులు, జ్ఞాపకాలు, జీవితం ప్రతి ఒక్క తెలుగు మహిళకూ ఎంతో స్పూర్తిదాయకం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… Mother’s Day సందర్భంగా మా యశోదమ్మ కు నివాళులు అర్పిస్తూ…

( రచయిత సీనియర్ జనరల్ మేనేజర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ కార్పోరేట్ కమ్యూనికేషన్స్, యశోద హాస్పిటల్స్ గ్రూప్, హైదరాబాద్.   ఈరోజు – మే 9th ( ఆదివారం) Mother’s Day సందర్భంగా… మా యశోద హాస్పిటల్స్ గ్రూప్ కు స్ఫూర్తిప్రదాత అయిన మా యశోదమ్మ – కీ.శే. శ్రీమతి గోరుకంటి యశోదాదేవి గార్ని తలచుకుంటూ…)

Ashoka Varma Penmetsa
Ashoka Varma Penmetsa
Mr. Ashoka Varma Penmetsa is a Senior Consultant of Advertising, Branding, Media& Public Relations. He has been in this field for more than 25 Years. He takes care of Corporate Communications Department at a Leading Healthcare Group as HOD. He is also a good writer.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles