యడవల్లి వేంకట లక్ష్మీనరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) యడవల్లిగా ప్రసిద్ధుడు. స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్తాఫీసర్ గా పని చేసేవారు. విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడే యడవల్లి స్కూల్ ఫైనల్ చదివారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో పీయూసీ, లయోలా కాలేజీలో డిగ్రీ, తిరుపతి వెంకటేశ్వరవిశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. చిన్నతనం నుంచి సాహిత్యం ప్రవేశం ఉంది. విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా సినిమారంగానికి వచ్చారు. మాదిరెడ్డి సులోచన రాసిన తరం మారింది అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ మార్చడంలో యడవల్లి సాయం చేశారు. అందుకోసం చెన్నై వెళ్ళి అక్కడే స్థరపడ్డారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతంశ్రీనివాసరావుతో కలసి పని చేసే అవకాశం దొరికింది. కమలాకర కామేశ్వరరావుతో కూడా పని చేశారు. విక్టరీ మధుసూదనరావుతో ఆయన సొంత సినిమా ‘ఆత్మకథ’కు పని చేశారు. అప్పటి నుంచి సినిమాలకోసం వెతుక్కోకుండా చేతినిండా పని ఉండేది. తెలుగుసినిమాలతో పాటు కన్నడ సినిమాలకు కూడా పని చేస్తూ చెన్నైకీ, బెంగళూరికీ మధ్య తిరుగుతూ ఉండేవారు. నటీమణి లక్ష్మి యడవల్లిని కన్నడ సినీపరిశ్రమకు పరిచయం చేశారు. ఇంతవరకూ యడవల్లి పదిహేను కన్నడ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ‘శ్రీశంకర’ అనే ప్రతిష్ఠాత్మకమైన కన్నడ చిత్రానికి రచన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇది శంకరభగవద్పాదుల జీవితంపై సినిమా. అనూహ్యమైన పరిస్థితులలో ఒక తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘తెలుగు సినిమాల్లో హాస్యం’ పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు. నాలుగైదు దశాబ్దాల కిందటే ‘నక్షత్రాలు’ శీర్షికతో ఒక వచనా కవితా సంపుటిని ప్రచురించారు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. చాలా టీవీ సీరియళ్ళకు కథలు అందించారు. మాటలు రాశారు. ప్రస్తుతం యడవల్లి సెన్సార్ బోర్డు -సీబీఎఫ్ సీ (హైదరాబాద్) సభ్యులు. యడవల్లి రచించిన ‘తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు’ రచనను ‘సకలం’ ధారావాహికగా ప్రచురిస్తోంది. ప్రతి ఆదివారం శనివారం ఒక అధ్యాయం ప్రచురిస్తుంది. చదవండి. ఆనందించండి.
(ప్రారంభం వచ్చే శనివారం)
-ఎడిటర్
Eagerly waiting sir