Thursday, November 21, 2024

అక్షర తపస్వి యడవల్లి

యడవల్లి ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతి చెందలేదు. ఎక్కువ కష్టపడకుండా పోయినందుకు మంచిదే అనుకున్నాం. యడవల్లికి అనారోగ్యం సంగతి మాకు తెలుసు. మరణంకోసం ఎదురు చూస్తున్నట్టు కూడా ఎరుకే. సినిమారంగంలో ఒక వెలుగు వెలిగిన యడవల్లి మళ్ళీ కనిపించడంటే బాధగానే ఉంది. ‘‘మన సంఘ సభ్యులు, ప్రముఖ రచయిత శ్రీ వై.వి.యల్.యన్. శాస్త్రి (యడవల్లి)గారు నిన్న రాత్రి (11 ఫిబ్రవరి 2023, శనివారం) ఎనిమిది గంటలకు హఠాత్తుగా కాలం చేశారు. వారికి నివాళి అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యలకు తెలుగు సినీ రచయితల సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము’’ అంటూ తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉమర్జీ అనురాధ, కోశాధికారి డా. నటరాజ గోపాలమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.  

నెల కూడా కాలేదు కలుసుకొని. (ఎడమ నుంచి కుడికి) నాగేశ్వరరావు, ఉదయ్ శంకర్, యడవల్లి, ఉమామహేశ్వరరావు, రామచంద్రమూర్తి

యడవల్లి ప్రేమాస్పదుడు. స్నేహశీలి. ఆయన ఆరోగ్యం సరిగా లేదని తెలిసి నేనూ, ప్రముఖ సినిమా దర్శకులు ఉమామహేశ్వరరావు, మా మేనబావ చతుర్వేదులు ఉదయ్ శంకర్ కలసి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కారులో విజయవాడ వెళ్లాం. తమ్ముడు నాగేశ్వరరావు ఇంట ఉన్న యడవల్లిని కలుసుకున్నాం. కనుక్కునే సమయానికి నాలుగో దశకు చేరుకున్న కేన్సర్ ను నయం చేసుకోవడం అసాధ్యమనీ, కేమీ థెరపీలాంటివి అనవసరమనీ వైద్యులు సలహా చెప్పడంతో ఆయుర్వేదం మందులు వేసుకుంటూ తుదిపిలుపుకోసం నిరీక్షిస్తున్న యడవల్లిని కలిసి గంటసేపు జ్ఞాపకాలు కలబోసుకున్నాం. తమ్ముడూ, మరదలూ చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకుంటున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటూ బెంగళూరు, చెన్నై నగరాలకు తరచుగా ప్రయాణం చేస్తూ, సినిమా రచనలు చేస్తూ, మరో వైపు సెన్సార్ బోర్డులో బోలెడు పనులు చేస్తూ నిర్విరామంగా ఉండే యడవల్లికి ఒక్కసారిగా తన పని అయిపోయినట్టు అనిపించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ తమ్ముడి దగ్గరికి బయలు దేరాడు. సికిందరాబాద్ స్టేషన్ లోనే నిస్సత్తువతో కాలుదీసి కాలువేయలేని పరిస్థితిలో ఒక అపరిచిత యువతి తనకు సాయం చేసి తన పెట్టెను కంపార్టుమెంటులో పెట్టి తనకు వీడ్కోలు చెప్పిందని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాడు.

విజయవాడ వెళ్ళేవరకూ తనకు కేన్సర్ అని తెలియదు. విజయవాడలో తమ్ముడి చొరవతో వైద్య పరీక్షలు చేయిస్తే భయంకరమైన వ్యాధి మొత్తం శరీరాన్ని ఆక్రమించుకున్నదనీ, ఈ నేలపైన కొద్ది రోజులు మాత్రమే ఉంటారనే కఠోరమైన వాస్తవం తెలిసింది. యడవల్లికి సంతానం లేదు. భార్య పోయి చాలా సంవత్సరాలు అయింది. నాగేశ్వరరావు బ్యాంక్ లో అధికారిగా పని చేసి  ఉద్యోగవిరమణ తర్వాత విజయవాడలో ఉంటున్నారు. ఆయన కుమారుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కుమార్తె అమెరికాలో ఉంటారు. ఈ ఇద్దరు పిల్లలంటే యడవల్లికి ప్రాణం. ఇటీవలే ఇండియా వచ్చి వెళ్ళిపోయిన తమ్ముడి కుమార్తెను మళ్ళీ తనకోసం రావద్దని స్పష్టంగా చెప్పాడు.

యడవల్లి నాకు చిన్ననాటి మిత్రుడు. ఉదయ్ శంకర్ తండ్రి, అంటే మా మేనమామ, చతుర్వేదుల రామనరసింహం విజయవాడలో ప్రభుత్వ (ఎస్ ఆర్ ఆర్ అండ్ సీవీఆర్) కాలేజీలో హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ గా పని చేశారు. విశ్వనాథ సత్యనారాయణ సహోద్యోగి. వారు మంచి మిత్రులు. రామనరసింహం కాలం చేసినప్పుడు గాంధీ నగరంలో వారి నివాసానికి విశ్వనాథ వెళ్ళి చాలాసేపు కూర్చొని కుటుంబాన్ని ఓదార్చారు.

గాంధీ నగరంలో సొంత ఇల్లు కట్టుకోవడానికి ముందు రామనరసింహం కుటుంబం యడవల్లి ఇంట్లో ఒక వాటాలో అద్దెకు ఉండేవారు. యడవల్లి తండ్రి హెల్తాఫీసర్ గా ప్రసిద్ధులు. వారు పక్కపక్క వాటాలలో నివసించేవారు. ఇంటి యజమాని హెల్తాఫీసర్ గారు. వారికి ఇద్దరు మగపిల్లలు. వారిలో పెద్దవాడు యడవల్లి (వైవీఎల్ ఎన్ శాస్త్రి -పెదబాబా). చిన్నవాడు యడవల్లి  నాగేశ్వరరావు (చినబాబా). వాళ్ళిద్దరూ పొరుగున ఉన్న ఉదయ్ శంకర్ కు సహజంగానే మిత్రులు. నేను మా గ్రామం తల్లాడ నుంచి వేసవి సెలవుల్లో మా అమ్మగారితో కలసి మేనమామగారి ఇంటికి వెళ్ళేవాడిని. వారి చిరునామా వీధిరాజేయమేడకు ఎదురుగా, గోరీల దొడ్డి పక్కన, ఏలూరు రోడ్డు. బస్టాండ్ లో రిక్షా ఎక్కి ఈ అడ్రసు చెప్పడం మరచిపోలేని జ్ఞాపకం. ఆ సందర్భాలలో మా వయస్సు వారైన యడవల్లి సోదరులతో కలిసి

ఆడుకునేవాళ్ళం. ఒకరకంగా కలిసి పెరిగాం.

నేను జర్నలిజంలో ప్రవేశించడానికి ముందుగానే యడవల్లి మద్రాసు నగరం వెళ్ళాడు సినీ ప్రపంచంలో వెలగాలని. ‘ఉదయం’ పత్రికలో నేను సంపాదకత్వం చేపట్టిన తర్వాత 1989లో యడవల్లికి ఫోన్ చేసి మా సంపాదకవర్గంలో చేరవలసిందిగా ఆహ్వానించాను. ఆ సమస్యే లేదనీ, తాడోపేడో సినిమారంగంలో తేల్చుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాననీ, వాతావరణం అనుకూలంగానే ఉన్నదని చెప్పాడు. శుభాకాంక్షలు తెలిపాను. సినిమా రంగంలో ప్రవేశించడానికి ముందే ఆరుద్ర యడవల్లిని ఆవహించాడు. ‘నక్షత్రాలు’ పేరుతో ఒక కవితా సంకలనం ప్రచురించాడు. మంచి కవి, రచయిత. సినిమారంగంలో స్థిరపడ్డాడు. మద్రాసు నగరం టీనగర్ రంగనాథ స్ట్రీట్ లో నివాసం ఉంటుండగా నేను రెండు విడతల వెళ్ళాను. చాలా తెలుగు సినిమాలకు మాటలు, పాటలు రాశాడు. తెలుగు, కన్నడ సినిమాలకూ, తెలుగు, కన్నడ, తమిళ టీవీ సీరియళ్ళకూ పని చేశాడు. ప్రతిభ ఉన్నది కనుక చేతినిండా పని ఉండేది.  ఒక సినిమాలో డాక్టర్ గా నటించాడు. చాలాకాలం పెళ్ళి చేసుకోలేదు. యాభయ్ సంవత్సరాలు దాటిన తర్వాత తనకు పరిచయమైన అమ్మాయితో సహజీవనం చేశాడు. ఆమె యడవల్లికంటే వయస్సులో కాస్త పెద్ద. ఆకాశవాణిలో పనిచేసే రోజుల్లో వారి పరిచయం ప్రారంభమై ఆమె దూరదర్శన్ కు మారినప్పుడు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు కలగలేదు. మధుమేహం వ్యాధి ముదిరి భార్య పోయారు. మళ్ళీ ఒంటరి జీవితం. ఒక్కడే ఉండటం అలవాటైనా అందరితో స్నేహంగా ఉండటం, ముఖ్యంగా తమ్ముడు నాగేశ్వరరావుతో, ఆయన కుటుంబ సభ్యులతో సఖ్యంగా, ప్రేమగా ఉండటం ఆయన సహృదయానికి అద్దం పడుతుంది. దర్శకుడు ఉమామహేశ్వరరావుకు మద్రాసు రోజుల నుంచీ మంచి పరిచయం. ఉమామహేశ్వరరావు హేతువాది. వామపక్ష భావాలు కలిగినవారు. ఆయన భార్య భవాని భక్తురాలు. వారింటికి తరచు వెళ్ళే యడవల్లి ఆమెకు ఇష్టమైన భక్తిపుస్తకాలు ఇచ్చేవారు. సౌదర్యలహరి వంటి అరుదైన పుస్తకాలు భావానికి బహూకరించేవాడు. యడవల్లి మరణవార్త ఆమెకు ఎనలేని మనస్తాపం కలిగించింది. ఉదయ్ సోదరి స్వధ కూడా యడవల్లికి సోదరి. ఉదయ్ అంటే ప్రేమ, గౌరవం ఉన్నాయి. వారి మధ్య సాన్నిహిత్యం ఉంది. మమ్మల్ని అందరినీ ఉద్దేశిస్తూ ఇటీవల ఒక మెసేజ్ పంపించాడు యాడవల్లి. తనకోసం తమ్ముడూ, భార్య చాలా కష్టపడుతున్నారనీ, తనను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చమని తమ్ముడికి చెప్పాలనీ కోరాడు. అటువంటి పని చేయడానికి సిద్ధపడే మనస్తత్వం కాదు తమ్ముడిదీ, మరదలుదీ. చివరి క్షణం వరకూ కంటికి రెప్పలాగా చూసుకున్నారు. నాలుగైదు రోజులుగా యడవల్లి ఆహారం తీసుకోలేదు. అంతకు ముందు వేడివేడి జావలాంటి పదార్థాలు చేసి పెట్టేవారు.

ప్రాణమిత్రుడి ఆరోగ్యం బాగా లేదని తెలిసి మేము ముగ్గురు మిత్రులం ఆదివారం (15 జనవరి 2023)న హైదరాబాద్ లో బయలుదేరి వెళ్ళాం. చిన్ననాటి ముచ్చట్లూ, సినిమా సంగతులూ, తాను పబ్లిష్ చేసిన పుస్తకాలు, పబ్లిష్ అవుతున్న పుస్తకాలు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చిన పురస్కారం, నేను సంపాదకత్వం వహిస్తున్న ‘సకలం’ వెబ్ సైట్ లో ధారావాహికంగా ప్రచురించిన ‘తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు’ రచన, తదితర అంశాలపైన చాలా సేపు మాట్లాడుకున్నాం. నాగేశ్వరరావు సతీమణి భారతి ఇచ్చిన ఉపాహారం స్వీకరించి కాఫీ పుచ్చుకున్నాం. భారమైన గుండెలతో తిరుగు ప్రయాణం చేశాం.

‘తెలుగు చలన చిత్రాలలో ప్రగతి కిరణాలు’ అనే శీర్షికతో యడవల్లి పేరుమీద  ప్రచురించిన పుస్తకం ప్రతులను యడవల్లి మిత్రురాలు, దర్శకురాలు నాగశ్రీలక్ష్మి హాస్టల్ నుంచి తెప్పించుకొని శుక్రవారం రాత్రి విజయవాడ పుస్తక మహోత్సవంలో ప్రజాశక్తి ప్రదర్శనశాలలో లక్ష్మయ్యగారికి అందజేశాను. డెబ్బయ్ ఏళ్ళుగా విడుదలైన తెలుగుచిత్రాలను పరిశీలించి రాసిన ఈ పుస్తక ప్రచురణకు సహాయంగా తెలుగు విశ్వవిద్యాలయంవారు పదకొండు వేల రూపాయలు  ఇస్తామని వాగ్దానం చేశారు. ఈ పుస్తకం వెల రెండు వందల రూపాయలు. ప్రాప్తిస్థానం గ్లామర్ వరల్డ్ (ఫోన్:98491 04149). ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, రేడియో, టీవీ ప్రయోక్త డాక్టర్ ఓలేటి పార్వతీశం వంటి ప్రముఖులు ముందుమాట రాశారు. తెలుగు సినిమాపైన ఆసక్తిగలవారినీ, వామపక్ష భావజాలాన్ని ప్రేమించేవారినీ విశేషంగా ఆకట్టుకునే పుస్తకం.

నలభై ఏళ్ళుగా తెలుగు, కన్నడ చిత్రకథా సంభాషణ రచయితగా  యడవల్లి రాణించారు. దాదాపు 20 ధారావాహికలు రాశారు. ‘నక్షత్రాలు’ కవితా సంకలనం, ‘నీలాద్రి’ కథల సంపుటి ప్రచురించారు.  ‘దర్శక మాలిక-విజయవీచిక,’ ‘తెలుగుచిత్రాలలో హాస్యం (50 సంవత్సరాల పరిశీలన)’ పేరుతో పరిశోధన గ్రంథాలు  ప్రచురించారు. వివిధ పత్రికలలో విభిన్న విషయాలపైన దాదాపు 50 వ్యాసాలు రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర  ప్రభుత్వ గ్రంథాలయాల ‘సీడీ డీవీడీల’ ఎన్నిక కమిటీ సభ్యుడిగా 2007 నుంచి 2009 వరకూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేట్ సభ్యుడిగా (సెన్సార్ బోర్డు మెంబర్ గా) తుది శ్వాసవరకూ పని చేశారు. 2022లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం అందుకున్నారు.

మంచి మనసున్న, వివేకవంతుడూ, సృజనశీలి, సినీ మాధ్యమం ప్రేమికుడూ, అక్షర తపస్వి అయిన మన యడవల్లికి హృదయపూర్వకమైన నివాళి.  

Related Articles

1 COMMENT

  1. The memoir reflects the glimpses of life of Yadavalli garu. He is interested in humour and satire. Unlike other writers of the films he is well equipped with content and language. His lengthy talks on phone still are lingering in my ears. His friendly approach to reason is very much appreciative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles