Saturday, November 23, 2024

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రకంపనలు

  • ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలు
  • పేదరికం, సాంఘికార్థిక అసమానతలు దీర్ఘకాలికమైనవి

మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నింటినీ కొన్ని అంశాలు భయపెడుతున్నాయి. వాటి స్థాయి, స్థానం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరకంగా ఉన్నప్పటికీ అవి విసిరే సవాళ్లకు మనం సమాధానాలతో, పరిష్కార మార్గాలతో సిద్ధం కావాలి. ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పర్యావరణంలో మార్పులు, కాలుష్యం, ధరల పెరుగుదల, పేదరికం, సాంఘిక అసమానతలు మొదలైనవి ప్రధానంగా కనిపిస్తున్నాయని వివిధ అధ్యయన నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇవి చాలావరకూ అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ, కొన్ని దేశాలను కొన్ని సమస్యలు మరీ ఇబ్బంది పెడుతున్నాయి. ఫ్రాన్స్, కెనడా, అమెరికా, అర్జంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, పోలాండ్, సింగపూర్, టర్కీ తో మొదలైన దేశాలతో పాటు భారత్ లోని పరిస్థితులపైన అధ్యయనాలు జరిగాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. కోవిడ్ ముప్పు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలైనవి తెచ్చిన కష్టాలు, చూపిన ప్రభావాలు అన్నీఇన్నీ కావు. మధ్యమధ్యలో వచ్చే వరదలు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా అదనపు తలనొప్పులుగా మారుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని వస్తువులు, వ్యవసాయ దిగుబడుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Also read: రాహుల్ కు భారీ ఊరట

నేరాలతో ఉక్కిరిబిక్కిరి

ఫ్రాన్స్ నేరాలు, హింసతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కెనడాలో పర్యావరణంలో వస్తున్న మార్పులు పెనుసవాళ్లు విసురుతున్నాయి. అర్జెంటీనా నుంచి భారత్ వరకూ అనేక దేశాలు ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. కోవిడ్ కాలంలో అమలుచేసిన ఉద్దీపన పథకాలు మన దేశంలో ద్రవ్యోల్బణం, అధికధరల సమస్యలను సృష్టించాయి. నిరుద్యోగం మన దేశం ఎదుర్కొంటున్నవాటిలో రెండో సమస్య. సంఘటిత రంగాల్లోనూ, అసంఘటిత రంగాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా ఎంతో మెరుగుపడాల్సివుంది. జాబ్ మార్కెట్ లో పోటీ పెరుగుతోంది. ఉద్యోగార్థుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. దానితో సమానంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పన జరగడం లేదు. నాణ్యత కూడా సవాలుగానే మారుతోంది. వీటన్నింటి విషయంలో ఇటీవల కాలంలో కొంత మెరుగుదల కనిపిస్తున్నా, అది సరిపోదు. వచ్చే త్రైమాసికంలో ఉద్యోగ ఉపాధి రంగాల్లో, ద్రవ్యోల్బణంలో కొన్ని సత్ఫలితాలు రావచ్చునని కొందరు నిపుణులు జోస్యం చెబుతున్నారు. ప్రపంచంలోని 29 దేశాలు ఆర్ధికంగా మంచిదారిలోనే ప్రయాణం చేస్తున్నాయని వినవస్తున్న మాటలు కొంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అందులో మనం కూడా వున్నామన్న సంగతి మరింత సంతోషాన్నిస్తోంది.

Also read మూగబోయిన యుద్ధనౌక

కొత్త పాఠాలు తప్పవు

సింగపూర్, భారతదేశం, ఇండోనేషియా ఆర్ధిక ప్రయాణంపై ప్రపంచ ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు. అందులో మనది అతిపెద్ద మార్కెట్. జపాన్, కొరియా దేశాల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. టర్కీ, నెదర్లాండ్స్ పరిస్థితి కూడా అంతే. అమెరికా, స్పెయిన్, కొలంబియాలలో కొంత మెరుగైన వాతావరణం అలుముకుంటున్నా, ఆర్ధికమాంద్యం భయపెడుతూనే వుంది. ఏదిఏమైనా 2023-24 ఆర్ధిక సంవత్సరం సవాళ్ళను విసురుతూనే వుంది. దీనికి తోడు సమాజం, పర్యావరణం, ప్రకృతి, మానవప్రకృతి ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్పుతూనే వున్నాయి.

Also read: నవనవోన్మేష సాహిత్యోత్సవం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles