జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీచింది. సీఎం దగ్గర తమ పలుకుబడి ఉపయోగించి తమ బంధువులకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా తమ వారిని గెలిపించుకోలేక పోయారు.
గాంధీనగర్ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ముషీరాబాద్ శాసన సభ్యుడు ముఠాగోపాల్ బంధువు పద్మ బీజేపీ అభ్యర్థి పావని చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ డివిజన్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ప్రచారం చేసినా అభ్యర్థిని గెలిపించు కోలేకపోయారు.
ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆయన భార్య స్వప్నకు టికెట్ ఇప్పించుకుని హబ్సిగూడ డివిజన్ నుంచి రెండోసారి బరిలోకి దింపారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి పర్యవేక్షించిన రాంనగర్ డివిజన్ నుంచి దివంగత హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస రెడ్డి బరిలో దిగారు. ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
సీఎం కేసీఆర్ దగ్గర మంచి పలుకుబడి సంపాదించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముషీరాబాద్ రీజియన్ కు ఇంఛార్జిగా వ్యవహరించి ప్రచారం నిర్వహించారు. ముషీరాబాద్ పరిథిలోని ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డిది అదే పరిస్థితి. ఆయన ఇంఛార్జిగా వ్యవహరించిన సరూర్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
ధర్మపురి విశ్వాసం :
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో నిజమాబాద్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కవిత అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపుతో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేసిన సీఎం మేనల్లుడు హరీష్ రావును ఓడించామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరపున అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్ ను బీజేపీ ఓడించిందని అన్నారు. ఇక 2023 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను కూడా ఇంటిదారి పట్టిస్తామని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
also read :జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు