ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ
అప్పుడు ఇందిర ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన యువత
ఇప్పుడు యువతలో లోపించిన పోరాటస్ఫూర్తి, పెరిగిన స్తబ్దత
చలసాని నరేంద్ర
భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మాయని మచ్చగా ఇందిరాగాంధీ సరిగ్గా 47 ఏళ్ళ క్రితం ప్రకటించిన అత్యవసర పరిస్థితి మిగిలిపోయింది. ప్రజల పౌర, మానవ హక్కులను హరిస్తూ, ఒక విధంగా అటువంటి పరిస్థితులకు శాశ్వత ప్రాతిపదిక కల్పించడం కోసం ఆమె 42వ రాజ్యాంగ సవరణను కూడా తీసుకొచ్చారు.
Also read: హార్దిక్ పటేల్ గుజరాత్ లో బీజేపీని గట్టెక్కిస్తారా?
నాడు దేశంలో ప్రతిపక్షాల నాయకులు చాలావరకు జైళ్లకు పరిమితమయ్యారు. కొద్దిమంది నాయకులు బయటఉన్నా పోరాట పటిమను ప్రదర్శించలేక పోయారు. జైళ్లలో ఉన్న నాయకులు అనేకమంది ప్రభుత్వ నేతలతో రాయబారాలు జరిపి, పెరోల్ పై బయటకు వచ్చి, చాలావరకు మౌనంగా ఉండిపోయారు.
సాధారణ ప్రజల నిరసన ఉద్యమం
అయితే దేశంలో సాధారణ ప్రజలు, విద్యార్థులు, యువత ఎటువంటి ఆర్భాటం, ప్రచారం లేకుండా జరిపిన నిరసన ఉద్యమం, ప్రజలకు వాస్తవాలు చేరవేయడం, మరో వంక విదేశాలలో .. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి పేరుతో జరుగుతున్న నిరంకుశ పరిపాలన స్వరూపాన్ని డా సుబ్రహ్మణ్యన్ స్వామి వంటి వారు అమెరికాలో ప్రచారం చేయడంతో ప్రభుత్వంపైన తీవ్రమైన వత్తిడులు ఎదురై ఎన్నికలు జరుపక తప్పని పరిస్థితులు ఇందిరా గాంధీకి ఎదురయ్యాయి.
వాస్తవానికి ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు భయపడ్డారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి అంశాలు `నిరక్షరాస్యులైన’ ప్రజలకు ఏమి అర్ధం అవుతాయి అనుకొని, ఎన్నికలను బహిష్కరిద్దామని సూచించారు.
Also read: ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ సరే…. ఇదంతా నడిపించింది ఎవ్వరు?
కానీ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మొరార్జీ దేశాయి, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకుల నైతిక స్థైర్యం, సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లిన వేలాదిమంది యువకుల త్యాగాల ఫలితంగా 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓటమి చెందింది.
మొరార్జీ హయాంలో రాజ్యాంగ సవరణ
మొరార్జీ దేశాయి నాయకత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం భవిష్యత్లో తేలికగా దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేకుండా 44వ రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చింది. అయితే నేడు నేరుగా ఎమర్జెన్సీని విధించక పోయినా, పరోక్షంగా అటువంటి పరిస్థితులకు దేశాన్ని నెట్టివేసి ప్రమాదం లేకపోలేదు.
నేడు దేశంలో అనేక నూతన రాజకీయ పక్షాలు ఆవిర్భవించాయి. దేశ భిన్నత్వానికి అద్దం పెట్టె విధంగా ప్రజల భిన్నాభిప్రాయాలను ఆదరించడం నేడు అందరికి తప్పనిసరిగా మారింది.
నాడు లోక్ సంఘర్షణ సమితి అధ్యక్షుడిగా 78 ఏళ్ళ వయస్సులో జైలులో ఉన్న మొరార్జీ దేశాయి వద్దకు మధ్యవర్తులను పంపి పెరోల్ పై విడుదల చేస్తామని, అత్యవసర పరిస్థితులు క్రమశిక్షణ పెరిగిందని అంటూ కొన్ని మంచి మాటలు చెబితే విడుదల చేస్తామని ఇందిరాగాంధీ రాయబారం పంపారు.
కానీ బయటకు వస్తే తిరిగి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తా గాని ప్రభుత్వానికి `లొంగిపోయే’ ప్రసక్తి లేదని మొరార్జీ స్పష్టం చేశారు. నేడు ఈడి కేసులకు భయపడి రాత్రికి రాత్రి ఫిరాయించి, ప్రభుత్వాలను కూల్చివేయడానికి మన నేతలు వెనుకాడటం లేదు. ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతామని అంటూ తిరుగుతున్నారు.
మరో వంక స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారు అత్యవసర పరిస్థితి విధించి పెద్ద తప్పు చేశావని, వెంటనే ఉపసంహరించుకోమని ప్రధానికి హితవు చెప్పారు. ఇందిరాగాంధీ కంచికి వెళ్లి 90 సంవత్సరాల వయస్సులో ఉన్న `నడిచే దేవుడు’ గా పేరొందిన స్వామి చంద్రశేఖర సరస్వతి కాళ్లపై పడి ఆశీర్వాదం కోరితే ఇందిరాగాంధీ ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆ విధంగా అత్యవసర పరిస్థితి పట్ల తన విముఖతను చాటారు.
1977 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిమ్మీ కార్టార్ ఎన్నికల ప్రచారంలోనే భారతదేశంలో పౌర హక్కుల అణచివేత గురించి ప్రస్తావించారు. ప్రాథమిక హక్కుల అంశంపై రాజీలేని ధోరణిని ప్రదర్శించడం ద్వారా జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని సైతం పొందలేక పోయారు. దానితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు గాని ఉన్నత పదవి కోసం ఆయన పాకులాడలేదు.
న్యాయమూర్తులకు రాజ్యసభ, గవర్నర్ పదవులు
నేడు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత గవర్నర్, రాజ్యసభ నామినేషన్ వంటి పదవులు అంగీకరించడం ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల సాధారణ ప్రజలలో అనుమానాలు చెలరేగుతున్నాయి. ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వాని అందించిన సీల్డ్ కవర్ ను తెరవకుండానే, దాని ఆధారంగా తీర్పు ఇచ్చే విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి.
ప్రజల హక్కులు కాపాడటం కోసం, ప్రజాస్వామ్య విలువలను రక్షించడం కోసం అనేకమంది పలు త్యాగాలకు సిద్ధపడ్డారు. అటువంటి నైతిక స్థైర్యం గల నాయకులు నేడు దేశంలో కనబడటం లేదు. ఆధ్యాత్మికవేత్తలు సహితం ఆస్తుల పెంపకం పట్ల, వ్యాపారాల పట్ల చూపుతున్న ఆసక్తి ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో చూపలేక పోతున్నారు.
పూర్తిగా మారిపోయిన రాజకీయ వ్యవస్థ
ఒక విధంగా రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఎమర్జెన్సీ తర్వాత ప్రతి రాష్ట్రంలో ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీలు బలమైన పునాది ఏర్పరచుకో గలిగాయి. అనేక రాష్ట్రాలలో సుదీర్ఘకాలం అధికారంలోకి కూడా వస్తున్నాయి. ఈ పార్టీలు అన్నింటికి ఒకరే సుదీర్ఘకాలం నాయకత్వం వహిస్తున్నారు. వారి తర్వాత వారి కుటుంభం సభ్యులే నాయకత్వంలోకి వస్తున్నారు.
రాజకీయ పార్టీలు అన్ని దాదాపుగా ఒక కుటుంబం లేదా ఒకరిద్దరు వ్యక్తుల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారాయి. అంతర్గత ప్రజాస్వామ్యం నేడు మచ్చుకైనా లేకపోవడం ఎమర్జెన్సీ కన్నా భయానకమైన వరవడి, రాజకీయ సాంప్రదాయాలకు దారితీస్తుంది. అన్ని రాజకీయ నిర్ణయాలు ఒకరి, ఇద్దరు నాయకుల అభీష్టం మేరకు జరుగుతున్నాయి.
పైగా ఒకొక్క రాజకీయ పక్షం ఒక్కొక్క కులానికి ప్రాతినిధ్యం వహించే పక్షంగా గుర్తింపు పొందుతున్నాయి. విశాల జాతీయ ప్రయోజనాల కన్నా సంకుచిత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వక నాయకులకు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రక్షణ విషయంలో సహితం పలువురు రాజీ ధోరణులు అవలంభిస్తున్నారు.
అర్థరహితంగా మారిన చట్టసభలు
కీలకమైన బిల్లుల గురించి కూడా చట్ట సభలలో అర్ధవంతమైన చర్చలు జరగడమే లేదు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు సంవత్సరంలో 150 రోజుల వరకు జరుగుతూ ఉండెడివి. కానీ ఇప్పుడు అందులో సగం రోజులు కూడా జరగడం లేదు. ఆ రోజులలో కూడా తరచూ వాయిదాలతో గడిపి వేస్తున్నారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చల పట్ల ఆసక్తి కనబరచడం లేదు.
ప్రజల హక్కులను కాపాడటం కోసం ఎన్నో విప్లవాత్మక చట్టాలు నేడు మన ముందున్నాయి. సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, విద్య హక్కు చట్టం, భూసేకరణ చట్టం .. వంటివి అందుకు ప్రబల నిదర్శనంగా ఉన్నాయి. అయితే వీటి అమలు పట్ల ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు. వాటిని నిర్వీర్య పరచే ప్రయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.
యువతలో పెరుగుతున్న సంకుచిత దృష్టి
ఎమర్జెన్సీ లో వలె నేడు యువత, విద్యార్థులు హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు జరిపే పరిస్థితులు కనిపించడంలేదు. సంకుచిత అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఎమర్జెన్సీ విధించగానే ఇందిరాగాంధీ మొదటగా ప్రెస్ సెన్సార్ షిప్ విధించారు. పత్రికలపై ఆంక్షలు పెట్టారు. నేడు అటువంటి అవకాశం లేదు. అవసరం కూడా లేదు. మీడియా సంస్థలే వ్యాపార సంస్థలుగా మారి అధికార పక్షాలకు దాసోహం అంటున్నాయి. వార్తలను నిర్భయంగా, వాస్తవంగా ఇవ్వలేని దుర్భర పరిస్థితులలో చిక్కుకు పోతున్నాయి. మరోవంక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహితం మీడియా సాధారణ రాజకీయ విమర్శలు చేయడాన్ని కూడా సహింపలేక పోతున్నాయి.
విమర్శిస్తే దేశద్రోహం
సోషల్ మీడియాలో విమర్శలు జరిపినా, భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసినా దేశ ద్రోహ కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి మండలిలలో ప్రజా ప్రాధాన్యత గల అంశాలపై సహితం లోతయిన చర్చలు జరిగే పరిస్థితులు కనబడటం లేదు. సమిష్టి నాయకత్వం నేడు ఎక్కడా కనిపించడం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ 1975-77 నాటికన్నా నేడు ప్రమాద ఘడియలలో ఉన్నదని చెప్పవచ్చు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి నేడు ప్రజా జీవన రంగాలలో కనిపించడం లేదు. కార్పొరేట్ శక్తులు నేడు విధాన నిర్ణయాలలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తూ ఉండడమే అందుకు ప్రధాన కారణం. పరిస్థితులు సహజంగానే అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Also read: ఏళ్లయినా మిస్టరీగా మిగిలిన రాజీవ్ గాంధీ హత్య
ప్రజలను ఉచితాలతో బానిసలను చేసేస్తున్నారు అందుకే.