Sunday, December 22, 2024

చైనాలో శాశ్వత నియంత షీ జిన్ పింగ్

  • పార్టీ, ప్రభుత్వం, సైన్యం జిన్ పింగ్ గుప్పిటలో
  • సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగులుతున్న నాయకత్వం
  • ప్రపంచాధిపత్యంకోసం అర్రులు చాస్తున్న చైనా
  • ఆర్థిక శక్తి, సైనిక చైనా దూకుడుకి కారణం
  • ప్రజాస్వామ్యం, బహుళత్వం పరిరక్షించుకుంటూ ఆర్థికంగా సత్వరం ఎదగడమే భారత్ పరమావధి

చైనా అధ్యక్షుడుగా జీవితాంతం అధికారాన్ని వెలగబెట్టడానికి షీ జిన్ పింగ్ అంతా తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు. మూడోసారి కూడా ఆయనే అధ్యక్షుడుగా నియామక మయ్యేలా పార్టీలో మార్గం సుగమం అయ్యింది. ఈ నెల 8 నుంచి 11 వరకూ పార్టీ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీ సమావేశాలు జరిగాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళలో సాధించిన విజయాలను గొప్పగా ఉద్ఘాటిస్తూ ‘చారిత్రాత్మక తీర్మానం’ చేసింది. రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్షుడుగా ఉండకూడదనీ, 68 ఏళ్ళ తర్వాత ఉన్నత పదవుల నుంచి విరమణ పొందాలనీ నియమాలు ఉండేవి. నేటి అధ్యక్షుడు జిన్ పింగ్ 68 ఏళ్ళకు చేరువయ్యారు. డెంగ్ జియావో పింగ్ హయాంలో పదవులపై పరిమితి విధించారు. జిన్ పింగ్ కు ముందు అధ్యక్ష పదవి నిర్వహించిన హూ జింటావో రెండు పర్యాయాల పదవీ కాలం ముగియగానే అధికారం నుంచి హుందాగా తప్పుకున్నారు. ఆర్ధికంగా చైనా ఈరోజు ఇంత శక్తివంతంగా మారడానికి పునాదులు వేసినవాడు డెంగ్. ఆ పునాదులపైనే హూ జింటావో నడుచుకున్నారు. డెంగ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇటు దేశంలోనూ -అటు అంతర్జాతీయ సమాజాలలోనూ ప్రజాస్వామ్యయుతంగానే ఆయన వ్యవహరించారు. జిన్ పింగ్ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశ విధానాలలో, స్వరూప స్వభావాలలో అనేక మార్పులు వచ్చాయి. ‘అది పేరుకే కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న దేశం, అధ్యక్షుడి వ్యవహారశైలి మొత్తం నియంతృత్వం’, అని జిన్ పింగ్ పరిపాలనా కాలంలో చెడ్డపేరు వచ్చింది. ఆ విమర్శలకు ఏ మాత్రం వెరవకుండా ఆయన ముందుకు వెళ్లారు. సాధారణంగా అక్కడ పార్టీదే సర్వాధికారం, అధ్యక్షుడి స్థానం ద్వితీయం. ఈ సంస్కృతిని, వాతావరణాన్ని జిన్ పింగ్ పూర్తిగా మార్చేశారు.

Also read: పద్యాన్ని పరుగులు పెట్టించిన కొప్పరపు సోదర కవులు

పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టు

ప్రతి క్షణం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, అనూహ్యంగా ఇటు ప్రభుత్వంలోనూ -అటు పార్టీలోనూ పూర్తి పట్టు సాధించారు. దానికి తగినట్లుగా ఎప్పటికప్పుడు తనకు వ్యతిరేకమని భావించిన వారందరినీ అణగదొక్కుతూ, తనకు పూర్తిగా అనుకూలమైన వారిని అందలం ఎక్కిస్తూ, సమాంతరంగా, పార్టీపై ఆధిపత్యాన్ని సాధించారు. మొత్తంగా చైనాలోనే తనకు ఎదురు నిలిచేవారు ఎవ్వరూ ఉండడానికి వీలులేదని మనసులో పన్నాగం వేసుకున్నారు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించారు. అందరినీ వశ పరుచుకున్నారు. వశంకారనుకొన్నవారిని మసిచేసి పారేశారు.  ఆ పేర్లు, జాబితా సుదీర్ఘం. ఆరో ప్లీనరీ సమావేశాల నాటికి, తను అనుకున్నట్లుగా పార్టీ తీర్మానాలు జరిగేట్టు విజయం సాధించారు. మూడోసారి కూడా అధ్యక్షుడుగా అధికారం చేపట్టడం ఇక లాంఛనమే. మూడోసారే కాదు,తన జీవితాంతం,తను ఎన్నాళ్ళు పదవిలో ఉండాలనుకుంటే  అన్నాళ్ళు ఉండేలా సర్వం సిద్ధం చేసుకున్నారు. తదనుగుణంగా  2018లోనే రాజ్యాంగ సవరణ ద్వారా అనుకూల వాతావరణం సృష్టించుకున్నారు. ఈ ఆలోచనా విధానాన్ని కొన్ని ఇతర దేశాల అధినేతలు కూడా అనుసరించే ప్రమాదం పొంచి ఉంది. శాశ్వతంగా రాజ్యాధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకోడానికి కావలసిన రాజ్యాంగ సవరణలు వారు కూడా చేసుకోనే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భారతదేశం కూడా ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. అటువంటి దేశాల విషయంలో సాధ్యాసాధ్యాలు కాలగమనంలోనే తెలుస్తాయి. చైనా అమేయశక్తిగా రూపాంతరం చెందడానికి సాధించిన ఆర్ధిక పటుత్వం, స్వావలంబనే మూల కారణాలు. రేపో మాపో అమెరికాను సైతం అధిగమించి, అగ్రరాజ్యంగా చైనా అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని ప్రపంచ ఆర్ధిక రంగ నిపుణులు జోస్యం చెబుతున్నారు. సాంస్కృతిక విప్లవం తీసుకురావడంలో మావో, ఆర్ధిక సంస్కరణలు తేవడంలో డెంగ్, శాశ్వత అధ్యక్షుడిగా అధికారాన్ని కలిగిఉండడం ద్వారా జిన్ పింగ్ ప్రత్యేకతను చాటుకున్నారు. అధికార కేంద్రాలైన పార్టీ, కేంద్ర మిలటరీ కమిషన్, దేశాధ్యక్ష పదవులను జిన్ పింగ్ ఏక ఛత్రాధిపతిగా నిర్వహిస్తున్నారు. 2022లో బీజింగ్ లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించబోయే ప్లీనరీ సమావేశాల్లో ఆయనను మూడోసారి అధ్యక్షుడుగా ఎంపిక చేస్తారు. పూర్తి అవకాశవాద దృక్పథంతోనే, ఆర్ధిక ప్రయోజనా పరంగానే, స్వార్ధచింతనతోనే జిన్ పింగ్ వ్యవహరించుకుంటూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగా చైనీయుల కష్టపడే మనస్తత్వం, పనిసంస్కృతి, క్రమశిక్షణ ఆ దేశ అభివృద్ధికి దోహదంగా నిలిచాయి. సరిహద్దు దేశాలను అదుపులోకి తెచ్చుకోడానికి జిన్ పింగ్ అన్ని మార్గాలను అనుసరిస్తూ వస్తున్నారు.

Also read: ఆంధ్ర, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం హర్షణీయం

అమెరికా వ్యతిరేక దేశాలతో, తటస్థ దేశాలతో స్నేహం

శ్రీలంక,బంగ్లాదేశ్, నేపాల్ మొదలైన వాటన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు. రష్యాతో స్నేహ సంబంధాలను విస్తృత పరుచుకున్నారు. పాకిస్తాన్ సహా ఇస్లామిక్ దేశాలన్నింటితో బంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. తాలిబాన్ కు తాయిలాలు వేసి ఆఫ్ఘనిస్థాన్ ను దారిలోకి తెచ్చుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా వ్యతిరేక దేశాలన్నింటినీ తమ వైపు ఏకీకృతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  అగ్రరాజ్యానికి అనుకూలంగా ఉండే దేశాలపై కక్ష సాధింపు చర్యలు, కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. తమ మాటకు తలవగ్గడం లేదని, అమెరికాకు బాగా దగ్గరవుతోందని భారతదేశాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి చైనా చేయని ప్రయత్నాలు అంటూ లేవు.  సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. భారత్ ను ఒంటరి చేయాలని చూస్తోంది. మన దేశ భూభాగాలని దురాక్రమించాలనే సామ్రాజ్య విస్తరణ కాంక్షతో చైనా రగిలిపోతోంది. తాజా పరిణామాలతో, షీ జిన్ పింగ్ బలం ద్విగుణీకృతమైంది. ఆ దేశంలో తిరుగులేని నాయకుడుగా తనను తాను మలుచుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగి, ఆర్ధికంగా ద్వితీయ స్థానానికి ఎదిగి, అగ్రరాజ్య అవతరణ దిశగా ముందుకు దూసుకెళ్తున్న చైనాతో, నియంతృత్వ పోకడలు, సర్వ అధికారమే పరమావధిగా సాగుతున్న ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో చాలా దేశాలకు ప్రమాదమే పొంచివుంది. మానవత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, విలువలు, సంస్కారం, సర్వమత సహనం, సర్వ జాతుల హితం మొదలైన ఆశయాలు పునాదులుగా నిర్మాణమైన భారతదేశం, విలువలను కాపాడుకుంటూనే, అమేయ ఆర్ధిక శక్తిగా ఎదగడం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా గుర్తెరగాలి.

Also read: బీజేపీపై కాలుదువ్వుతున్న కేసీఆర్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles