- 9వ టైటిల్ కు చేరువగా టాప్ ర్యాంక్ స్టార్
- సెమీస్ లో కరత్సేవ్ పై గెలుపు
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ విజయపరంపర కొనసాగుతోంది. తన కెరియర్ లో ఇప్పటికే ఎనిమిదిసార్లు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన మొనగాడిగా నిలిచిన టాప్ సీడ్ జోకోవిచ్ 2021 టోర్నీ ఫైనల్స్ కు సైతం అలవోకగా చేరుకొన్నాడు. మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన తొలిసెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు జోకోవిచ్ వరుససెట్లలో రష్యన్ సంచలనం, 114వ ర్యాంక్ ఆటగాడు అజ్లాన్ కరత్సేవ్ ను చిత్తు చేసి 28వసారి ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టాడు.
అస్వస్థతను అధిగమించి:
మూడోరౌండ్ మ్యాచ్ ఆడుతూ తీవ్రఅస్వస్థతకు గురైన జోకోవిచ్ ..సెమీఫైనల్స్ మ్యాచ్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం లేకుండా ఆడాడు. మొత్తం 30 విన్నర్లు, 17 ఏస్ లతో ప్రత్యర్థిని అధిగమించాడు. ఇప్పటికే 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన 34 సంవత్సరాల జోకోవిచ్ మరో మూడు టైటిల్స్ నెగ్గితే సంయుక్త అగ్రస్థానంలో నిలిచిన ఫెదరర్, నడాల్ ల 20 టైటిల్స్ రికార్డును సమం చేయగలుగుతాడు. నాలుగోసీడ్ ఆటగాడు డేనిల్ మెద్వదేవ్, 5వ సీడ్ సెఫానోస్ సిటిస్ పాస్ ల నడుమ జరిగే రెండో సెమీఫైనల్లో నెగ్గిన ఆటగాడితో జోకోవిచ్ టైటిల్ సమరంలో తలపడాల్సి ఉంది.
Also Read: ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో సంచలనాలు
ఫెదరర్ తర్వాతి స్థానంలో జోకో:
అంతకుముందు జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్ లో కెనడాస్టార్ మిలోస్ రావ్ నిచ్ ను ఓడించడం ద్వారా… గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300 మ్యాచ్‌లు గెలిచిన రెండవ ఆటగాడిగా జోకో రికార్డుల్లో చేరాడు. గతంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300 మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో రోజర్ ఫెదరర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఫెదరర్ కు ఇప్పటికే 362 మ్యాచ్‌లు నెగ్గిన రికార్డు ఉంది. ఇక స్పెయిన్ స్టార్ రాఫెల్ నడాల్ ఖాతాలో 285 గ్రాండ్ స్లామ్ మ్యాచ్ విజయాలు మాత్రమే ఉన్నాయి.
కరత్సేవ్ ఘనత:
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో క్వాలిఫైయర్ గా అడుగుపెట్టి…ఏకంగా సెమీఫైనల్స్ చేరిన రెండో ఆటగాడిగా అజ్లాన్ కరత్సేవ్ రికార్డుల్లో చేరాడు. 1977 లో బాబ్ గిల్టినాన్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన తొలి క్వాలిఫైయర్ కాగా ఆ తర్వాత అదే ఘనతను కరత్సేవ్ సాధించగలిగాడు. మెయిన్ రౌండ్లో 8వ సీడ్ డిగో స్వార్జ్ మాన్, 20వ సీడ్ ఫీలిక్స్ అగుర్, 18వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ లాంటి మేటి ఆటగాళ్లను కంగుతినిపించిన కరత్సేవ్ సెమీస్ లో మాత్రం టాప్ ర్యాంకర్ జోకోవిచ్ కు సరిజోడి కాలేకపోయాడు. సెమీస్ చేరడం ద్వారా కరత్సేవ్ తన ర్యాంక్ ను 42వ స్థానానికి మెరుగుపరచుకొనే అవకాశం ఉంది. తన కెరియర్ లో గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రా అర్హత కోసం గత తొమ్మిదిసార్లుగా ప్రయత్నించి విఫలమైన కరత్సేవ్ పదవ ప్రయత్నంలో సఫలం కావడమే కాకుండా సెమీస్ చేరి సంచలనమే సృష్టించాడు.