ప్రముఖ రచయిత, కవి వైవిఎల్ఎన్ శాస్త్రికి తెలుగు విశ్వవిద్యాయలం కీర్తి పురస్కారం ప్రదానం చేసింది. సెప్టెబర్ 22న జరిగిన సమావేశంలో శాస్త్రికి శ్రీబులుసు బుచ్చి సర్వారాయుడు స్మారక కీర్తి పురస్కారాన్ని అందజేశారు. విశ్వవిద్యాలయ కులపతి తంగెడ కిషన్ రావు, తెలంగాణ ప్రెస్ అకాడెమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ బుద్ధా మురళి, తదితరులు కలిసి పురస్కారం ప్రదానం చేశారు. తెలుగు సినిమాలలో హాస్యం గురించి రాసిన పుస్తకాన్ని పురస్కరించుకొని శాస్త్రికి ఈ పురస్కారం ప్రదానం చేశారు.
యడవల్లిగా ప్రసిద్ధి చెందిన యడవల్ల వేంకట లక్ష్మీనరసింహశాస్త్రి సినిమా రచయిత. హాస్య స్ఫోరకంగా మాట్లాడతారు, రాస్తారు కానీ ఆయన హాస్య రాచయిత కాదు. విజయవాడలో పుట్టి, అక్కడే ఎంఏ వరకూ చదువుకొని మద్రాసు వెళ్ళి చిత్రసీమలో స్థిరబడిన రచయిత. ‘నక్షత్రాలు’ అనే కవితల సంపుటిని చిన్నతనంలోనే ప్రచురించారు. ఆరుద్ర అంటే వల్లమాలిన అభిమానం. అనేక సినిమాలకు కథలు రాశారు. మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. కొన్ని సినిమాలలో నటించారు. దర్శకత్వం వహించారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాలకు పని చేశారు. టీవీ సీరియళ్ళకు మాటలు రాశారు. ఇప్పటికీ సినిమాలకీ, టీవీలకీ పని చేస్తున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త సూరి భగవంతం మేనల్లుడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ కు ఇష్టుడు, బాలమురళీకృష్ణ పోలికలున్నవాడు.
తెలుగు సినిమాలపైన సాధికారికంగా వ్యాఖ్యలు రాశారు. ‘తెలుగు సినిమాలలో హాస్యం’ అనీ, ‘తెలుగు సినిమాలలో సామ్యవాదం’ అనీ పుస్తకాలు రాశారు. చాలా సంవత్సరాలు చెన్నైలో నివసించారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్ లో. ఇక్కడి నుంచే బెంగళూరు, చెన్నై వెళ్ళివస్తుంటారు. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా పని చేస్తున్నారు.