- పేదదేశాలను పెద్దదేశాలు ఆదుకోవాలి
- అగ్రరాజ్యమైన అమెరికాకూ తప్పని మాంద్యం
- భారత్ కు ఆ ప్రమాదం లేదంటున్న నిర్మలమ్మ
‘‘టీవీలు, ఫ్రిజ్, కార్లు కొనొద్దు.. డబ్బులు దాచుకోండి’’ అని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఊరకే అవీ ఇవీ కొనుగోళ్లు చేసి ఇల్లు గుల్ల చేసుకోవద్దని ఆర్థిక నిపుణులు కూడా సూచనలు చేస్తూనే ఉన్నారు. ఆర్ధిక మాంద్యానికి దగ్గరగా ప్రపంచం జరుగుతోందనే వార్తలు వింటూనే వున్నాం. చాలా సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు, సోషల్ మీడియా సృష్టికర్తలు కూడా అదే పని చేస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్న వ్యాపారవర్గాలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వెయ్యండని వినవస్తున్న మాటలు పెడచెవిన పెట్టకపోవడమే శ్రేయస్కరం. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకూ నగదును నిల్వచేసుకోవడం ఉత్తమోత్తమం. వారి వారి ఆదాయం, ఖర్చుల స్థాయిని బట్టి క్రమశిక్షణ పాటించడమన్నమాట.బెజోస్ కు సుమారు 10లక్షల కోట్ల రూపాయల సంపద ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన సంపదలో కొంత పర్యావరణ పరిరక్షణకు వెచ్చిస్తానని కూడా ఆయన మాట ఇవ్వబోతున్నారు. ఆపాటి దాతృత్వం అభినందనీయం. కాకపోతే బెజోస్ కు చెందిన అమెజాన్ సంస్థలోనూ ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.
Also read: నిరంకుశుడైన అక్షరయోధుడు ముట్నూరి కృష్ణారావు
అమెజాన్ వింత వైఖరి
ఆ సంస్థకు చెందిన సుమారు 10వేల మంది రోడ్డు మీద పడనున్నారు. దానధర్మాలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రశంసాపాత్రమే. దానికి మించి, తన దగ్గర పనిచేస్తున్న సగటు ఉద్యోగులను గాలికి వదిలెయ్యడం సరియైనది కాదు. పర్యావరణ పరిరక్షణకు నిధుల కేటాయింపు ప్రకటన కంటే ముందు తన ఉద్యోగులకు ఎటువంటి హనీ జరగదని ప్రకటిస్తే ఎల్ల లోకం హర్షిస్తుంది. ఇప్పటికే ట్విట్టర్, మెటా వంటి సోషల్ మీడియా గ్రూపులు ఉద్యోగుల ఉద్వాసనా పర్వానికి తెరదీశాయి. ఆ యా సంస్థల సిబ్బంది కొత్త కొలువులు వెతుక్కొనే పనిలో పడ్డారు. ఈ దశలో కొత్త ఉద్యోగాలకు సంబంధించిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్ 25%-30% వరకూ తగ్గుముఖం పట్టవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపికైన వారిలో కొందరికి అప్పాయింట్ మెంట్ లెటర్స్ కూడా రావడం లేదని సమాచారం. కొంతమందికి తిరస్కరణ మెయిల్స్ కూడా వస్తున్నాయని చెబుతున్నారు. నియామకాలు కూడా దశలవారీగా జరుగుతున్నాయి. ముందు ముందు ఎలా ఉండబోతుందో చెప్పలేని పరిస్థితులే నెలకొంటున్నాయి. ప్రపంచ ఆర్ధిక ప్రయాణం మాంద్యం దిశగా సాగుతోందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్ పాస్ ఇటీవలే వ్యాఖ్యానించారు. పేద దేశాలకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత పెద్ద దేశాలకు ఉందనీ ఆయన సూచించారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, పెట్టుబడుల కోత పేద వర్గాలపై పెద్ద ప్రభావం చూపించనున్నాయి. కొన్ని దేశాలు అధిక రుణభారాన్ని ఎదుర్కొంటున్నాయి. వాటిపై పడే వడ్డీలు మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. కొన్ని దేశాల కరెన్సీలు భారీగా పడిపోయాయి.
Also read: మంచితనం మూర్తీభవించిన సూపర్ స్టార్
పెరుగుతున్న అప్పుల భారం
దీని వల్ల వారికి అప్పుల భారం మరింత పెరుగుతోంది. ప్రపంచ బ్యాంక్ కు కూడా ఇవన్నీ సవాళ్లు విసురుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మొదలుకొని ఒక్కొక్క దేశం ఒక్కొక్క తరహా సమస్యలను ఢీకొంటోంది. మన దేశం మాంద్యం లోకి వెళ్లే ప్రసక్తే లేదని మన ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ అంటున్నారు. అన్ని రకాల చర్యలు చేపట్టామని, ఇంకా చేపడతామని ఆమె భారతీయిలకు భరోసా ఇస్తున్నారు. ప్రపంచంలో ఆర్ధిక మాంద్యం గమనం 12 నుంచి 18 నెలల వరకూ సాగవచ్చని బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆ మధ్య స్పందించారు. ఉక్రెయిన్ -రష్యా మధ్య వచ్చిన యుధ్ధోన్మాదం తెచ్చిన తంటా మామూలుది కాదు. మిగిలిన దేశాలతో పాటు ఆ రెండు దేశాలు కూడా చావు దెబ్బ తింటున్నాయి. ఆ రెండు దేశాలను యుద్ధం ముఖంగా ఎగేసిన దేశాలు నానా గడ్డీ కరుస్తున్నాయి. అయినా యుద్ధం యావ, సామ్రాజ్య కాంక్షలు చావడం లేదు. ప్రపంచంలోని 1325 మంది సీఈఓల అభిప్రాయాలను ఓ సంస్థ సేకరించింది. దాదాపు అందరూ ఆర్ధిక మాంద్యం అనివార్యమనే మాట చెబుతున్నారు. సరియైన చర్యలు చేపడుతూ ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే తీవ్ర ప్రభావాలు ఉండక పోవచ్చని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల విషయంలో మాత్రం కొంత ఆందోళనకర వాతావరణమే కనిపిస్తోంది.నిత్యావసర వస్తువుల ధరలు ఎగబాకే నేపథ్యంలో కొత్త రుణాలు తీసుకోకుండా ఉండడం మంచిదని భావించాలి. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూసుకోవడం కూడా మంచిది. ప్రతికూలతల్లోనూ ప్రయత్నాలు అపరాదు.గతంలో ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం ఎదుర్కున్నా భారతదేశం రక్షితంగా ఉంది.దానికి కారణం సగటు భారతీయుడి ఆర్ధిక ఆలోచనా విధానం, అలవాట్లు ప్రధాన సూత్రాలని ప్రపంచ ఆర్ధిక శాస్త్రవేత్తలు కూడా కితాబు ఇచ్చారు. ఈ మాంద్యాన్ని కూడా జయిస్తామని విశ్వసిద్దాం.
Also read: ధార, ధారణ సంవిధాన ధౌరేయులు కొప్పరపు కవులు