జాన్ సన్ చోరగుడి
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని విభజన చట్టంలోని అంశాలపై మరోసారి 2022 సెప్టెంబర్ 27న ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో సమావేశం జరిపింది. ఇది జరిగాక, రెండు రాష్ట్రాల పత్రికలు ఇది- ఎటువంటి పురోగతి లేని సమావేశం అని రాశాయి. విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా చట్టంలోని అంశాల అమలు అయినా, పోనీ చట్టంలో అస్పష్టత ఉన్న పక్షంలో, దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ అయినా; ఈ రెండు కనిపించడం లేదని, ఈ సమావేశం తర్వాత అర్ధమవుతున్నది.
Also read: యూనివర్సిటీ పేరులో- ‘నేముంది’?
‘క్లాజు‘ వొదులుకుని…
విభజన జరిగిన ఏడాదికే పదేళ్ల ఉమ్మడి రాజధాని ‘క్లాజు’ వొదులుకుని హైదరాబాద్ నుంచి ఇవతలకు వచ్చాక, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి- పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని కేంద్ర-రాష్ట్ర వ్యవహారాల విభాగం, 2012-13 మధ్య విభజన చట్టం ముసాయిదా సిద్ధం చేస్తున్నప్పుడు, ఏ. పి. పౌరసమాజం లేదా అఖిల పక్షం నుంచి ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన చేసింది లేదు. కానీ తెలంగాణ పరిస్థితి వేరు, అప్పటికే తెలంగాణ నుంచి టన్నుల కొద్దీ మహజర్లు ఢిల్లీలోని కీలక మంత్రిత్వ శాఖల వద్ద పోగుబడి ఉన్నాయి. ఏ. పి. కి చట్టంలో జరిగిన కొద్దిపాటి మేలు ఏదైనా ఉందంటే, అది యు.పి.ఏ. పాలనలో డా. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చొరవగానే చూడాల్సి ఉంటుంది. అంతే గాని, ఈ విషయంలో అప్పటికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో వున్న నాన్ తెలంగాణ మంత్రులు జోక్యం ఉందని మాత్రం భవిష్యత్ చరిత్ర చెప్పదు.
అప్పటి హోమ్ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ 2016లో ఒకసారి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు, తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లారు. ఆ తర్వాత కాలంలో ఆ శాఖ పూర్తిగా రాష్ట్రంపై శీతకన్ను వేసింది. విభజన తర్వాత ఎన్నో అంశాల్లో సర్దుబాటు అవసరమైన రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో, ఆయా మంత్రిత్వ శాఖల చురుకైన (‘ప్రో-యాక్టివ్’) జోక్యం ఇక్కడ నామమాత్రమే అయింది.
Also read: దక్షిణాదిన ఏ. పి. ‘పోస్ట్-మండల్’ రాష్ట్రం కానుందా?
‘వైబ్రెన్సీ‘ కారణంగా
సెంట్రల్ ఇండియా దాటాక, వింధ్యకు ఇవతల ఉత్తర-దక్షణ భారత సంస్కృతులకు కేంద్రమయిన నగరం తెలంగాణ రాజధాని- హైదరాబాద్. ఇక మధ్య భారత్ కు ఆనుకుని తూర్పు తీరాన దేశంలోనే (గుజరాత్ తర్వాత) రెండవ పొడవైన సముద్ర తీరమున్న రాష్ట్రం- ఆంధ్రప్రదేశ్. భారత్ విదేశీ విధానంలో- ‘తూర్పు-చూపు’ ప్రాధాన్యత పెరిగాక, దేశానికి ఆగ్నేయ-ఆసియా ముఖద్వారంగా కీలకంగా మారింది కూడా ఇదే. ఇది 200 ఏళ్లపాటు బ్రిటిష్ పాలనలో ఉండడం, ‘ప్రాంతము-ప్రజలు’ దృష్టి నుంచి చూసినప్పుడు కనిపించే మరొక చారిత్రిక సత్యం. దాంతో ఇక్కడి ప్రజల వైఖరిలో ఏర్పడిన-‘వైబ్రెన్సీ’ కారణంగా, వీరిది ప్రాంతీయతకు మించిన- ‘పాన్ ఇండియా’ దృష్టి అయింది. దేశంలో ఎక్కడివారైనా వచ్చి స్వేచ్చగా ఇక్కడ వ్యాపారాలు చేసుకునే భద్రత ఉన్న ప్రాంతమిది.
అలా తొలి దశ ‘సరళీకరణ’కు, స్వాతంత్రానికంటే ముందే ఇక్కడ బీజం పడింది. దాని ఫలాలు- ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ అన్నట్టుగా అందుకోవడం కూడా అంతా సూత్రం మేరకే జరిగింది అనడం, ఇక్కడ ఒప్పుకోవాల్సిన సత్యం. గడచిన 60 ఏళ్లలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చుట్టూ జరిగిన కేంద్రీకృత అభివృద్ధిని, వీరు- ‘మరి మా సంగతి ఏమిటి?’ అనే దృష్టితో, ఆదిలోనే దాన్ని అడ్డుకోకపోవడంలో ఆ ‘లిబరలైజ్డ్’ దృష్టిని మనం స్పష్టంగా చూడవచ్చు. దీని చారిత్రిక నేపధ్యం ఇటువంటిది అయినప్పుడు, మారిన ఇప్పటి భౌగోళిక ఆంధ్రప్రదేశ్ అవసరాల కారణంగా, కేంద్రం దృష్టి అక్కడ ప్రభుత్వ పాలసీలు పట్ల కేంద్రం దృష్టి మునుపటికి భిన్నంగా ఉదారంగా ఉండాల్సి ఉంది.
Also read: ‘అభివృద్ధి’ పట్ల తెలుగు సమాజం వైఖరి ఎటువంటిది?
‘వన్ బెల్ట్- వన్ రోడ్‘
జాతీయ సమగ్రత ఎప్పుడూ మనకుండే ప్రాదేశిక సమ్యక్ దృష్టిపై ఆధారపడి ఉంటుంది. ఆ చూపు, ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో అధికారంలో ఉన్నవారి రాజకీయ ప్రయోజనాలకు పరిమితమయ్యే హస్వదృష్టి కాకూడదు. ఆ సున్నితాన్ని గ్రహించింది కనుకనే, నాటి యు. పి. ఏ. ప్రభుత్వం సముద్రతీర రాష్ట్రమైన ఏ.పి.ని ప్రత్యేక రాష్ట్రంగా చేసే విషయంలో, దేశ ప్రయోజనాలు ముఖ్యమని ఎంచి, తన రాజకీయ ప్రయోజనాలను వొదులుకుంది. ఇది ఎంత సత్యమో చూడాలంటే, మన తూర్పు తీరం వెంట 2014-19 మధ్య చైనా- ‘వన్ బెల్ట్- వన్ రోడ్’ వాణిజ్య మార్గం వ్యూహాన్ని అమలు చేస్తున్న కాలంలో ఇక్కడ జరిగింది ఏమిటో చూడ్డం అవసరం. అప్పట్లో పలు రాష్ట్రాల్లో ఎన్.డి.ఏ. తన రాజకీయ ఎజెండాను భిన్నమార్గాల్లో అమలు చేయడం మాత్రమే కనిపిస్తుంది తప్ప, సరిహద్దు భద్రత కోసం అవసరమైన సిద్దబాటు ఇక్కడ కనిపించదు.
బొంబాయి టెర్రరిస్టుల దాడులు (2008) తర్వాత మన సముద్రతీరం వెంట పోలీస్ నిఘా పెంచాలని కేంద్ర హోమ్ శాఖ 2013-14 మధ్య మచిలీపట్టణం వద్ద- ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ ప్రతిపాదన తెచ్చింది. కేంద్రం ఆదేశంతో జిల్లా యంత్రాంగం అందుకు 200 ఎకరాలు స్థలం కూడా ఎంపిక చేసి ప్రతిపాదనలు ఢిల్లీ పంపింది. అయితే, అది 2018 నాటికి గుజరాత్ లోని ద్వారక జిల్లాలోని- ‘ఫిషరీస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్’ లో పనిచేయడం మొదలుపెట్టింది. ‘అన్నం అంతా ఉడికిందో లేదో చూడక్కర్లేదు, మెతుకు పట్టుకుంటే చాలు తెలుస్తుంది’ అన్నట్టుగా, విభజన జరిగిన ఏడాదే (2014) కేంద్ర ప్రభుత్వ వైఖరి మన పట్ల ఎలా ఉండబోతుందో ఇలా స్పష్టమైంది.
Also read: మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…
‘ఫిషింగ్’ పేరుతో…
దీన్ని గత నెల 19న ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ చేసిన హెచ్చరిక నేపధ్యలో చూడడం అవసరం. “We see a lot of Chinese fishing and Navy vessels in the Indian Ocean region. We are keeping an eye on them… Our capability plan is not based on any country. It is as per our requirement to protect our nation,” the Admiral said. (‘ఫిషింగ్’ పేరుతో లెక్కకు మించిన చైనా నౌకల కదలికలు హిందూ మహా సముద్రం ప్రాంతంలో నిత్యం ఉంటున్నాయి. వాటిమీద మనం ఒక కన్నేసి ఉంచుతున్నాము. ఇది మన సామర్ధ్యాన్ని ఏదో ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చూపడానికి కాదు. అది- మన దేశ భద్రతా అవసరాల దృష్ట్యా చేస్తున్నది) అంటారు అడ్మిరల్ హరి కుమార్. ‘పాకిస్థాన్ కూడా ఇటీవల చాలా వేగంగా తన నౌకా సంపత్తిని పెంచుతూ ఉంది’ అనేది ఈయన చేస్తున్న హెచ్చరిక.
దేశం అంబుల పొదిలో
అయినా వీటిని చూడాల్సింది, కేవలం దేశ రక్షణ సంబంధమైన అంశాలుగా మాత్రమే కాదు. ఒక ప్రాంత అభివృద్ధి- అక్కడ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం వల్ల, ప్రజల అక్షరాస్యతలోనూ అవగాహనా స్థాయిలోను ఉన్నత ప్రమాణాలు ఉంటాయి. అటువంటప్పుడు, పార్టీలకు అతీతంగా దేశ సమగ్రత పట్ల వారి అంకిత భావం ఉంటుంది. ఈ నేపథ్యంలో- ఢిల్లీ బీజింగ్ ను చూడాలిసింది మునుపటి మాదిరిగా- ‘ఎయిర్ డిస్టెన్స్’ దృష్టి నుంచి కాదు. అంతర్జాతీయ రాజకీయాల పరిభాషలోకి- ‘ఇండో-ఫసిఫిక్’ పదం కొత్తగా వచ్చిచేరాక, దేశం అంబుల పొదిలో- ‘ఆంధ్రప్రదేశ్’ నూతన భౌగోళిక అస్త్రంగా మారింది!
Also read: జగన్ దావోస్ తనతో తీసుకెళ్ళింది ఏమిటి?
ఇప్పుడైనా ఈ చర్చకు కారణం ఏమిటి? అంటే అది చెప్పాల్సి ఉంది. మన విదేశీ వాణిజ్యానికి కీలకమైన- Indo-Pacific Economic Framework (IPEF) కు దూరంగా ఉండాలని ఇటీవల ఇండియా తీసుకున్న నిర్ణయం, ఆలోచనాపరుల విమర్శలకు కారణం అవుతున్నది. ‘కేంద్రం- ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో ఆర్ధిక వ్యూహాలను విస్మరించి, రాజకీయ విన్యాసాలు చేస్తున్నది’ అంటూ ఢిల్లీ జె.ఎన్.యు. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ హ్యాపీమన్ జాకబ్ గత నెల 19న రాసారు. ఆయన దీనిపై రాసిన విశ్లేషణాత్మక వ్యాసం శీర్షిక మతలబు ఏమిటో… దేశీయ దృష్టి నుంచి కూడా దాన్ని చూడాలి. అలా చూసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ను గమనిస్తున్న వారికి, అందరికంటే అది స్పష్టంగా అర్ధమవుతుంది. ఎందుకంటే ఆ వ్యాసానికి శీర్షికగా- ‘Geopolitics without geoeconomics, a fool’s errand’ అంటూ- ‘అసమర్ధుని జీవయాత్ర’ను అది గుర్తు చేస్తున్నది.
Also read: ‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…
(వ్యాస రచయిత అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత)