Tuesday, January 28, 2025

డైరీ రాద్దామా!..

సంపద సృష్టిద్దాం -15

మనలో చాలా మందికి డైరీ రాసే అలవాటు ఉండే ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక నోటు పుస్తకంలో ఆ రోజు జరిగిన ముఖ్యమైన విశేషాలను అందులో రాసుకోవడమే డైరీ రాయడమంటే అని మనకు తెలుసు కదా! కొన్నేళ్లు పోయాక మన జీవితమంతా పూస గుచ్చినట్లు గుర్తుండదు గానీ, ఈ డైరీ తిరగేసినప్పుడు గతమంతా గుర్తుకు రావడానికి ఎంతో సహకరిస్తుంది. కానీ, కోటీశ్వరులు కావాలనుకుంటున్న వారంతా డైరీ విధిగా రాయాలి. అయితే, అది మన జీవిత విశేషాల సమాహారం మాత్రమే కాకూడదు. దానికి మరిన్ని విశేషాలు జత చేయాలి. మనం రాస్తున్నది మన డైరీ కాదు. మన కోటీశ్వరులమయ్యే ప్రాసెస్‌లో మన డబ్బు ఎదిగిన క్రమం. నిజానికిది మన ఆలోచనల డైరీ. మన డైరీలో ఆ లక్షరాలు ఏం సూచిస్తాయంటే మనం విశ్వంతో జరిపే సంభాషణ. మనం సాధించాలనుకుంటున్న విజయాలను ముందుగానే నమోదు చేసుకుంటున్నాం.

Also read: ఆర్థిక స్వేచ్ఛకు ముందర…

విశ్వంతో జరిపే సంభాషణ

మరి మీ డైరీలో డబ్బుకు స్థానముందా! డబ్బుకు సంబంధించిన అనేక అంశాలు మనకు సులభంగా అర్థం కావడానికి ఖచ్చితంగా మన జేబులోకి వచ్చే ప్రతి రూపాయి గురించి మనం రాయాలి. మన జేబులోంచి పోయే ప్రతి రూపాయి గురించి మనం రికార్డు చేసి తీరాలి. ఎంత శ్రమ, సంఘర్షణ తరువాత ఒక్కో రూపాయి మనల్ని చేరుతుందో రాసుకునే విధంగానే మనం వెచ్చించే ప్రతి రూపాయి మనకెంత తృప్తినిచ్చిందో తెలుసుకోగలగాలి. పాతికేళ్ల కిందట రమేష్‌ ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్‌ చేరాడు. ముగ్గురు సహోద్యోగులు కలిసి ఒక ఇల్లు తీసుకుని ఉంటున్నారు. తొలి రోజుల జీతం బొటాబొటి ఖర్చులకు సరిపోయేది. నెలాఖరు వచ్చేసరికి డబ్బుకు ఇబ్బందిగా ఉండేది. ఇంకా ఖర్చులు తగ్గించుకోవాలని ఒక గుణపాఠం, మరేదైనా చిన్న పనిచేసి మరికాస్త ఆదాయం పెంచుకోవాలని రెండో గుణపాఠం నేర్చుకున్నాడు. ఒకసారి ఇంటిలో బియ్యం నిండుకున్నాయి. మౌలాలిలో ఉన్న ఒక బంధువు ఐదు వందల రూపాయలు ఇస్తానంటే ముగ్గురు రూంమేట్లు జేబులో అడుగున ఉన్న చిల్లర అంతా ఊడ్చి రైలు టికెట్టు కొని బియ్యం కొని తీసుకురమ్మని అతడిని పంపించారు. రమేష్‌ తన బంధువు దగ్గర ఐదు వందల రూపాయల చేబదులు తీసుకుని వస్తున్నప్పుడు రైలులో జేబుదొంగలు తమ చేతికి పని కల్పించారు. ఉత్త చేతులతో తిరిగి వచ్చిన రమేష్‌ ఎంత పోగొట్టుకున్నట్టు? స్నేహితులు అప్పటికి ఓదార్చారు.

Also read: మనం మారితేనే మన ఆర్థిక పరిస్థితి మారేది

మనం నేర్చిన లెక్కల సబ్జెక్టు ప్రకారం రమేష్‌ పోగొట్టుకున్నది కేవలం ఒక ఐదు వందలే. కానీ జీవితం నేర్పే ఆర్థిక పాఠాలు వేరు. ఆ ఎకానమిక్స్‌ నేర్చిన రమేష్‌ మూడు నెలల తర్వాత తన డైరీలో, ఆ రోజు మూడు ఐదు వందల నోట్లు పోగొట్టుకున్నట్లు రాసుకున్నాడు. జేబుదొంగలు కొట్టేసిన నోటు మొదటిది. బియ్యం కోసం జీతం వచ్చేవరకు ఆగి, మరుసటి నెల మొదటి వారం బియ్యం బస్తా కోసం వెచ్చించిన నోటు రెండవది. మరో రెండు నెలల తరువాత తన బంధువుకు అప్పు తీర్చడానికి ఇచ్చిన నోటు మూడవది. తన డైరీలో డబ్బు రాకపోకలను అత్యంత శ్రద్ధతో రాసుకున్నప్పుడు ఒక పనివల్ల మూడింతల లాభాలు, మూడింతల నష్టాలు ఎలా మోసుకురాబడతాయో మనకు అర్థమవుతుంది. డబ్బుకున్న శక్తిని మనం అర్థం చేసుకునేట్టు మన ఫైనాన్షియల్‌ డైరీ సహకరిస్తుంది. ముఖ్యంగా ప్రతి రోజు డైరీ రాయడం వలన మూడు లాభాలుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేస్తుండడం, సోమరితనం అనే గుణాలను మనలోంచి తరిమేస్తుంది.  మనం రాసుకునే డైరీలో మూడు భాగాలుండాలి. రంగురంగుల పెన్నులతో ఇది రాస్తుండాలి. డైరీ కూడా మనల్ని ఉత్తేజపరిచేలా కళాత్మకంగా కనిపించాలి.

Also read: సమయానికి వేద్దాం కళ్లెం

అడుగు – నమ్ము – పొందు

మొదటి భాగంలో రోజువారీ మనం చేయవలసిన పనులు రాసుకోవాలి. అయితే మన ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం వాక్యానికి మెరుగులు దిద్దాలి. చేయాల్సిన పనులను ఒక వరుస క్రమంలో రాసుకున్నప్పుడు, అప్పటికే అవి పూర్తి చేసినట్టు రాసుకోండి. మీకు ఎవరినుండో డబ్బు చెక్‌ రూపంలో రావాలనుకోండి, దానిని బ్యాంకులో అప్పటికే డిపాజిట్‌ చేసుకున్నట్టు రాసుకోవాలి. పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ పరీక్షకు ప్రిపేరయినట్టు రాసుకోవాలి. అందులో పూర్తయిన పనులను మరుసటి రోజు ప్రత్యేకంగా అండర్‌లైన్‌ చేసుకోవాలి. కలవాలనుకున్న వ్యక్తులు, సందర్శించాలనుకున్న ప్రదేశాలు, చదవాలనుకున్న పుస్తకాలు, పూర్తి చేయాలనుకున్న కార్యక్రమాలు అన్నీ అందులో ప్రస్తావించాలి. ఈ విశ్వానికి మన కోరికలు చాలా స్పష్టంగా తెలియజేయాలి.

Also read: బకెట్లు మోసే ప్రపంచం

ఇక రెండవ విభాగంలో మన ఆలోచనలు నమోదు చేసుకోవాలి. ప్రతి రోజూ ప్రతి ఒక్కరికి పలురకాలు కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటిని వెంటనే రాసి పెట్టుకోకపోతే అవి మన జీవితం మేలిమలుపులు తిరగడానికి పనికిరాకుండా పోతాయి. ఎంతో శక్తిమంతమైన, ఉపయోగకరమైన ఆలోచనలు వస్తుంటాయి. మనం రాసుకునే వందలాది ఆలోచనలలో మనకి కొన్నే ఉపయోగపడవచ్చు గాక, రాయడం మాత్రం చాలా అవసరం. ఈ రోజు నవ్వు తెప్పించిన ఆలోచనలు పదేళ్ల తరువాత దిక్సూచులుగా పని చేస్తాయి. పాతాళభైరవి సినిమాలో తనకు కావలసిన రాకుమారిని వెతికే అద్దం మాంత్రికుడి వద్ద చూశారు కదా. సరిగ్గా వందేళ్లకు అదే ఇంటర్‌నెట్‌ కనెక్టెడ్‌ కంప్యూటర్‌ అయింది. మన ఆలోచనలు మంచివా, చెడ్డవా, సాధారణమైనవా, అసాధారణమైనవా, సాధ్యమా, కష్టసాధ్యమా, అసాధ్యమా అనే జడ్జిమెంట్లు ఇవ్వకండి. సింపుల్‌గా డైరీలో రాసి పెట్టుకోండి. మన డైరీలో రాసుకున్న కొన్ని ఆలోచనలు ఏళ్లు గడిచాక, జీవితం సంపాదించిన అనుభవంతో మేళవించుకుని ఖచ్చితంగా మీకు శక్తిమంతమైన కొత్త మార్గం చూపుతాయి.

Also read: పైప్ లైన్ నిర్మిద్దాం!

మూడో విభాగంలో డబ్బు గురించి మాత్రమే రాయండి. ఆ రోజు మన ఆదాయవ్యయాలు మాత్రమే కాదు, ఆ ప్రాసెస్‌ కూడా రాయండి. డబ్బు గురించిన మన సమస్త ఆలోచనలు రికార్డు చేయండి. శక్తిమంతమైన రూపాయి మీ మెదడులో సృష్టించే భూకంపాలను నమోదు చేయండి. అదే రూపాయి మీ హృదయంలో పూయించే వీనుల విందైన రాగాల గురించి రాయండి. ఆ రోజు డబ్బుకు సంబంధించి మీరు కొత్తగా నిర్ణయాలు తీసుకుంటే వాటిని రికార్డు చేయాలి. డైరీలో ప్రస్తావించడం వల్ల మీరు డబ్బుకు సంబంధించిన తక్షణ చర్యలు చేపట్టే వ్యక్తిగా ఎదుగుతారు. తక్షణ చర్యలే తగిన ఫలితాలు ఇస్తాయని మనకు తెలిసిందే. ఒక్క విషయం మర్చిపోకండి. అలిఖిత లక్ష్యాలు ఎన్నటికీ నెరవేరవు. ఎంత పెద్ద లక్ష్యమైనా మనం ఒక దగ్గర రాసి పెట్టుకుంటేనే అది నిజజీవితంలో సాకారమవుతుంది. దానిని చిన్నచిన్న భాగాలుగా చేసుకుని సాధించడమే జీవితం.

Also read: తలపోతల వలబోతలు

 దుప్పల రవికుమార్‌

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles