Tuesday, November 5, 2024

సరైన ప్రశ్నకు తప్పుడు సమాధానమే మతం!

ఈ దేశంలో ఇప్పుడు అధికారంలో ఉండి, ప్రజలకు తప్పుడు సమాధానాలు ఇస్తున్నవారెవరూ? ప్రస్తుత పాలకులే! మతాన్ని ఒక తప్పుడు సమాధానంగా ప్రజల ముందుకు తేవడం – పైగా, ప్రశ్నించినవారిని జైలుకు పంపడం. లేదా చంపేయడం చేస్తున్నారు. అంతకన్నా ఈ పదేళ్ళ కాలంలో వీరు సాధించింది ఏముందీ? కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? ‘‘ప్రజలకు నిజమైన ఆనందాన్ని ఇవ్వాలంటే భ్రమలు కల్పించే మతాన్ని రద్దు చేయాలి. భ్రమలు పోవాలని కోరడమంటే ఆ భ్రమలు కలిగించే పరిస్థితుల్ని మనం మార్చుకోవాలి!’’ అని!

అబ్బే ఇలాంటి మాటలు మన దేశ నాయకులకు చెవికెక్కవు. ఎక్కినా అస్సలు అర్థం కావు. ‘‘భారత దేశానికి దేవుడిచ్చిన బహుమానం మోదీ’’ అని అన్నారు వెంకయ్య నాయుడు. ఆయన దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు. మధ్య ప్రదేశ్ వ్యవసాయ మంత్రి మరింత రెచ్చిపోయి ‘‘మోదీ రాముడు, కృష్ణుడు లాగా దేవుడి అవతారమని’’ పొగిడాడు. ‘‘దేవతల రాజు మోదీ’’- అని అన్నది ఎవరో కాదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా. ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలని దేశ ప్రజలు అనుకుంటే దానికి బీజేపీ వారి ప్రమేయం లేదు. ‘‘వీరికి కనీస ఇంగితజ్ఞానం ఉందా?’’ అని దేశ ప్రజలు అనుమాన పడుతున్నారు. పోనీ ఒక దార్శనికుడి గురించి కొంచెం ఎక్కువగా చెబుతున్నారులే – అని సర్దిచెప్పుకుందామంటే అది కూడా కాదాయె. ఎవరి గురించి చెప్పుతున్నారో ఆయనకు చదువు, సంస్కారం, ఆలోచన ఏదీ లేదు. కార్పొరేటర్లకు పాలేరు!

Also read: లలైసింగ్ జీవన సంఘర్షణ మనకు ఆదర్శం!

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా అన్నారు – ‘‘మోదీ కాకపోతే ఇంకెవరూ? అని అడుగుతారు. గత ఐదేళ్ళలో ఆయనేం చేశారో చూడండి. ఐదుకోట్ల  ఉద్యోగాలు పోయాయి. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్, లోక్ పాల్, సీబీఐ, సీవీసీ, ఎన్ ఐఏ, మీడియా – అన్నిటినీ వశపరుచుకున్నారు. మూకదాడులు, ద్వేషపూరితమైన  అసత్యవార్తా ప్రసారాలు, కలుషితమైన సామాజిక మాధ్యమాలు ఎన్నని చెప్పుకోవడం? ఇంకా మరో ఐదేళ్ళు గనక పోరపాటున వారికి అవకాశం ఇస్తే – వేల వేల ఏళ్ళుగా సాధించుకున్న నాగరికతను వదిలేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ మూడు వేల ఏళ్ళనాటి జీవ పరిణామ దశలకు వెళ్ళిపోవాల్సిందే!’’ మతాన్ని బూచిగా చూపుతూ పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎవడి పైసలతో వాడే బ్యాంక్ ఎక్కౌంట్ తెరిస్తే దాని పేరు ‘‘జనధన్’’- ఎవడి ఇల్లు వాడే ఊడ్చుకునేదానికి ‘‘స్వచ్ఛభారత్’’- ఎవడి పిల్లల్ని వాడే కని పెంచుకుంటే దానికి ‘‘బేటీ బచావ్ బేటీ పఢావ్-’’ అని పేరు. ఆ పిల్ల కోసం ఎకౌంట్లో పైసలు దాస్తే ‘‘సుకన్య సమృద్ధి యోజన’’ అని పేరు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రజలకేం చేసినట్టు? ఈ మాత్రం దానికి పిచ్చివాళ్ళంతా గంతులేస్తూ తప్పెట్లూ తాలాలతో ప్రచారాలు చేస్తున్నారయ్యే. ఈ దేశ ప్రజల ప్రాణాలకు భలే మోపయ్యారు. వీరంతా ‘హిందూమతోద్ధారకులు!!’

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుండి మన్ మోహన్ సింగ్ దాకా 14 మంది భారద ప్రధానుల కాలంలో దేశానికి యాభై ఆరు లక్షల కోట్లు అప్పు తెచ్చారు. మోదీ వచ్చాక అతనొక్కడే చేసిన అప్పు ఎనభై లక్షల కోట్లు. పోనీ ప్రాజెక్టులు కట్టారా?- లేదు. ఉపాధి పెరిగిందా? – లేదు. నిరుద్యోగం పెరిగిందా? – అవును. రూపాయి విలువ పడిపోయిందా? – అవును. హంగర్ ఇండెక్స్ లో భారత దేశం చివరికి చేరిందా? – అవును. ఇంత సిగ్గుచేటుగా ఉంటే మోదీ ప్రభుత్వం హిందుత్వ పేరుతో కాలయాపన చేస్తూ ఉంది కదా? బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్న దేశాలు కూడా హంగర్ ఇండెక్స్ లో భారద దేశం కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. గుడ్డిగా మోదీ భజన చేసేవారు, అభివృద్ధిని పక్కకు తోసి మతాన్ని పట్టుకొని వేళ్ళాడేవారు. విషయాలు వివరంగా తెలుసుకోవడం అవసరం. ఇలాంటివారిని చూసి కాబోలు ప్రపంచ ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ అన్నాడు – ‘‘అజ్ఞానంతో కూడిన ఆత్మవిశ్వాసం విజయానికి దారితీస్తుంది’’ అని! అజ్ఞానులకు, మూఢులకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నాం కదా ప్రస్తుత పాలకుల్ని? మత మార్పిడులకు పాల్పడుతున్న అక్రమ చర్చ్ లను తక్షణం బుల్ డోజర్లతో కూల్చేయాలని కర్ణాటక – శ్రీరామ సేన చీఫ్  ప్రమోద్ ముతాలిక్  ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. వేలాది హిందువులను బలవంతంగా క్రైస్తవంలోకి మారుస్తున్నారనీ – మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న చర్చ్ లన్నింటినీ కూల్చేయాలంటూ చట్టం చేయాలని ఆయన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకప్పుడు బౌద్ధదేశంగా వర్థిల్లిన దేశాన్ని నాశనం చేసి, మరమ ఛండాలంగా, పరమ కిరాతకంగా తయారు చేసిన వైదిక మతం గురించి మాట్లాడరెందుకూ? విషయాలు తెలుసుకోకుండా మోదీ, మోదీ భక్తులు తాము ‘శూద్రుల’మని మరచిపోయి బ్రాహ్మనిజానికి పల్లకీ మోయడం అవసరమా? శతాబ్దాలుగా అణచివేతకు గురైంది చాలదా? స్పృహలోకి వచ్చే పనే లేదా? ‘‘నా కులం గొప్పది. నా మతం గొప్పది అనేవాడిని చూసి కోపం తెచ్చుకోకండి! వాణ్ణి చూసి జాలి పడండి. ఎందుకంటే వాడొక మానసిక రోగి’’- అని అన్నారు డా. బి. ఆర్. అంబేడ్కర్.

Also read: దేశప్రేమికుల్ని ఎగతాళి చేస్తున్న దేశద్రోహులు

ఎంత గణితశాస్త్రజ్ఞులైనా తేల్చలేని మోదీ లెక్కలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇలా ఉంది. మోదీ పుట్టింది 1950. ఇల్లు విడిచి పారిపోయింది 1971. వాద్ నగర్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది 1976. ఆయన టీ అమ్మిన సంవత్సరం ఏదీ? కనుక్కోండి. చూద్దాం. రైల్వే స్టేషన్ ప్రారంభం కాకముందే ఆయన అక్కడ టీ అమ్మానని చెప్పారు. దేశంలో ఇ-మెయిల్ లేని రోజుల్లోనే ఆయన ఇ-మెయిల్స్ పంపారట. ఆరో తరగతిలో స్కూల్లో పేరు తీసేస్తే కనపడకుండా పోయినవాడు కరన్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోగుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను హైస్కూలు  వరకూ చదువుకున్నాననీ చెప్పారు. అంతటితో ఆగాడా? ప్రధాని అయ్యేసరికి ఒక యంఏ డిగ్రీ సృష్టించుకున్నాడు. అబద్ధాలకు లెక్కాపత్రం ఉండవు కదా? సరే – మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి, మన భారత ప్రధానుల విద్యార్హతలు చూద్దాం.

  1. జవహర్ లాల్ నెహ్రూ యంఏ (కేంబ్రిడ్జ్), లా (లండన్). 2. లాల్ బహద్దూర్ శాస్త్రి – బిఎ (ఫిలాసఫీ), బనారస్. 3. ఇందిరాగాంధీ హిస్టరీ, పోలిటిక్స్, ఆక్స్ ఫర్డ్ , 4. మొరార్జీదేశాయ్ – బిఎ (బొంబాయ్), ఐసీఎస్, 5. చౌధరీ చరణ్ సింగ్ – బిఎస్సీ, యంఎ ఎల్ఎల్ బీ (ఆగ్రా), 6. రాజీవ్ గాంధీ –బిఎ (కేంబ్రిడ్జ్), పైలట్ కోర్స్ (ఢిల్లీ) 7. వి.పి. సింగ్ – బిఎ, బియెస్సీ, ఎల్ఎల్ బి (అలహాబాద్/పూనా) 8. చంద్రశేఖర్ – బిఎ (అలహాబాద్). 9. పివి నరసింహారావు బిఎ (పూనా), ఎల్ఎల్ బీ (నాగపూర్). 10. హెచ్ డి దేవగౌడ – సివిల్ ఇంజనీరింగ్ (బెంగుళూరు). 11. ఐకె గుజ్రాల్ – ఎంఎ (లాహోర్). 12. అటల్ బిహారీ వాజపేయి – ఎంఎ (ఆగ్రా), 13. మన్మోహన్ సింగ్ – ఆర్థికశాస్త్రవేత్త: బిఎ (పంజాబ్), యంఎ (కేంబ్రిడ్జ్), పీహెచ్ డీ (ఆక్స్ ఫర్డ్). 14. నరేంద్రమోదీ – అధికారికంగా తెలియదు. రైట్ లు ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ)లో మినహాయింపు పొందారు. కేవలం అబద్దాలు మాత్రమే మాట్లాడుతూ, నైతికంగా దిగజారి దొంగ యంఎ డిగ్రీ తెచ్చుకున్నారని తెలుసుకున్న ఈ దేశ ప్రజలు అతణ్ణి విజ్ఞుడుగా, దార్శనికుడిగా ఎలా గుర్తిస్తారు?
  2. Also read: టర్కీలో బౌద్ధం ఎందుకుందీ, ఎలా ఉంది?

ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆరెస్సెస్, బీజేపీ పాలకులు – ఈ దేశం సెక్యులర్ దేశం అని గుర్తించరు. అసలు ప్రకృతిలోనే సెక్యులర్ లక్షణాలు ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోగల స్థాయి వారికి లేదు. ఉదాహరణకు చూడండి – నేల మీద పాకే చీమ నుండి, నింగి వైపు ఎదిగిన మహావృక్షం దాకా, నింగిలో విహరించే పక్షి నుండి నీటిలో ఈదే చేపదాకా అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడ్డవే. జీవులన్నీ ఒకటే – జీవ వైవిధ్యమంతా ఒకటే- జీవుల్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం లోనే మనిషి వివేకం ఉంది. ఒక్క మనిషే బతకాలి. మిగతా జీవులన్నింటినీ నాశనం చేయాలి – అని అనుకోవడం మూర్ఖ లక్షణం. బతకడమూ- బతకనివ్వడమూ అవసరం. సామాజిక, రాజకీయ పరిపాలనా రంగాలకైనా …ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక దేశంలో అందరూ ఒక్క భాషే మాట్లాడాలి. ఒక్క తిండే తినాలి. ఒక్క ఆలోచనే చేయాలి. ఒక్క జైశ్రీరామ్ అనే అనాలి – అన్నది మూర్ఖుల సిద్ధాంతం. ఏ ఒక్కటీ ఒకటిగా మనలేదు. అది ప్రకృతి ధర్మం! ఏ ఒక్క దేశమూ ఇతర దేశాల సహాయ సహకారాలు లేకుండా అభివృద్ధి సాధించలేదు. ఇతర భాషాపదాలను కలుపుకోని భాష ఏదీ లేదు. ప్రతి జీవికీ సమయానికి ఆహారం కావాలి. నిజమే! కానీ, ఒక్కో జీవికి ఒక్కోసారి ఒక్కో ఆహారం అవసరమౌతుంది. అందరూ ఒక లాంటి తిండే తినాలంటే కుదరదు. తినాలని శాసిస్తే అసలే కుదరదు. ఒక్క జైశ్రీరామ్ అంటే కుదరదు. ఉత్తర భారతదేశంలోనే చాలా ప్రాంతాల్లో జై సీతారామ్/ సియారామ్- అని అంటారు. సీత లేని రాముడి అస్థిత్వాన్ని ఒప్పుకోరు. ఈ దేశంలో మూర్ఖుల సంఖ్య అధికం గనక, భార్యను ఏలుకోనివాణ్ణి ప్రధానిగా ఒప్పుకున్నారు. అయితే, మూర్ఖుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

ఈ దేశానికి నెహ్రూ చూపించిన వైజ్ఞానిక స్పృహ- మార్గాన్ని వదిలేసిన ప్రస్తుత ప్రధాని నేతృత్వంలో ఏం జరుగుతోందో చూడండి. చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, భారతం, వేదాలు,    ఆయుర్వేదం వంటి వాటికి చోటు కల్పించినట్టు ఎన్ సి ఇ ఆర్టీ చైర్మన్ సిఐ ఐజాక్ ప్రకటించారు. 7 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు ఇవి నేర్పిస్తూ, వారిలో దేశభక్తిని పెంపొందిస్తామని అన్నాడు. దేశభక్తి లేకపోవడం వల్ల వేలమంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళిపోతున్నారని వాపొయ్యాడు. ఉద్యోగావకాశాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టలేకపోయిన చైర్మన్ నుంచి అంతకన్నా ఏమి ఆశించగలం? కేంద్రానికి వత్తాసు పలికాడని అర్థం చేసుకోవాలి! అసలు రామాయణ, మహాభారతాలు భారతీయ సంస్కృతి ఎలా అయ్యాయీ – వాటికి దొరికిన ఆధారాలేమిటో చెప్పాలి కదా? అది చేతకాదేం?

తమిళనాడు రాష్ట్రంలో అన్ని ధియేటర్లలో సినిమా ప్రారంభంలో  – భారత రాజ్యాంగం ద్వారా సుమారు వంద కోట్లమంది ఈ దేశ ప్రజల బానిస సంకెళ్ళను తెంపిన మహావ్యక్తి డా. బి.  ఆర్. అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి అయిదు నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశించారు. ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రులూ, రాష్ట్రపతులూ అవుతున్నారన్నది గ్రహించాలి. అణగారిన వర్గాలకు  అధికారం వస్తే ఇలా సమాజాన్ని జాగృతం చేసే నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూంటారు. ఈ దేశంలోని సామాన్య ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, ఇక నాయకులను ఎన్నుకోవలసి  ఉంటుంది.

‘‘రాహకె పత్తర్  బడ్ కె/కుచ్ నహీ హై మంజిలే/రాస్తే ఆవాజ్ దేతీ హై/సఫర్ జారీ రఖో’’ – అంటే దీని అర్థం – దారిలో ఉన్న రాళ్ళకంటే/ఎక్కువేం కాదు గమ్యాలు/ప్రయాణం కోనసాగిస్తుండమని/రహదారులు పిలుస్తున్నాయ్!’’   

ఏమీ అయిపోలేదన్న ఆశాభావం పై కవితా పంక్తులలో కనిపిస్తోంది. ఈ దేశ ప్రజలు తమ ప్రయత్నం, తమ ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. దారిలో మైలురాళ్ళలాగా పాలకులు వచ్చిపోతుంటారు. మతాన్ని పక్కన పెట్టి, అభివృద్ధిపైనే దృష్టిపెట్టే నాయకుల్ని ఎన్నుకోవాలి!

Also read: డిగ్రీలు లేని ప్రిన్సిపాలూ, మరో పరిశోధకుడు

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త: మెల్బోర్న్ నుంచి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles