Sunday, December 22, 2024

అలవోకగా ఆత్మకథా రచన

(సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)
  • ఇంటర్వ్యూ: సుప్రసిద్ధ కవయిత్రి మందరపు హైమావతి
(ఇంటర్వ్యూ రెండో భాగం)
  1. ప్ర. మీ జీవితం గురించి, రేడియోలో మీ ఉద్యోగ విషయాల గురించి ‘వేణునాదం’ పుస్తకం రాశారు మీరు. ఒక మారుమూల చిన్న ఊరిలో ఊపిరి పీల్చుకొన్న మీరు ఒక ప్రసిద్ధ రచయితగా, సంపాదకులుగా, విభిన్న కార్యక్రమాల రూపశిల్పిగా జీవితంలో ఉన్నత శిఖరాలందుకొన్న విధం ఎందరికో స్ఫూర్తిదాయకం! ఈ పుస్తకం గురించి వివరించండి.
జ. నా అరవయ్యో యేట 2020 అక్టోబర్ లో వెలువడిన నా 61వ పుస్తకమిది. నిజానికి ఆంధ్రప్రభ ఆదివారం సంచికకోసం రాసిన కాలమ్ వ్యాసాలు వి. నాగరత్న కోరికమీద వీటిని ప్రారంభించాను. ఏ వస్తువు ఆధారంగా రాయాలనే విషయం గురించి నాకే స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆదివారం సంచికలో 2012-2014 మధ్య కాలంలో మా పల్లె గురించి, నా కుటుంబం గురించి, చదివిన పాఠశాలల గురించి, పనిచేసిన ఊళ్ళ గురించి, పరిచయమైన వ్యక్తుల గురించి రాసిన తళుక్కుమనే అనుభవాలతో కూడిన వ్యాసాలివి. బొమ్మతో కలిపి, పేజికి మించకుండా రాశాను. అంటే నా జీవితం మీద అంతరవరకు ప్రగాఢంగా ముద్ర వేసిన కొన్ని సందర్భాలను కొంత వరకు డాక్యుమెంట్ చేయగలిగాను. నిజానికి ఆకాశవాణిలో నా సర్వీసు ముగిసే సంవత్సరంలో ఆ సంస్థ గురించి నేను రాసిన పుస్తకం అప్పటికే పుష్కరం పాటు నలుగుతూ వచ్చింది కానీ, ఒక మిత్రుడి ప్రేమ కారణంగా అది మధ్యలో ఆగిపోయింది.  ఆ పుస్తకం ఇప్పటికీ వెలుగు చూడలేదు. బహుశ వచ్చే సంవత్సరం వెలువరించగలను. కనుక ఆ సందర్భానికి తగినట్టుగా కొంత నా గురించి, కొంత నా ఆకాశవాణి జీవితం గురించి తెలిపే వ్యాస సముచ్ఛయం ఆ వ్యాసావళి. నిజానికి ‘వేణునాద’మనే శీర్షిక ఆ  పత్రికా సంపాదకవర్గం ఎంచుకుని నిర్ణయించింది. సాధారణంగా ఈ విషయంలో నేను పట్టింపులకు పోను. కానీ అందులో  నా వ్యాసాలు నిత్య నూతనంగా, వైవిధ్యభరితంగా,ఆసక్తికరంగా ఉండేలా శాయశక్తులా కృషిచేస్తాను. షార్ కేంద్రంలో పనిచేసిన డా. ఎస్. శేషగిరిరావు అనే శాస్త్రవేత్త “ఇంత ఎఫెక్టివ్ గా ఆత్మకథ రాయొచ్చా అలాగే స్వోత్కర్ష ప్రమేయం లేకుండా వ్యాసాలను భలే నడిపారు!”అని ఎంతగానో అభినందించారు. నా జీవిత నేపథ్యపు రాసాయనిక ధర్మాన్ని ఎంతో కొంత తెలిపే ఈ రచనను అలవోకగా చేశాను. అదే పద్ధతిలో ఈ పుస్తకం ఆదరణపాత్రమైంది. ఆ మేరకు నాకు ఎంతో తృప్తి వుంది. మీరు అడిగారు కనుక ఒక విషయం చెప్పాలి. ఎవరు ఎలా వ్యాఖ్యానించినా అభ్యంతరం లేదు. ఎక్కువ జనసామాన్యానికి పనికొచ్చే రీతిలో కార్యక్రమాలు రూపొందించడం ఆకాశవాణి విధి. అలాగే సమాజంలోని అన్ని స్థాయిల్లోని వ్యక్తులను అంటే కళాకారులను, మాన్యులను, సామాన్యులను భాగస్వాములను చేయడం ఇందులో ప్రధానం. అదే సమయంలో రేడియో మీడియం ప్రక్రియాపరమైన వైవిధ్యానికి, సృజనకు లోటు జరగకుండా జాగ్రత్తపడాలి. ప్రతి నెల సాధ్యమైనంత ఎక్కువమందిని పరిచయం చెయ్యడమే కాకుండా తప్పనిసరి పరిస్థితి అయితే కాని, పునఃప్రసారాన్ని చేసేవాడిని కాను. అలాగే ఆయా ఆకాశవాణి కేంద్రాల కార్యక్రమ పరిధిలో రాని కళాకారులకు అవకాశం ఇవ్వడానికి అంత ఉత్సాహం చూపేవాడిని కాదు! ఈ విషయాలన్నీ ఆకాశవాణి మాన్యువల్ లో వివరంగా, పద్ధతిగా పొందుపరిచారు. వాటిని పాటించానే కానీ నా తోటి ఉద్యోగులు ఎలా చేస్తున్నారు? అంత క్రితం ఉద్యోగులు ఎలా నడుచుకున్నారో?… అని ఖాతరు చేసేవాడిని కాను. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాను. ఈ కారణాల రీత్యా కొందరికి అసౌకర్యం కలిగి వుండవచ్చును. దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు! కనుకనే అన్ని ఆకాశవాణి కేంద్రాలలో పాతికేళ్ళుగా నేను చేసిన కార్యక్రమాలు పదే పదే పునఃప్రసారం అవుతూనే వున్నాయి. నేను చేసిన పరిచయం కాని, నేను రూపొందించిన కార్యక్రమం కానీ… మద్రాసు కేంద్రంతో సహా 13 కేంద్రాలలో ఏదో ఒకటి ప్రతి దినమూ ప్రసారం చేస్తోంది అన్నా ఆశ్చర్యంలేదు. మొబైల్ వచ్చిన కారణంగా తరచు విభిన్న ప్రాంతాల శ్రోతలు ప్రసారమయిన నా కార్యక్రమం గురించి తెలియజేస్తూనే వుంటారు. ఆ మేరకు నాకు సంతృప్తిగానే వుంది. ఇవే విషయాలు మరొక రకంగా ‘వేణునాదం’లో మీరు చూడవచ్చు.

  1. ప్ర.మీరు తిరుపతి, కడప మొ॥ వివిధ రేడియో కేంద్రాల్లో పనిచేశారు. ఎక్కడ చేసినా మీదైన పద్ధతిలో కార్యక్రమాలను విభ్నింగా, విన్నూత్నంగా నిర్వహించి ప్రశంసలు పొందారు. విజయవాడలో‘సినీకవి సమ్మేళనం‘ నిర్వహించారు. ఆ కార్యక్రమ విశిష్టతను వివరించండి.
జ. ఏ కేంద్రాలలో పనిచేసినా బడుగు, బలహీన, శ్రామిక వర్గాలతోపాటు మహిళలకు సంబంధించిన అంశాలు, కళలు నా కార్యక్రమాలలో తప్పనిసరిగా వుండేవి. ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలు చేసే అవకాశాలను అన్ని రేడియో కేంద్రాలు నాతో పనిచేసిన తోటి ఉద్యోగులు,సంచాలకులు కల్పించడం గర్వకారణమే. విజయవాడలో పనిచేస్తున్న కాలంలో ఒక వినూత్న పద్ధతిలో 1999 దీపావళికి సినీ కవిసమ్మేళనాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, భువనచంద్ర, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ ఇలాంటి 8,9 మంది ప్రఖ్యాత కవుల కవితాపఠనంతో ఆ నాటి సభ దద్దరిల్లింది, ఆ జలదరింపుల ప్రతిధ్వనులు మరుసటి రోజు అన్ని దినపత్రికల టాబ్ లాయిడ్ లో రంగురంగుల ఫొటోలతో గుబాళించాయి. ఆలోచన ప్రయాగ వేదవతి గారిది. కవులను సమన్వయం చేసిన సహకారం జొన్నవిత్తుల రామలింగేశ్వరావుగారిది, మొత్తం నిర్వహణ,ప్రసార బాధ్యత నాది. ఈ కార్యక్రమ విజయంతో 2000 సంవత్సరం నుంచి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ఒక రోజు కార్యక్రమం విజయవాడ ఆకాశవాణికి ఇవ్వడం మొదలైంది. ఆసంప్రదాయం రెండు దశాబ్దాలకు మించి ఇంకా కొనసాగుతూనే వుందని భావిస్తున్నాను. ఇది నిస్సందేహంగా విలక్షణమైన ఆకాశవాణికి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన కార్యక్రమం.
  1. ప్ర.మీరు తిరుపతిలో పనిచేశారు. అక్కడ ఎలాటి కార్యక్రమాలు రూపొందించారు?
జ.  2016 ఆగస్టు నుంచి రెండేళ్ళపాటు ఆ కేంద్రం సంచాలక బాధ్యతలతోపాటు హెడ్ ఆఫ్ ఆఫీస్ బాధ్యతలను కూడా నిర్వర్తించాను. అప్పటిదాకా నేను పనిచేసిన ప్రతిచోటా ఒకరు లేదా ఒకరికి మించి అధికారులు దిశానిర్దేశం చేసే వెసులుబాటు ఉండేది. ఇక్కడ అలాంటి అవకాశం అంతరించిపోయింది. అయితే పాతికేళ్ళకు మించిన ఐదారు కేంద్రాల అనుభవం నా వెనుక ఉంది కనుక ఆ రెండేళ్ళలో చాలా విలక్షణమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది.  సుప్రభాతం కార్యక్రమంలో ముగింపులో ఇచ్చే కార్యక్రమాలు సమూలంగా మార్చడం, సుప్రభాతంలో రాయసీమ ప్రాంతపు దేవాలయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, వ్యవసాయదారుల కార్యక్రమానికి ‘చేనూ-సేద్యం‘ అనే శీర్షికగా మార్చి ఎక్కుమంది శాస్త్రవేత్తల అభిప్రాయాల కారణంగా కార్యక్రమం రూపొందించడం అలాగే మధ్యాహ్నం ఓ మూడుగంటల పాటు తెలుగు కార్యక్రమాలు పెంచడం, సినిమాపాటల్లో ఫోన్-ఇన్, ఇ-మెయిల్ విన్నపాలకు అవకాశం కలిగించే స్లాట్స్ కేటాయించడం; అలాగే తరిగొండ వెంగమాంబ రచనలకు వారానికి మూడు కార్యక్రమాల చొప్పున ప్రత్యేక స్లాట్స్ ను ఏర్పాటు చేయడం ఇలా చాలా చెప్పచ్చు. అలాగే డాక్టర్లతో నిర్వహించిన కార్యక్రమానికి గోవిందరాజస్వామి కళాశాల వేదిక అయినట్టే చంద్రగిరి కోట, మంగళం ఉన్నత పాఠాశాల, తిరుపతి మహాత్మాగాంధీ హైస్కూల్, జవహర్ లాల్ నెహ్రూ హైస్కూల్, ఎస్.వి.ఆర్ట్స్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ అలాగే జిల్లాలో పుంగనూరు వంటి వూళ్ళలో కార్యక్రమాలు చేయగలిగాం. దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన సైన్స కాంగ్రెస్ నేను పనిచేసే కాలంలో 2017 జనవరిలో సంభవించడం, అలాగే తిరుపతిలో ఆం.ప్ర ముఖ్యమంత్రి ఆగస్టు 15 జెండా వందనం వంటి కార్యక్రమం నిర్వహించడం ఇటువంటి అపురూప కార్యక్రమాలు తిరుపతిలో జరిగాయి. అంతకుమించి తెలుగు దినపత్రికలు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు ప్రచురించేలా కృషి చేశాను. . దీనికి తోడు ప్రతిరోజు ఫేస్ బుక్ లో ఈ  కార్యక్రమం వివరాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వుండేవి. అలాగే ఇంతవరకు తెలుగులో ఏ ఆకాశవాణి చెయ్యని ఆకాశవీక్షణ (Sky watch) వ్యాఖ్యాన కార్యక్రమాన్ని తిరుపతిలో చేయగలిగే అవకాశం నాకు లభించింది. అంతవరకు ఈ  కార్యక్రమం చెయ్యాలని 20 ఏళ్ళుగా వేచి ఉన్న నేను అవకాశం రాగానే తిరుపతి సైన్స్ సెంటర్ తోడ్పాటుతో దిగ్విజయంగా చేయగలిగాను.
  1. ప్ర.మీరు చెన్నైలో పనిచేసినపుడు ‘మదరాసు బదుకులు’ అనే కథా సంకలనం తెచ్చారు.   అక్కడ చాలామంది తెలుగువారున్నారు. మద్రాసు మనదే. కారణాలేమయితేనేం మద్రాసును కోల్పోయాము. ఆంధ్రప్రదేశ్‌లో తమిళ పాఠశాలలున్నాయి కానీ, అక్కడతెలుగు పాఠశాలలు లేవు. ఈ నేపథ్యంలో అక్కడ మీరెలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. మీకు తెచ్చిన కథా సంకలనం విశేషాలు చెప్పండి.
జ. అనుకోకుండా 2013లో మే మాసంలో నాకు కడప నుంచి బదిలీ అయ్యింది. ఒకసారి పనిచేసిన కేంద్రంలో మళ్ళీ పనిచేయడానికి ఇష్టపడని నేను అవకాశం లభించిందని మదరాసు వెళ్ళిపోయాను.. ఆచంట జానకిరాం రాసిన స్వీయచరిత్రలో ఆకాశవాణి కబుర్లు నాకెంతో ఉత్తేజాన్ని ఇస్తాయి. 1999-2000 సంవత్సరం సమయంలో ఏలూరు మిత్రులు కొమ్మన రాధాకృష్ణరావు ఈ పుస్తకాన్ని బహూకరించారు. ప్రతి ఆకాశవాణి ఉద్యోగి పారాయణం చేసి ఎప్పటికప్పుడు స్ఫూర్తి అందుకోగలిగే ప్రయత్నం చేయవచ్చు. దాశరథి, గొల్లపూడి, శారదా శ్రీనివాసన్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వంటివారు స్వీయచరిత్రలు రాసివున్నా ఆకాశవాణి విషయానికి వస్తే ఆచంట జానకిరాం గారికే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఈ పుస్తకం కారణంగా నాకు ఆరాధన పెరిగిన మదరాసులో పనిచేసే అవకాశం కలిగినప్పుడు ఎన్ని ఇబ్బందులనైనా పట్టించుకోకుండా చేరిపోయాను. నిజానికి మదరాసు వెళ్ళడం ఆర్థికపరంగా చాలా వ్యయంతో కూడిన వ్యవహారమే అయ్యింది. నేను వెళ్ళేటప్పటికి మదరాసు దూరదర్శన్ లో తెలుగు కార్యక్రమాలు దాదాపు లేవు. తెలుగు టివి ఛానళ్ళలో సరుకు అంతా హైదరాబాదు తయారీనే. తెలుగు పత్రికలూ అంతే!  అక్కడి కళాకారులకు, మహిళలకు, పిల్లలకు పాలుపంచుకునే అవకాశం దాదాపు లేని పరిస్థితి అది. ఈ లోటును గమనించి మద్రాసు బి కార్యక్రమాలు నగరం దాటి ఎంతో దూరం ప్రయాణించకపోయినా, వీలైనంత ఎక్కువమందిని భాగస్వాములను చేస్తూ నాణ్యతాపరంగా మేలైన రీతిలో తెలుగు కార్యక్రమాలని ప్రసారం చేశాం. ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు. బుచ్చిబాబు, దాశరథి కృష్ణమాచార్య, బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి  వంటి మహామహులు పనిచేసిన ఆ కేంద్రంలో, ఆ పదవిలో చేయగలిగే అవకాశం నాకు లభించింది అనే ఎరుకతో శ్రమించాను, సత్ఫలితాలను పొందగలిగాను. ఆ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే తెలుగు కార్యక్రమానికి ‘రసధుని‘ అనే భారమైన పేరు కాకుండా ‘మల్లెపూదండ‘ అని అటు మదరాసు పూల సంస్కృతిని, ఇటు శంకరంబాడి సుందరాచారి గీతాన్ని స్ఫురింపచేస్తూ నామకరణం చేశాను. అంతకు మించి ఆదరణ, ఆదాయం చూపించి అరగంట వ్యవధి తెలుగు కార్యక్రమాన్ని 45 ని.లకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ కె.పి.శ్రీనివాసన్ నేతృత్వంలో చేయగలిగాను. అంతకుమించి వివరించడం ఇక్కడ సాధ్యం కాదు.
చెన్నైలో నాటి స్టేషన్ డైరెక్టర్ శ్రీనివాసన్ ని సన్మానిస్తున్న నాగసూరి వేణుగోపాల్
‘మదరాసు బదుకులు‘ ఆకాశవాణి కేంద్రంతో సంబంధం లేకుండా ఉత్పన్నమయిన ఆలోచన. అంతకుముందు మదరాసు జీవితం ఆత్మగా వున్న తెలుగు కథానికలను గుదిగుచ్చాలనే విఫల ప్రయత్నాన్ని కొందరు చేశారు. ప్రఖ్యాత కథకులు ఆత్మీయ మిత్రులు శ్రీ విరించి, ఈ కథల కమామిషూ గురించి వివరంగా ఓ సందర్భంలో ముఖాముఖిగా అడయార్ మర్రిచెట్టు నీడలో వివరించారు కూడా. మదరాసు నుంచి నేను బదిలీ కావడానికి నాలుగైదు నెలల ముందు వర్తమాన తెలుగువారి జీవితాన్ని చిత్రించే కథల సంకలనాన్ని తెస్తే బావుంటుందని అనిపించింది. ఓ పాతికవేలరూపాయలు ఇవ్వగలనని ఏదైనా ఆలోచన చేయమని పెద్దలు మిత్రులు చల్లగళ్ళ నాగేంద్ర ప్రసాద్ దాదాపు అదే సమయంలో కోరడం మంచి ఉత్ప్రేరకమయ్యింది. దాదాపు 36 మంది రచయితలు వాళ్ళు చూసిన మదరాసు తెలుగువాళ్ళ గురించి రాశారు. అందులో మహిళల సంఖ్య ఎక్కువ కావడం ఒక పార్శ్వం కాగా, తమ తొలి కథను ఈ సంకలనం కోసమే రాసినవారు సగందాకా ఉండడం ఇంకో అంశం. కథాశిల్పం కన్నా స్థానిక వస్తువు, మదరాసు తెలుగు భాషకు మేము ప్రాధాన్యత ఇచ్చాం. ఈ మదరాసు బదుకులకు సంబంధించిన కృషి అంతా నేను తిరుపతికి వచ్చిన తరువాతనే జరిగిందని భావించాలి. 2017 సెప్టెంబరులో వెలుగు చూసిన 300 పేజీల ఈ సంకలనం రావడంలో సోదరి రాయదుర్గం విజయలక్ష్మి పాత్ర ఎంతో కీలకమైంది భువనచంద్ర, శ్రీవిరించి, శ్రీమతి లావణ్య, పత్రి అనూరాధ వంటివారి తోడ్పాటు కూడా గణనీయమైనదే. ఇప్పుడు  ఈ కథల సంకలనం ప్రాంతీయతను ప్రతిఫలింప చేసి పరిమళింపచేస్తున్న తెలుగు కథాసంకలనాలలో ఒక ప్రధానమైన ప్రయత్నంగా మిగిలిపోవడమే కాక తగిన గౌరవాన్ని కూడా అందుకుంటోంది.
  1. ప్ర. ఆకాశవాణిలో పనిచేసేటప్పుడు ఎన్నో చోట్లకు బదిలీలు అయ్యారు. ఇలా బదిలీ వచ్చినపుడు ఇబ్బంది పడ్డారా? ఆనందపడ్డారా కొత్త ఊళ్ళు చూడొచ్చని?
. ఇది ఒక రకంగా జీవితం నేర్పిన పాఠం! పుట్టపర్తి గానీ తిరుపతిగానీ అంతవరకు పరిచయంలేని ప్రాంతాలే. పైపెచ్చు వేరే రాష్ట్రాల, దేశాల సహాధ్యాయులు ఉన్న కళాశాల సత్యసాయి కళాశాల. అది ఒక రకంగా నాకు కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, మరింత హేతుబద్ధతను ప్రోది చేసుకోవడానికి దోహదపడింది. అలాంటిదే గోవాలో నా ఆకాశవాణి తొలి మజిలీ. అక్కడి రేడియో కేంద్రంలో మరాఠీ, కొంకణి, ఇంగ్లీషు, పోర్చుగీసు, హిందీ, ఉర్దూ — ఈ ఆరు ప్రసార భాషలు. నేను పనిచేస్తున్న కాలంలో ఆ కేంద్రంలో నేనొక్కడినే తెలుగు వ్యక్తిని. గోవా ఆకాశవాణి కేంద్రం మినీ ఇండియా లాగా కొంకణి, మరాఠీ, మళయాళం, కన్నడం, హిందీ, పోర్చుగీసు, ఇంగ్లీషు భాషలు మాట్లాడే వ్యక్తులతో నిత్యసందోహంలా వుంది. వారి మధ్య నేను చదువుకున్న ఫిజిక్స్ నైపుణ్యం కానీ, తెలుగు సామర్థ్యం కానీ, మన నేపథ్యం కాని ఏ రకంగా దోహదపడని సందర్భం! అయితే భాష రాకపోవడం అనేది మరింత పరిశీలనగా గమనించి, ఇంకొంత నేర్చుకోవడానికి దోహదపడింది. కేవలం మన నీతి, నిజాయితీ, కష్టపడే గుణం, తెలివి, సృజనాత్మక సామర్థ్యాలు మాత్రమే అక్కడ చెల్లుబాటు అవుతాయి. తత్ఫలితంగా చాలా రకాల అహంకారం తొలిగిపోయి నమ్రత చోటు చేసుకుంటుంది. ఈ మూడేళ్ల ఉద్యోగ జీవితం కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడే సామర్థ్యమూ గుండె దిటవు లభించాయి.  కనుక విజయవాడైనా విశాఖపట్టణం అయినా హైదరాబాద్ అయినా మదరాసు అయినా పెద్ద ఇబ్బంది అనిపించలేదు. దానికి తోడు కొత్త ప్రదేశంలో తక్కువ వ్యవధిలో లభించే అనుభవం; తెలిసిన ప్రదేశంలో ఎక్కువ కాలమున్నా లభించకపోవచ్చు. కనుకనే అన్ని తెలుగు ప్రాంతాల జీవన వ్యవహారాలను, సంస్కృతీ సాంప్రదాయాలను, వారసత్వ వారధులను అందుకునే, ఆకళింపు చేసుకునే ఆసక్తీ, అభిలాషా, జీవితనేపథ్యమూ, అవి సాధించిన జీవన దృక్పథం దోహదపడ్డాయి. కనుక మీరన్నట్టు ప్రతిచోటా కొత్త విషయాలు తెలుసుకున్నాను, కొత్త ప్రయోగాలు చేశాను, కొంగ్రొత్త విజయాలను అందుకోగలిగాను! అదే సమయంలో ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. బదిలీ కాగానే నా ఉద్యోగ జీవితాన్ని నేను రెండు భాగాలుగా పరిగణిస్తాను. తొలిదశలో కేవలం నేనొక్కడినే వెళ్ళి ఒకవైపు నా స్థోమతకు తగిన, సదుపాయాలున్న ఇల్లు వెతుక్కోవడం; మరోవైపు కొత్తగా పరిచయం అవుతున్న ఆఫీసును అందులో పనిచేసే ఉద్యోగుల తీరును, వారి సామర్థ్యాలను, రాజకీయాలను, అలాగే ఆ కేంద్రపు కార్యక్రమాల సంప్రదాయ పోకడలను ఏకకాలంలో తెలుసుకోవాలి. అదే కాలంలో డబ్బులు బాగా వెచ్చించి టెంపరరీ అకామడేషన్ తో పాటు సరైన తిండి,నిద్ర లేని పరిస్థితి! వీటికి మించి తరచు నేనిదివరకు పనిచేసిన ఊరికి కుటుంబ అవసరాల రీత్యా, నా అవసరాల రీత్యా వెళ్ళక తప్పని సందర్భం. ఒకరకంగా  ఈ దశ నాకు వ్యయంతో కూడిన కంటకప్రాయమైన దశే! అది నా ఒక్కడికే అర్థం అవుతుంది తప్పా నేను వివరించినా ఇతరులకు బోధపడకపోవచ్చు. రెండో దశలో కుటుంబాన్ని తీసుకురావడం, పాలు, పేపరు, కూరలు, పనిమనుషులు వగైరా విషయాలకు సంబంధించి; అలాగే రవాణా మొ. విషయాలకు సంబంధించి పెను మార్పులను భరిస్తూ కొత్త పరిస్థితికి ఒదిగిపోవాల్సి వుంటుంది. అయితే గాయాలను కదిపే గతాన్ని గుర్తుంచుకోవాల్సిన పని ఇప్పుడు నేను చేయకూడదు. ఇప్పుడు నాకు అక్కడ సాధించిన విజయాలు, అందిన అనుభవాలు, లభించిన మిత్రుత్వాలు మాత్రమే ముఖ్యం! కనుకనే పదవీవిరమణ చేయగానే ఎటువంటి పెద్ద మార్పు లేకుండా నా జీవితం అంతే ఉత్సాహంగా, బిజిగా నడుస్తోంది. కనుకనే ఇటీవల కాలంలో తరచు చేసే పర్యటనల గురించి కథనాలు రాయాలని నిర్ణయించుకుని ప్రయత్నం చేస్తున్నాను.
  1. ప్ర.తీరికలేని ఉద్యోగం వత్తిళ్ళలో ఉంటూ కూడా ఒకేసారి 4, 5 పత్రికలలో ‘కాలమ్స్’ రాశారు. వాటి గురించి చెప్పండి.
. అవును మీలాంటి విజయవాడ మిత్రులు తరచు ఆశ్చర్యపోయే విషయం అది. ఒకవైపు ఆకాశవాణిలో సదా కార్యక్రమాలు చేస్తూనే ఇన్ని కాలమ్స్ ఎలా రాయగలుగుతున్నారని ఎంతోమందికి సందేహం వస్తూవుంటుంది. విజయవాడలో నేను చేరేనాటికి నా వయసు 35 సంవత్సరాలు. ఇంకొక విషయం ఏమిటంటే బదిలీ కాగానే దానిని అంగీకరిస్తూ సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో సకుటుంబంగా అంటే కనీసం ఐదారు వేలు పుస్తకాలతో నెలలోపు వెళ్ళిపోయేవారం. విజయవాడలో ఇల్లు ఆఫీసుకు వందమీటర్ల లోపున ఉండేదంటే ఇప్పుడు ఆశ్చర్యంగానే వుంటుంది. చాలా అసౌకర్యాలున్నా దగ్గరున్న ఆ ఇంటిలో సర్దుకున్నాం. మరో విషయం ఏమిటంటే నా పని వరకే చూసుకుని అనవసరమైన ఉబుసుపోక వదంతులకు ఆసక్తి చూపేవాడిని కాను. ఏమాత్రం అవకాశం దొరికినా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఆనందపడేవాడిని. వారానికి ఐదారు కొత్త పుస్తకాలు రావడం వల్ల ఎటువంటి లోటూ వుండేది కాదు. విజయవాడలో పనిచేసే కాలంలో ఐదు దినపత్రికలకు వీక్లీ కాలమ్స్, నాలుగు మాసపత్రికలకు నాలుగు వ్యాసాలు ఇచ్చేవాడిని. అవి కూడా కొన్ని పోస్టు ద్వారా, కొన్ని స్థానికంగా అందజేయబడేవి. ఈ విభిన్నమైన మార్గాలను, ఆయా శీర్షికల వస్తువును గౌరవిస్తూ నా  కలం సాగేది. అలా రాసిన ఒక శీర్షికా వ్యాసాలు తరువాతి కాలంలో బిఇడి విద్యార్థులు 12 ఏళ్ళపాటు సిలబస్ లో చదువుకున్నారు. ఇప్పుడు అబ్బురం అనిపిస్తుంది కానీ ప్రణాళిక చేసుకుంటే ఏదీ కష్టం కాదు. నిజానికి ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా వృధా చేసే సమయమే ఎక్కువ వుంటుందనిపిస్తుంది. ఈ విషయం కొంతమందికి రుచించకపోయినా ఒక అద్భుతమైన వాస్తవంగానే పరిగణిస్తాను, దాని ఫలితాలను స్వయంగా పొందాను కనుక.
Hymavathi Mandarapu
Hymavathi Mandarapu
మందరపు హైమవతి ప్రఖ్యాత కవయిత్రి. ఆమె కవితా ముద్ర స్త్రీవాద కవిత్వంలో చెరిగిపోనిది. ఆమె కవిత ‘సర్పపరిష్వంగం’ తనను చాలాకాలం వెంటాడిందని చేరాతలలో చేకూరి రామారావు రాసుకున్నారు. అంతకు మించిన యోగ్యతాపత్రం అక్కరలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles