Sunday, December 22, 2024

పెగాసస్ దర్యాప్తునకు ప్రభుత్వం సహకరిస్తుందా?

పెగాసస్ స్పైవేర్ పైన దర్యాప్తు జరిపించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీని నియమిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నాయకత్వంలోని ధర్మాసనం చేసిన ప్రకటనను ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తున్నారు. పెగాసస్ పైన దర్యాప్తు జరగాలనీ, అసలు ఇజ్రేల్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం ఒప్పదంపైన సంతకాలు చేసిందా లేదా చెప్పాలనీ, పెగాసస్ సాఫ్ట్ వేర్ ను వినియోగించారా, లేదా చెప్పాలని కోరుతున్న ప్రముఖులు వేసిన పిటీషన్లంటినీ కలిపి ధర్మాసనం విచారించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రభుత్వానికి ఉదారంగా అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా లేదు. అక్రమం ఏమీ జరగలేదని బుకాయిస్తూ టూకీగా అఫిడవిట్ దాఖలు చేసింది. అంతకంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఏమైనా అంటే జాతీయ భద్రత అంటుంది. ఈ పాట అలవాటుగా మారింది.

జాతీయ భద్రత సాకుతో కీలకమైన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే సర్వోన్నత న్యాయస్థానం మౌనసాక్షిగా నిలుచోదని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ భద్రత పేరిట ‘ఫ్రీపాస్’ ఎంతకాలమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొన్ని సంవత్సరాలుగా పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు జాతీయ భద్రత పేరిట హరిస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషించేవారు. ఈ ధోరణికి భిన్నంగా జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి పౌరహక్కులకూ, ప్రాథమిక హక్కులకూ భంగం కలిగితే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని చెబుతూ వచ్చారు. ఈ విషయంలో జస్టిస్ రమణకు సర్వత్రా హర్షామోదాలు లభిస్తున్నాయి. పెగాసస్ పైన దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర సంఘాన్ని నియమించాలనీ, దానికి సాంకేతిక అంశాలలో సహకరించేందుకు తగిన నిపుణులను కూడా అందుబాటులో ఉంచాలనీ నిర్ణయించడాన్ని అన్ని రంగాలవారూ ప్రశంసిస్తున్నారు.

జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నాయకత్వంలో దర్యాప్తు జరిపే స్వతంత్ర సంఘానికి మాజీ ఐపీఎస్ (1976 బ్యాచ్) అధికారి అలోక్ జోషీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేన్ సబ్ కమిటీ అధ్యక్షుడు సందీప్ ఒబరాయ్ సహకరిస్తారు. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెసర్ నవీన్ కుమార్ చౌదరి, డీన్, నేషనల్ ఫ్లోరెన్సిక్ సైన్సెస్ యూనివర్విటీ, గాంధీనగర్, గుజరాత్, పి.ప్రబహరణ్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అమృతా విశ్వవిద్యాపీఠం, అమృతపురి, కేరళ, అశ్విన్ అనీల్ గుమాస్తే, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ టెక్నాలజీ, బాంబే, మహారాష్ట్ర ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దర్యాప్తు కమిటీలో ముగ్గురు సభ్యులు – నవీన్ కుమార్ చౌధరి, పి ప్రబహరణ్, అశ్విన్ అనీల్ గుమాస్తే ఉంటారు. జస్టిస్ రవీంద్రన్ పర్యవేక్షిస్తారు.  ఐపీఎస్ ఆఫీసర్ జోషి, సందీప్ ఒబరాయ్ సహకారం అందిస్తారు.  

కమిటీ సభ్యుల పేర్లు ఖరారు చేయడం చాలా కష్టమైందనీ, కొందరు ప్రయోజనాల వైరుధ్యం (కాన్ ప్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్స్) అడ్డువస్తున్నదని అని చెబితే, కొందరు వేరే పనుల్లో తీరికలేకుండా మునిగి ఉన్నామని చెప్పారనీ, సభ్యులను ఒప్పించి కమిటీని ఏర్పాటు చేయడానికి సమయం పట్టిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పౌరుల వ్యక్తిగత గోప్యత (ప్రివసీ), వాక్సాస్వాతంత్య్రం (ఫ్రీస్పీచ్) వంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, వాటికి ప్రభుత్వం కారణమంటూ ఆరోపణలు వచ్చినప్పుడు, ఇందులో విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సర్వోన్నత న్యాయస్థానం చూస్తూ ఊరుకోజాలదని ధర్మాసనం అన్నది. ఎన్.రామ్, శశికుమార్ వంటి సీనియర్ జర్నలిస్టులూ, ఎడిటర్స్ గిల్డ్ వంటి గౌరవనీయమైన సంస్థలు పిటీషన్లు వేసినప్పుడు మౌనంగా ఉండటం సాధ్యం కాదని చెప్పింది.

ప్రముఖ జర్నలిస్టు సిద్దార్థ వరదరాజన్ సంపాదకత్వంలోని వెబ్ న్యూస్ పేపర్ ‘వైర్’ తో సహా ప్రపంచంలోని అనేక మీడియాసంస్థలు ఒక బృందంగా ఏర్పడి పెగాసస్ నిఘా వ్యవహారాన్ని దర్యాప్తు చేశాయి. పెగాసస్ స్పైవేర్ ద్వారా సుమారు 50 వేలమంది ఫోన్లనూ, కంప్యూటర్లనూ ట్యాప్ చేస్తున్నారనీ, మాట్లాడుకునేది వినడం మాత్రమే కాకుండా ఫోన్ లో, కంప్యూటర్ లో పాత సమాచారం యావత్తూ లాగివేసే ప్రక్రియ పెగాసస్ లో ఉన్నదని ఈ బృందం కనిపెట్టింది. వారిలో భారతదేశానికి చెందిన జర్నలిస్టులూ, ప్రతిపక్ష నాయకులూ, ఇతరులూ మూడు వందల మంది వరకూ ఉన్నట్టు సమాచారం.

న్యాయస్థానాల పాత్ర రెండు విధాలుగా ముఖ్యమైనది. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య వివాదాలను పరిష్కరించడం ఒకటి. పౌరుల ప్రాథమికహక్కులను పరిరక్షించడం రెండవది. ప్రాథమిక హక్కులూ, మీడియా స్వాతంత్య్రం హరిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చిన తర్వాత దర్యాప్తు చేయడం అవసరమని సుప్రీంకోర్టు భావించింది. పౌరహక్కులను హరించారనే ఆరోపణ వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం జాతీయ భద్రత ప్రస్తావన తీసుకురావడం, ప్రత్యర్థుల నోళ్ళు మూయించడం, న్యాయమూర్తులను ఇబ్బందిపెట్టడం ఇంతవరకూ జరిగింది. ఈ విషయంలో త్రిసభ్య ధర్మాసనం (జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ) జాతీయ భద్రత సాకును ఖాతరు చేయకుండా పెగాసస్ వినియోగించారో, లేదో తెలుసుకోవలసిన బాధ్యత ఉన్నదని గుర్తెరిగి కమిటీని నియమించింది. మెగాసస్ సాఫ్ట్ వేర్ ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందా, లేదా? ఇందుకు సంబంధించి ఇజ్రేల్ ప్రభుత్వంతో ఏమైనా ఒప్పందంపైన సంతకాలు చేసిందా,లేదా? కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేస్తున్న నిఘా సంస్థలు పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తున్నాయా, లేదా? ఎవరిమీద నిఘా పెట్టారు? వారి వివరాలు ఏమిటి? వారి నుంచి ఏ సమాచారం సేకరించారు? ఇటువంటి విషయాలను కమిటీ కనుక్కోవాలి. రెండు నెలలలోగా సుప్రీంకోర్టు మళ్ళీ ఈ కేసును వినేలోగా కమిటీ నివేదిక సమర్పించాలి.

పెగాసస్ భారత్ కి పరిమితమైనది మాత్రమే కాదు. యూరప్ దేశాలలో కూడా ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం పెగాసస్ కుంభకోణం జరిగినట్టు సమాచారం బయటికి పొక్కగానే దర్యాప్తు సంఘాన్ని నియమించింది. పెగాసస్ తో ప్రమేయం ఉన్న అన్నిదేశాలు స్పందించాయి. భారత ప్రభుత్వం మాత్రం మొండికేసింది. తాను దర్యాప్తు సంస్థను నియమించి దర్యాప్తు చేయిస్తానని కేంద్ర ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు సమ్మతించలేదు. న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్టు కనిపించడం ప్రధానమని సుప్రీంకోర్టు కేంద్రానికి గుర్తుచేసింది.

సుప్రీంకోర్టు తన బాధ్యతను నిర్వర్తించింది. ప్రభుత్వం సహకరిస్తేనే ఈ విషయంలో నిజం నిగ్గు తేలుతుంది. సహకరించే అవకాశాలు ఎంతమాత్రం లేవు. కమిటీ మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరికి వచ్చి ప్రభుత్వం సహకరించడం లేదని చెబుతుంది. అప్పుడేమి జరుగుతుంది? ప్రభుత్వ సహకారం లేకపోయినా దర్యాప్తు ముందుకు సాగుతుందా? నిజం వెల్లడి అవుతుందా? ప్రభుత్వం నిజాన్ని వెల్లడి కానిస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పగలదు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles