కొల్లేటి జాడలు
——————–
రచయిత — అక్కినేని కుటుంబ రావు
———————–
పుస్తక పరిశీలన
అవును. కొల్లేటి జాడలు ఒక ధ్వంసరచనే. అరవై సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం. మానవసంబంధాల ధ్వంసం. భాషల, యాసల విధ్వంసం. ప్రకృతి మనిషిని చేసిన ధ్వంసం. మనిషి పర్యావరణాన్ని చేసిన ధ్వంసం. ఎటు చూసినా విధ్వంసమే.జల ఖడ్గం చేసిన కరాళ నృత్యం. పర్యావరణానికి జరిగిన పరాభవం.
60 ఏళ్ళ క్రితం — అయిదు, ఆరేళ్ల జీవితం సజీవమై మన ముందు నిలుస్తుంది — అర్ధనగ్నంగా, అమాయకంగా శీను రూపంలో. ఆ శీను చూపించే జీవన చిత్రం మనల్ని నిశ్చేష్టులను చేస్తుంది. అవాక్కయి పోతాం. ప్రతి దేశానికీ ఒక ఆత్మ ఉంటుంది. ఆ మాటకొస్తే ప్రతి భాషకూ కూడా ఆత్మలుంటాయి. కానీ ఇక్కడ రచయిత ఒక ప్రాంతానికీ, గ్రామానికీ కూడా ఆత్మ ఉంటుందని మనల్ని ఒప్పిస్తాడు. పుల పర్రు ఆత్మని తన అంతరాత్మతో ఆవిష్కరిస్తాడు. మండే వేసవిలో, పుల్లేటి కాలవలో గుడ్డలు తీసి గట్టున పెట్టి స్నానం చేసినట్లు, దాహంతో నాలుక పిడచ కడితే తాబేటి కాయ నీళ్లు దోసిలి పట్టి తాగినట్లు అనుభూతి. ఒక రస్టిక్ బ్యూటీ మన కళ్ళముందు నిలుస్తుంది — మొరటుగా, అమాయకపు నవ్వుతో.
Also read: కీచకుడు లేని “విరాట పర్వం”
ఇది కథా?
ఇది కథా? అందామంటే — ఒక సంఘటనా? ఒక దుర్ఘటనా? 60 ఏళ్ల క్రితం పారేసుకున్న జ్ఞాపకాల నత్తగుల్లలు, తోలు గుడ్లూ ఏరుకోవడం తప్ప. నవల అందామంటే జీవితం ఏదీ?! ఒంటి నిట్టాడి పాకలో, తుంగ , తూడు, నీరు, నాచు తప్ప. బ్రతుకు భయం తప్ప. నాటకం అందామంటే — మెలోడ్రామా ఏది? భారీ డైలాగులు ఏవీ? బతుకుల్లోంచి మట్టి పెళ్ళల్లా బయటకు వచ్చిన మూల్గులు తప్ప! పోనీ వాక్చిత్రాలా? కావచ్చు. ఆకాశమంత భూమి, భూదేవంత జలరాశి. దోనెలో తాపీగా కూర్చుని వెళుతుంటే, వాలుగలు తోకల తో కొడతాయి. మట్ట గుడిసెలు, బొమ్మిడాయిలు పలకరిస్తాయి. కొరమీను లు ఊరి స్తాయి. తుంగ , తూడు దోనె కడ్డం పడతాయి. పీతలూ, నత్తలూ నవ్వుతుంటాయి. మనసుల్ని ఎండ్రకాయలు పట్టుకున్నట్టు తియ్యటి బాధ. ఆకాశంలోకి చూస్తే నల్లటి మబ్బుల మీద తెల్లటి కొంగల పరదా.
దుర్మార్గపు ఆలోచనలు
అంతలోనే వాస్తవ జీవితం. పక్క ఊరు తాగు నీళ్లకు నోచుకోక పోయినా, మన పొలాల్లో నీళ్లు నిండాలి అనే దుర్మార్గపు ఆలోచనలు మనసుల్ని బురద కాళ్లతో తొక్కుతాయి.
వరదలో పాముల కంతల పక్కన ప్రశాంతంగా నిద్ర పోయే చిన ముని కనిపిస్తాడు శీనులో. మనుషులు అబద్దాలు ఎందుకు ఆడతారో, మోసం ఎందుకు చేస్తారో, దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలియక — ఊరంతటిలోకి బలం ఉన్న , ఉక్కుతో చేసిన ఎన్నెముక గల ధర్మరాజు- ధర్మాసనం దుర్మార్గానికి ఎందుకు తలవంచాడో తెలియక సతమత మయ్యే కిష్టుడి గుండె మనకు మాయాదర్పణం లో కనబడుతుమిష్టి శ్రమైక జీవన సౌందర్యం – పెద్ద కాన్వాసు మీద ‘ ది లాస్ట్ సప్పర్ ‘ ( లియోనార్డో డావిన్సి వేసిన) గొప్ప చిత్రాన్ని తలపిస్తుంది. ఒక మనిషి సమైక్య కృషిలో, మనం అన్న భావనలో వంద మనుషులు పెట్టు ఎట్లా అవుతాడో మన కళ్ళకు కట్టినట్టు చిత్రం కనబడుతుంది. దేశంలో ఎక్కడా జరగని వింత — అట్లూరి పిచ్చేశ్వరరావు రూపంలో వచ్చి సమిష్టి వ్యవసాయం చేయిస్తుంది. ఇంత గొప్ప విషయం దేశం, చరిత్రకారులు ఎట్లా మిస్సయ్యారు అని వాపోతుంది మనసు.
ఏ దశాబ్దాలనాటి జీవనచిత్రం
ఈ జీవన చిత్రం 60–70 ఏళ్ళ పాతది. సుమారు 1950 – 53 సంవత్సరాలనాటిది. మనం అనుకునే స్వాతంత్ర్యం వచ్చిన తొలి దినాలు. కొల్లేరుకు గాని, పుల పర్రుకు గాని ఆ వాసనలేమీ తగలవు. కానీ అటు వంటి పులపర్రు — పిచ్చేశ్వరరావు, కుటుంబరావు లాంటి రచయితల్ని జాతికిచ్చింది. మట్టిలో మాణిక్యాలు. పులపర్రు చెరువులో వికసించిన పంకజాలు.
ఇక ఈ వాక్ చిత్రానికి వాడిన భాష — కృష్ణ , పశ్చిమగోదావరి జిల్లాల యాస — జోలి, శొంఠి పట్టని, తెపాళ చెక్కలు, యివరం తవరం, మజ్జిలో, తాబేటికాయలు, కట్టు గొయ్యలు, పలుపుతాళ్ళు, పచ్చాపలు, బచ్చాలు, తైక్కిమని, ఎదవడం — ఈ పుస్తకం చదివిన ఆ జిల్లాల మనుషుల ప్రాణం లేచొ చ్చినట్లుంటుంది . పుస్తకాన్నీ, రచయితనీ ఓన్ చేసుకుంటాం. యాసకున్న పవరు అటువంటిది మరి!( ఇప్పుడు ఆ నుడికారం గ్రామాలు కోల్పోతున్నాయి) 60 ఏళ్ల తర్వాత అదే పులపర్రు — నూరేళ్లు పూర్తి చేసి తను ఈ లోకంలో ఇంక ఉండలేను అన్నట్లు వెళ్లిపోయిన వజ్రమ్మరూపంలో కనబడుతుంది. మానవ సంబంధాల పరిమళాలు పోయి రొచ్చు, బురద, కార్పొరేట్ కంపూ, వ్యర్థ పదార్థాల దిబ్బలూ — దైన్యంగా అన్నీ కోల్పోయిన కొల్లేరు ఆత్మఘోష. “ఓటర్లమయ్యాం గాని బాధ్యతగల పౌరులం కాలేదు” అని రచయిత కామెంట్. అవును. ఓటు కొనుగోలు, అమ్మకం చేసే స్వతంత్ర, ప్రజాస్వామిక, బాధ్యతరాహిత్య పౌరులమయ్యాం. కార్పొరేట్ చట్రంలో ఇరుసులమయ్యాం. కొల్లేరు సమిష్టి వ్యవసాయానికి ముందు, ఆ తర్వాత ఐదేళ్లు — కొల్లేరు 50, 70 దశకాల్లో ఆ తర్వాత- ఈ చిత్రాలు మన మనసుల్లో ముద్రించుకుంటాం. వానమ్మ వచ్చినా, వరదమ్మ వచ్చినా కాపురం చెడింది కొల్లేటికే. కార్పొరేట్ సంస్కృతి కొంపల్ని కొల్లేరు చేసింది. ఈ నిశ్శబ్ద, సామూహిక భంగపాటు చిత్రాలు చూసిన తర్వాత — ఏదో కడుపులో దేవిన ఫీలింగ్. రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించి రాశారో అది నెరవేరింద నుకుంటాను.
కొల్లేరుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి
ఈ నవలా కాలం 1950 దశకం. సమాజం ఫ్యూడల్ వ్యవస్థే కాని కొల్లేరుకు కొన్ని మినహాయింపులున్నాయి. రైతులు, వడ్డెరలు అందరూ ప్రకృతి వనరులను నమ్ముకొని వలస వచ్చిన వాళ్లే. భూమి, నీళ్లు — ఒకరిద్దరి లేదా ఒక వర్గం స్వాధీనంలోకి రాలేదు. ఉత్పత్తి సాధనాలు ప్రధానంగా కాళ్లు చేతులే. మోతుబరులు — కాకయ్య, పరంధామయ్య లాంటి ఇద్దరు ముగ్గురే. వీళ్లు కూడా ఫ్యూడల్ సమాజ అవలక్షణాలు కాక దయా,జాలీ కలిగి అందరి బాగూ కోరుకునే వారే. ఊళ్లో సమస్యలకు సామూహిక ఆలోచన, సమిష్టి ఆచరణ ఎట్లా ఫలితాలనిస్తాయో రచయిత చెప్తాడు. ఊరికి వచ్చిన మూడు సమస్యలకు సమిష్టిగా పరిష్కార మార్గాలు ఎట్లా కనుగొన్నారో చెప్తాడు.( మంచినీళ్ల సమస్య, కైకలూరు రౌడీల సమస్య, వ్యవసాయం సమస్య) సమిష్టి జీవనంలో ఉన్న సౌందర్యం అద్దంలో చూపిస్తాడు.
ప్రపంచంలో రెండే రెండు వర్గాలు
ఒక మేధావి అన్నట్లు ప్రపంచంలో రెండే వర్గాలు — తెలివిగల వాళ్లు, తెలివి లేనివాళ్లు. వడ్డీలలో ( వడ్డెరలు) ఒక వర్గం పైకి రావడానికి, రెండో వర్గం రాకపోవడానికి ఇదే కారణమేమో అనిపిస్తుంది. నవల్లో హీరోలే గాని, విలన్లు ఎక్కువ కనపడరు– పరిస్థితులు, ప్రకృతి శక్తులు( వర్షాలు, వరదలు) తప్ప. రాజ్యం (స్టేట్) అనేది ఒకటి ఉందని, అది ప్రజల బాగోగులు చూడాలనీ — తెలియని అమాయకపు జనాలు. చివరికి స్టేట్- కార్పొరేట్ శక్తుల కొమ్ముకాచి, అనంతమైన వనరుల దోపిడీకి గేట్లు తెరుస్తుంది. దానితో తాత్కాలికంగా ఈ కథ లేక నవల లేక నిశ్శబ్ద, నిశ్చలన చిత్రం ముగుస్తుంది– నేనింకా ఉన్నానంటూ.
చెయ్యి, కాలు తిరిగిన రచయిత
రచయిత కుటుంబరావు గారి గురించి ఇంకో మాట — ఈయన రాసిన కార్మిక గీతం పూర్తి హైదరాబాదు ఉర్దూ, తెలంగాణ మాండలికం కలగలిపిన భాష. అమ్మ నాలుక నుడికారాన్ని ఎట్లా పట్టగలిగారో, 14, 15 ఏట హైదరాబాద్ వచ్చి పెంచినమ్మ యాస అట్లాగే పట్టారు. ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఎన్నో అనుభవాలు! తిరిగిన ప్రతిచోట మనుషుల్ని, భాషను సొంతం చేసుకున్నారు. అందుకే అంటాను నేను — ఈయన చెయ్యి తిరిగిన
రచయిత మాత్రమే కాదు, కాలు తిరిగిన రచయిత కూడా! అని.
ఈ పుస్తకం స్వేచ్ఛ ప్రచురణలు ప్రచురించారు. నవోదయ, విశాలాంధ్రలలో దొరకవచ్చు.
ఈ పుస్తకం వసంత్ కన్నాభిరాన్ ‘ Softly dies a lake’ అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. అమెజాన్ లో లభ్యం కావచ్చు.
Also read: ‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన
చంద్ర మొహన్ గారు .. అభి నందనలు. ఎప్పుడో చదివిన ,ఎన్నోసార్లు చదివిన ఒక కొల్లేటి జాడలు మరోసారి కళ్ళముందు నిలిపారు. ఆ రచనలో అంతర్లీనంగా ప్రవహించిన జీవ ధారను, బతుకు బాధను శీను చెప్పినంత అలవోక గా మీ సమీక్ష [?]లో బొమ్మ కట్టించారు. రచయితకే కాదు సమీక్షకునికి కూడా భావుకత , తీవ్రమైన స్పందనావేశం , జీవితం పట్ల మమ కారం వుండాలని గుర్తు చేశారు. అందుకే ఇంత లోలోతులలోకి వెళ్ళింది మీ చూపు.
Thanq,sir