దేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా సామాజిక శాస్త్రజ్ఞులు, విజ్ఞానవేత్తల ఎత్తైన విగ్రహాలతో శాస్త్ర ప్రచారం కోసమే స్థాపించ బడ్డ “శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించు దాతృత్వ సంస్థ” ఉత్తరాంధ్రలోని పార్వతీ పురం చర్చివీధిలో ఉంది. సుమారు ఒక ఎకరం స్థలంలో వ్యవస్థ కోసం కృషి చేసిన మహనీయుల అల్లంత విగ్రహాలు, ఆయా వ్యక్తుల సంక్షిప్త పరిచయంతో ఉన్న అరుదైన భావోద్యమ స్థలమది. దాని వ్యవస్థాపకులే కీ.శే.యాళ్ళ సూర్యనారాయణ, సరస్వతమ్మ దంపతులు.
భారత రాజ్యాంగంలోని 51 A (h) ప్రకారం పౌరసమాజంలో “శాస్త్రీయ స్పృహను, మానవవాదాన్నీ, పరిశీలనాతత్వాన్నీ, సంస్కరణాభిలాషను పెంపొందించడం ప్రతీ భారతీయ పౌరుడి విధి” అనే దృక్పథాన్ని కలిగి జీవితాంతం అందుకోసం నిరంతరం తపించి, దేశంలో ఎక్కడా లేని విధంగా సైన్సు ప్రచారం కోసమే ప్రత్యేకంగా యాళ్ళ సూర్య నారాయణ దంపతులు పెట్టిందే, “శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే దాతృత్వ సంస్థ.”
భారతీయ సాంస్కృతికోద్యమ పితామహులు జోతిబాఫూలే, సావిత్రీబాయి దంపతులతో మొదలెట్టి జీవితాంతం బ్రాహ్మణవాదంతో ఎదురులేని పోరాటం చేసిన పెరియార్ రామస్వామి నాయకర్ వరకూ, సత్యాన్వేషణా తృష్ణకి తిరుగు లేని దిక్సూచి మహాత్మా గౌతమ బుద్ధుడి నుండి కులనిర్మూలన కోసం ఎనలేని కృషి చేసిన భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వరకూ మనకి అక్కడ తారసపడతారు.
అంతేకాదు, ప్రపంచ పీడిత ప్రజానీకానికి మార్గదర్శి కార్ల్ మార్క్స్ మొదలుకొని వైజ్ఞానికోద్యమ దిశనే మార్చిన చార్లెస్ డార్విన్ వరకూ, భిన్నాభిప్రాయానికి స్థానం ఉండాలని మృత్యువుని చిరునవ్వుతో ఆహ్వానించిన తత్వవేత్త సోక్రటీసు నుండి సత్యస్థాపన కోసం ఉన్మాదానికి బలైపోయిన బ్రూనో దాకా, గెలీలియో నుంచి మేడమ్ క్యూరీ దాకా ఇంకా వైజ్ఞానిక వేత్త ఐన్ స్టీన్, అమరుడు సర్దార్ భగత్ సింగ్, తొలి తెలుగు భావోద్యమ కవి వేమన ఇలా మొత్తం 18 మంది మహామహులు!
విభిన్న రంగాల్లో ప్రజానీకం కోసం జీవితాలని అంకితం చేసిన యోధుల్ని విద్యార్థులు, యువతకి పరిచయం చేయాలనే సంకల్పంతో, వైవిధ్యమైన స్రవంతులకి చెందిన 18 మంది ప్రజాతంత్ర యోధుల్ని ఎంచుకుని, వారి నిలువెత్తు విగ్రహాలు పెట్టడమే కాకుండా, వారి గురించి రేఖామాత్రపు పరిచయం కూడా చేస్తూ, ప్రతి విగ్రహానికి కిందన తెలుగులో సమాచారం రాయించి అతి త్వరలోనే ఆ ప్రదేశంలో ఒక అద్వితీయ మైన గ్రంథాలయం స్థాపించాలని ఆ దంపతులు కలకన్నారు.
అనుకోని అనారోగ్యంతో సూర్యనారాయణ 2017 లో మరణించడంతో ఆ స్థలం అన్యాక్రాంతమైంది. సరస్వతమ్మ కూడా మొన్నీ మధ్యనే మరణించారని తెలిసింది. దాంతో ఆయన పేరిట ఉన్న వ్యవసాయ భూమిని, యాళ్ళ ఎన్నో ఆశయాలతో స్థాపించిన ఈ ఆశ్రమాన్ని ముష్కరమూకలు మేయడానికి పథకం పన్నాయి. ప్రస్తుతం కోర్టు వివాదాల్లో చిక్కుకున్న ఈ సంస్థని యాళ్ళ కోరిక మేరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మంచిది.
తాము కలలుకన్న నిర్మాణానికి కించిత్తు కుటుంబ స్వార్ధం కూడా అడ్డంకేనని తలచి స్వచ్ఛందంగా పిల్లల్ని కనడమే మానేసిన మహనీయ దంపతులు వారిరువురూ. అలాంటి వారి ఆశయాలకి తూట్లు పొడుస్తూ డబ్బుకోసం ఏ గడ్డయినా కరిచే వారి పాలవ కుండా ఆ మహోన్నత శాస్త్రీయ సంస్థను కాపాడుకోవడం తెలుగులో సైన్సుసంఘాలే కాదు,హేతువాద,నాస్తిక,భౌతికవాద, మానవవాద,దళితబహుజన,వామపక్ష, ప్రగతిశీల,ప్రజాస్వామ్య సంఘాలన్నింటి కర్తవ్యం.
Also read: ఆయనే ఒక ధిక్కార చరిత్ర
వయసుకు మించిన చనువుతో ఆయన దగ్గర ఎన్ని గారాలు పోయానో తల్చుకుంటే ఇప్పుడు ఏడుపొస్తుంది. అర్ధరాత్రి ఊరు చేరినప్పటికీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తెల్లవారుజాము వరకూ స్టేషనులో పడుకొని ఉదయం ఇంటికి వచ్చి కనీసం టీ కూడా తాగకుండా పుస్తకాలేవో నాకిమ్మనమని అందజేసి వెళ్ళిపోయిన ఈ పెద్దాయనను తల్చుకుని ఇప్పటికీ ఆశ్చర్యం పోతుంటారు కుటుంబ సభ్యులు !
నాన్నది పార్వతీపురం, యాళ్ళదీ అదే ప్రాంతం కావడం తో నేనెప్పుడు అటు వైపెళ్ళినా ఆయన్ని కలవకుండా వచ్చే వాడ్ని కాదు. అలాంటి మనిషిని మళ్ళీ కచ్చితంగా చూడలేం. అంతటి నిజాయితీ, నిబద్దత, నిర్భీతి, నిర్మొహమాటం, నిక్కచ్ఛితనం, ధైర్యం ఆయన తో పరిచయం దానికదే ఒక విద్యాభ్యాసం. జీవితాంతం ఆయన కోర్టులతో, సమాజంతో చేసిన పోరాటాల్లోనూ వందల వేల అనుభవాల్ని నేనెన్నిసార్లు మొత్తుకున్నా అక్షరరూపంలో సైతం మనకి అందించకుండా వెళ్ళిపోయిన ఆయనంటే ఆప్యాయతతో కూడిన కోపం నాకు!
Also read: వర్ణం నుండి కులం దాకా
అనితరసాధ్యమైన రీతిలో సైన్సు ఉద్యమానికి వెన్ను దన్నుగా, భావోద్యమాలకి బలమైన భరోసాగా ఉంటూ నాస్తిక, హేతువాద, భౌతికవాద సూక్తుల్ని, వాక్యాల్ని ఒక్కదరికి చేర్చి శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించు దాతృత్వ సంస్థ మొట్టమొదటి ప్రచురణగా రాజమండ్రిలో ప్రచురించాం. బౌద్ధోద్యమ కారుల ఇంటర్వ్యూలు అప్పట్లో ‘సద్ధమ్మ స్వరాలు’ పుస్తకంలో అనుబంధంగా చేర్చిన దేవగుప్తపు పేర్లింగమ్, యాళ్ళ సూర్య నారాయణ ఇంటర్వ్యూలు ఎంతో విలువైనవి!
భావోద్యమ సైన్సు ప్రచార సంఘాలు, ఇతరేతర ప్రజా సంఘాలు ఇకనైనా పూనుకుని మహత్తర ప్రజా ప్రయోజనం కోసం యాళ్ళ దంపతులు స్థాపించిన మహాసంస్థ ‘శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించు దాతృత్వ సంస్థ’ ను సమిష్టిగా కాపాడుకోవడం కోసం కనీస ప్రయత్నంగా ఒక యాక్షన్ కమిటీగా ఏర్పడటం ఈనాటి అవసరం అని ఎంతో మంది దగ్గర మొత్తు కున్నా ప్రయోజనం లేదు కాన, సైన్సు కార్యకర్తలు, ప్రజాతంత్ర వాదులు కనీసం ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజా సంఘాల నాయకులు త్వరలో మాయం కానున్న ఆ మహా సంస్థని ఒకసారి దర్శించి వీలుంటే తరించ మనవి.
(అర్ధరాత్రి, అపరాత్రని లేకుండా అనేకసార్లు నాకు ఆతిథ్యం ఇచ్చి, ఇప్పటికే శిథిలా వస్థలోకి వెళ్ళిపోయిన ఆ సంస్థ ను చూసి రమ్మనమని అటువైపు వెళ్ళే అందరికీ చెబుతుంటాను. యాళ్ళ సూర్యనారాయణ మరణించిన ఐదేళ్ళ తరువాత ఏదో అనాధ ఆశ్రమంలో ఉన్న సరస్వతమ్మ గారు కూడా మొన్నీమధ్యనే మరణించారని తెలిసింది. ప్రజలకోసం జీవితాన్ని త్యాగం చేసిన యాళ్ళ ‘విరసం’ మొదలు హేతువాద సంఘాలవరకూ అనేక ప్రజాసంఘాలకి సానుభూతిపరుడు. పార్వతీపురం కుట్రకేసులో ముద్దాయి. తెలుగులో లెక్క లేనన్ని సంఘాలకి గుప్తదాత. తమ సంఘంలో సభ్యుడు కాదన్న కారణంలో తెలుగులోని భావోద్యమ ప్రజాసంఘాలు ఆయన చేసిన కృషిని గుర్తించకపోవడం, నక్కల పాలు కానున్న ఆయన సంస్థని కనీసం కాపాడు కునేందుకు ముందుకు రాక పోవడం వాటిలో గూడు కట్టుకున్న అపారమైన సంకుచితత్వానికి ప్రతీకని పేర్కొంటూ సరస్వతమ్మ కి అశ్రు నివాళుల తో ఈ చిన్న రైటప్.)
Also read: మద్యమా? మానవ మనుగడా?
– గౌరవ్