పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగష్టు 13 వ తేదీ వరకూ జరగాలి. కానీ, షెడ్యూల్ కు రెండు రోజుల ముందే అర్ధాంతరంగా ముగించేశారు. దానికి నిరవధిక వాయిదా అనే ముద్దుపేరు పెట్టారు. ఈ తీరు కొత్తదేమీ కాదు. సమావేశాలు జరిగిన విధానం కూడా షరా మామూలే. అధికార – విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు, దాడులు జరగడం, సభల స్థంభన, మార్షల్స్ ప్రవేశం, తప్పు మీదంటే మీది అంటూ నోరు చేసుకోవడం, ఈ గందరగోళాల మధ్య బిల్లుల ఆమోదాలు జరిగిపోవడం. అదే తంతు కొనసాగుతూనే ఉంది.
Also read: మహానగరాలు నీట మునిగిపోతాయా?
అన్నీ ఒక తానులో ముక్కలే
అధికారంలో కాంగ్రెస్ ఉన్నా,బిజెపి ఉన్నా తేడా ఏమీ లేదు. ఆన్నీ ఒక తాను ముక్కలే అని ప్రతిసారీ నిరూపణవుతోంది. 96 గంటలపాటు సాగాల్సిన పనిగంటలు 21 గంటల 14నిముషాలకే మమ అనిపించారు. సభా నిర్వహణ తంతులో కోట్లాదిరూపాయల ప్రజాధనం వృధా అయిపొయిందని అనుకోవడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఇలా ఒక్కసారి కాదు, సభలు జరిగిన ప్రతిసారీ చిల్లు పడేది ప్రజల సొమ్ముకే. దేశ ఆర్ధిక పరిస్థితి ఎరిగిన పెద్దలే, జరుగుతున్న వృధా గురించి కనీసం స్పృహ లేకుండా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యానికి అద్దం పట్టే పెద్దవిషాదం. ఇది మన డబ్బే కదా! అనే స్పృహలో ఎక్కువమంది ఓటర్లు లేకపోవడం మరో విషాదం. ‘యధా ప్రజ.. తధా రాజ’గా నానుడి మారిపోయిందని రాజనీతిశాస్త్రజ్ఞులు గొల్లుమంటున్నారు. ఎన్నికల సరళిలో,నాయకుల ఎంపికలో మార్పు రావాల్సింది ప్రజాక్షేత్రంలోనే,తేవాల్సింది ఓటర్లే అని మేధావులు పదే పదే చెబుతున్నా, పట్టించుకొనే నాథుడే లేడు. అందుకే ఈ సభలు ఇలా జరుగుతున్నాయి. నాయకుల నాటకాలు ఇలా సాగుతున్నాయని అర్ధం చేసుకోవాలి. చర్చకు తావులేకుండానే, సంఖ్యాబలంతో బిల్లులకు ఆమోదముద్ర వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. సెలెక్ట్ కమిటీకి వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. ఈసారి సమావేశాల్లో పెగాసస్ అంశమే ప్రధానంగా నిలిచింది. ప్రతిపక్షాలు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా, అధికారపక్షం దాటవేత ధోరణినే విజయవంతంగా పాటించింది. చివరాఖరికి, పెగాసస్ తో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఆ సాఫ్ట్ వేర్ తాము కొనలేదని ఒక్కవాక్యంతో కొట్టిపారేశారు. ఇదే అంశంపై ఐరోపా దేశాలు విచారణకు ఆదేశించాయి. మన ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎటువంటి చలనం లేదు. పెగాసస్ నిఘా అంశం ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరింది. నిజానిజాలు నిగ్గుతీసి, అసలు దొంగలను బయటపెడితేకానీ, ఆ బండారం బయటపడదు. కోర్టుకెళ్ళిన అంశాలు తేలేది ఎన్నడు? ఏళ్ళూపూళ్లూ పడతాయనే నిస్పృహలోనే ఎక్కువమంది ఉన్నారు. పెగాసస్ అంశం నిజంగా నిజమైనదే అయ్యిఉంటే అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు.
Also read: మహామహితాత్ముడు మాస్టర్ ఇకె
రాహుల్ దూకుడు పెంచడం అవసరమే
ప్రజాస్వామ్యం, రాజ్యంగహక్కులకు ఉరితీసినట్లే. నెలల తరబడి తీవ్రస్థాయిలో జరుగుతున్న రైతు ఉద్యమాలకు ఈసారి సమావేశాల్లో కూడా సమాధానం రాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన చెయ్యిజారిపోయిందని తేలిపోయింది. ఏదో ఒకటి రెండు బిల్లులపై చర్చ జరగడం గొప్పగా చెప్పుకొనే పరిణామం కాదు. ప్రతిపార్టీకి అవసరమైన ఓటుబ్యాంక్ రాజకీయాల్లో భాగంగా జరిగే నాటకంలో భాగంగానే దానిని చూడాలి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి, సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సభలు జరిగిన అనేక సందర్భాల్లో భావోద్వేగాలకు గురవుతున్నారు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, మొన్నటి తరం మేరునగధీరులైన శ్రేష్ఠనాయకులను చూసిన కళ్ళతో, నేటి వాతావరణాన్ని చూసినప్పుడు ‘ ‘ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమసమూహములు’ అన్నట్లుగా కళ్ళుచెమర్చడంలో అర్ధం ఉంది. అప్పటి తరాన్నే కాక, నిన్నటి, నేటి తరాన్ని కూడా ఆయన చూస్తున్నారు. నేటి తరం రాజకీయాలు ఆయనకు తెలియనవి కావు. ప్రతిపక్షం – ప్రభుత్వం రెండూ తనకు రెండు కళ్ళులాంటివని చేసిన వ్యాఖ్య చాలా విలువైంది. ఇకనుంచైనా సభలు సజావుగా జరిగేటట్లు ఆయన వంటివారు కీలకభూమిక పోషించాల్సిన అవసరం జాతికి వుంది. ఇవన్నీ ఇలా ఉండగా, ఈసారి విపక్షాల మధ్య ఐక్యత పెరిగింది. రాహుల్ గాంధీ దూకుడు పెంచుతున్నారు. ఇది మెచ్చుకోతగ్గ పరిణామమే. ఆ ఐక్యత ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడితే మంచిది. అధికార పక్షానికి అత్యధిక సంఖ్యాబలం ఉంటే ఏకస్వామ్యంగా వ్యవహరిస్తారన్నది ఎంత నిజమో… ప్రతిపక్షం బలహీనంగా ఉంటే లేదా బలహీనమైన ప్రతిపక్షం వల్ల ప్రజాస్వామ్యానికి అంతే నష్టం జరుగుతుందన్నది యదార్ధం. సమావేశాలు జరిగినప్పుడల్లా, తీవ్రనిరాశతో ముగుస్తున్నందుకు తప్పులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ప్రజలముందు పరులను దోషులుగా చూపించాలనుకుంటున్నారు. కానీ, ఎవరు దోషులో ఎవరికి వారికే తెలుసు. వీరి తీరువల్ల నొక్కుకు పోతోంది ప్రజస్వామ్యం గొంతు. మీ తీరు మారదా? అని ప్రజలు ప్రశ్నించే రోజు రావాలి. అందాకా.. ఇంతే సంగతి.
Also read: రామాలయం సరే, రామరాజ్యం ఎప్పుడు?